ఎగిరి పోతే ఎంత బావుంటుందో
ఒకప్పుడు గగనతలంలో ప్రయాణం అన్నది ఓ అంతులేని కల. కానీ అదిప్పుడు కళ్ళముందు సాక్షాత్కారం అవుతోంది. మానవ మేధస్సుకు విమానయానం ఓ మచ్చుతునుక. ప్రపంచ మంతటా దేశాల మధ్య సరిహద్దులు చెరిగి పోయాయి. విమానాల రాకపోకలతో మనుషుల మధ్య బంధాలు బలపడ్డాయి. ఇప్పుడు చేతుల్లో కాసులుంటే చాలు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు. ఆ అవకాశాలు మెండుగా ఉన్నాయి. తాజాగా ఇండియా నుంచి అధికంగా ఇతర దేశాలకు వెళ్లారు. అంతే కాకుండా మన హైదరాబాద్ నుంచి భారీగా బయలుదేరారు. నగరం నుంచి అనేక జాతీయ, అంతర్జాతీయ నగరాలకు పెరిగిన విమాన సదుపాయాలతో ఏటేటా ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. ఇక్కడి నుంచి 55 ప్రధాన నగరాలకు నేరుగా ఫ్లైట్ కనెక్టివిటీ ఉంది.
ఎయిర్‌లైన్స్ సంస్థలు చార్జీల పైన ఇస్తున్న రాయితీలు, ఆఫర్లు కారణంగా జర్నీ చేసేందుకు మనోళ్లు తెగ ముచ్చట పడుతున్నారు. ఫ్లైట్ చార్జీలు రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ చార్జీలతో సమానంగా ఉంటున్నాయి. దీంతో గంటల తరబడి రైళ్లలో ప్రయాణం చేసే కంటే ఫ్లయిట్ జర్నీ బాగుంటుందని జనం దీనికే ప్రయారిటీ ఇస్తున్నారు. పోయిన ఏడాది హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుంచి 2.13 కోట్ల మంది పయనించగా వారిలో 1.74 కోట్ల మంది డొమెస్టిక్ ప్రయాణికులు. మరో 39 లక్షల మంది అంతర్జాతీయ ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికుల పెంపుదల 10 శాతం వరకు నమోదు కాగా, అంతర్జాతీయ ప్రయాణికుల పెంపుదల 9 శాతం వరకు నమోదైనట్లు జీఎమ్మార్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు తెలిపింది. హైదరాబాద్ నుంచి దిల్లీ, ముంబయి, బెంగళూర్, కోల్‌కత్తా, చెన్నై నగరాలకు ఎక్కువగా రాక పోకలు సాగిస్తున్నారు.
శబరికి వెళ్తున్న అయ్యప్ప భక్తులు ఇప్పుడు ట్రైన్ జర్నీ కంటే ఫ్లైట్ జర్నీ వైపే మొగ్గు చూపుతున్నారు. కొత్తగా గోరఖ్‌పూర్, గ్వాలియర్, బెల్గాం, మైసూర్, నాసిక్, తిరుచిరాపల్లి తదితర నగరాలకు ఫ్లైట్ కనెక్టివిటీ అందుబాటు లోకి వచ్చింది. మరోవైపు ప్రధాన అంతర్జాతీయ నగరాలకు హైదరాబాద్ నుంచి కనెక్టివిటీ ఉండడంవల్ల ఏటేటా అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతోంది. అమెరికా, దుబాయ్, సౌదీ అరేబియా, కువైట్, థాయ్‌లాండ్‌కు ఎక్కువ మంది రాకపోకలు సాగిస్తున్నారు. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 2008లో 8 డొమెస్టిక్, 21 ఇంటర్నేషనల్ నగరాలతో ప్రారంభమైన సేవలు ఇప్పుడు 71 నగరాలకు విస్తరించాయి. 25 ఎయిర్‌లైన్స్ విమాన సర్వీసులను నడుపుతున్నాయి.
రెండో రన్‌వే సైతం అందుబాటులోకి వచ్చింది. కర్ణాటక, మహారాష్ట్ర, చత్తీస్‌గడ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లకు హైదరాబాద్ నుంచి ఫ్లైట్ సదుపాయాలు గణనీయంగా విస్తరించాయి. మరోవైపు పలు ఆసియా దేశాలకు కేవలం 5 గంటల వ్యవధిలో చేరుకొనే సదుపాయం ఉంది. అలాగే దేశంలోని ప్రధాన నగరాలకు సైతం 2 గంటల్లోపే చేరుకోవచ్చు. ఏటా కొత్త నగరాలకు సర్వీసులు విస్తరిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య 3 కోట్లు దాటవచ్చునని అంచనా. ఇందుకను గుణంగానే ఎయిర్‌పోర్టును విస్తరిస్తున్నారు. ప్రయాణికుల భద్రత విషయంలోనూ ఫేషియల్ రికగ్నిషన్, బాడీస్కానింగ్ వంటి అత్యాధునిక సాంకేతిక పద్ధతులు ప్రయోగాత్మకంగా అమల్లోకి వచ్చాయి. మొత్తం మీద బస్సులు, ట్రైన్స్ కంటే విమానాలు బెటర్ అంటున్నారు మనోళ్లు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి