కేరళకు కేంద్రం షాక్

కేంద్రంలో కొలువుతీరిన బీజేపీ సర్కార్ తనకు ఎదురు తిరిగే ప్రతి రాష్ట్రాన్ని టార్గెట్ చేస్తోంది. గణతంత్ర దినోత్సవం రోజున ఆయా రాష్ట్రాలకు చెందిన శకటాలను ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే బీజేపీని పూర్తిగా వ్యతిరేకించే పార్టీలు కొలువు తీరిన ఆయా రాష్ట్రాలకు కేంద్ర హోమ్ శాఖ ఇప్పటికే నో చెప్పేసింది. తాజాగా కేరళ రాష్ట్ర సర్కార్ కు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. దేశ గణతంత్ర దినోత్సవం వేడకల్లో తమ శకటాన్ని ప్రదర్శించాలనుకున్న కేరళ ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. శకట ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలన్న విజ్ఞప్తిని కేంద్ర రక్షణ శాఖ తిరస్కరించింది. వివిధ కారణాలతో శకటాన్ని అనుమతించడం లేదని ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. కాగా కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం అమలును ఉప‌సంహ‌రించాల‌ని కోరుతూ కేరళ అసెంబ్లీలో చట్టానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

కేర‌ళ‌లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా పౌరసత్వ చట్టాన్ని అమలు చేయబోమని సీఎం స్పష్టం చేశారు. అంతే కాకుండా సీఏఏ, ఎన్‌ఆర్‌సీ వంటి వివాదాస్పద చట్టాలను కేరళ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కాగా పబ్లిక్‌డే పరేడ్‌లో తమ శకటాలని ప్రదర్శించాలన్న మహారాష్ట్ర, బెంగాల్‌, బిహార్‌ ప్రభుత్వాల విజ్ఞప్తిని కేంద్రం ఇది వరకే తిరస్కరించింది. వివిధ కారణాలు చూపుతూ ఆ రాష్ట్ర శకటాలని నిరాకరించింది. 2020 గణతంత్ర దినోత్సవ కవాతులో మహారాష్ట్ర, బెంగాల్‌ ప్రభుత్వాల శకటాలని అనుమతించ బోమని రక్షణ శాఖ ప్రకటించింది. ఈ నిర్ణయంపై మహారాష్ట్ర, బెంగాల్‌ ప్రభుత్వాలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి.

శివసేన రాజ్యసభ సభ్యుడు సంజయ్‌రౌత్‌ దీని వెనుక కేంద్రం కుట్ర ఉందని, అదేమిటో బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ సుప్రియా సూలే ఈ విషయంలో కేంద్రాన్ని తప్పు బట్టారు. కేంద్రం చర్య మహారాష్ట్ర, బెంగాల్‌ ప్రభుత్వాలకు అవమానకరమని ఆమె వ్యాఖ్యానించారు. బెంగాల్‌పై కేంద్రం వివక్షతతో వ్యవహరిస్తోందని, పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించినందున రాష్ట్రాన్ని లక్ష్యంగా చేసుకుంటోందని తృణమూల్‌ ఎంపీ సౌగతా రాయ్‌ అన్నారు. కాగా పరేడ్‌లో పాల్గొనే శకటాల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది.

కామెంట్‌లు