అమరావతికి నో ఛాన్స్

జగన్ మోహన్ రెడ్డి తాను అనుకున్నట్టు గానే చేసేస్తున్నారు. ఎవ్వరు ఎన్ని అభ్యంతరాలు చెప్పినా తాను అనుకున్నది చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే బ్లూ ప్రింట్ కూడా రెడీ కావడం తో ఇక అనుమానాలకు తెర దించినట్లయింది. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ తన పూర్తి నివేదికను సమర్పించింది. ఇది పూర్తిగా అమరావతి ఎంత మాత్రం కేపిటల్ సిటీకి అనువు కాదంటూ స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా గ్రీన్‌ ఫీల్డ్‌ మెగా సిటీల నిర్మాణాలు విఫల ప్రయోగాలుగా మిగిలి పోయాయని బీసీజీ వెల్లడించింది. అమరావతి విషయంలో అలాంటి ప్రయోగం రాష్ట్ర ప్రజలకు నష్ట దాయకమని.. సంపదంతా ఒకే చోట పోగై మిగతా ప్రాంతాలకు అన్యాయం జరుగుతుందని హెచ్చరించింది.  అమరావతి నిర్మాణం ఆర్థికంగా లాభ దాయకం కాదని, పైగా రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలోకి నెట్టేస్తుందని.. అందువల్ల ఆశించిన ప్రయోజనాలు చేకూరవని స్పష్టం చేసింది.

అప్పు చేసి ఒకే చోట లక్ష కోట్లకు పైగా ఖర్చు పెడితే.. వెనుకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలకు అన్యాయం చేయడమేనని తేల్చి చెప్పింది. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి మార్గం సుగమం చేయవచ్చని పేర్కొంది. ప్రపంచంలో గత 50 ఏళ్ల అనుభవాల్ని పరిశీలిస్తే.. 30కుపైగా గ్రీన్‌ ఫీల్డ్‌ మెగా సిటీలు నిర్మాణాల్ని చేపడితే అందులో కేవలం రెండు నగరాలు మాత్రమే 50 శాతం లక్ష్యాన్ని సాధించాయని.. మిగతా మెగా సిటీలు 6,7 శాతానికి చేరుకోలేక విఫల మయ్యాయని బోస్టన్‌ అధ్యయనం వెల్లడించింది. అధికార వికేంద్రీకరణ కోసం రెండు ఆప్షన్లు ఇస్తూ.. విశాఖ, అమరావతి, కర్నూలు పట్టణాల్లో పరిపాలనను వికేంద్రీకరించాలని సూచించింది.  ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ అప్పు 2.25 లక్షల కోట్లకు చేరుకుంది.

గత ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక మేరకు అమరావతి నిర్మాణానికి 2045 నాటికి  80 వేల నుంచి 1.20 లక్షల కోట్లు ఖర్చు చేయాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇది శక్తికి మించిన భారం. ఇందులో 95 శాతం అప్పు రూపంలోనే సమకూర్చు కోవాల్సి ఉంటుంది. ఇంత ఖర్చు పెట్టినా అమరావతి నగరంలో ఏటా 15 నుంచి 16 శాతం జనాభా వృద్ది చెందితే 2045 నాటికి అమరావతి నుంచి 8 వేల నుంచి10 వేల కోట్ల ఆదాయం మాత్రమే వస్తుంది. గ్రీన్‌ ఫీల్డ్‌ సిటీలు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి తప్ప, సామాన్య ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు ఏమాత్రం దోహద పడవని బీసీజీ విశ్లేషించింది. ప్రపంచంలో గత 50 ఏళ్లలో 7 దేశాల కేపిటల్‌ సిటీల నిర్మాణాల్ని చేపడితే అందులో కేవలం ఒకటి మాత్రమే లక్ష్యాన్ని చేరుకుందని, మిగతా నగరాలు లక్ష్యంలో 30 శాతం కూడా చేరుకోలేదని పేర్కొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!