ఏపీ బ్లూ ప్రింట్ రెడీ
తాను అనుకున్నట్టు గానే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారు. ఏపీపై తన ముద్ర ఉండేలా ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే ఆయన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు పరుగులు పెట్టేలా యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని ఆదేశించారు. ఆ మేరకు నిపుణులతో సమగ్ర ప్రణాళిక రూపొందింది. ఇందు కోసం ఏర్పాటు చేసిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. రాష్ట్ర సమగ్ర, సమతుల్య అభివృద్ధికి పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణే ఏకైక మార్గమని స్పష్టం చేసింది. న్యాయ, శాసన, పరిపాలన వ్యవస్థలను వికేంద్రీకరిస్తూ రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. అందుకు ప్రభుత్వానికి రెండు ఆప్షన్లను సూచించింది.
రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి సాధిస్తూ.. అన్ని రంగాల్లో రాష్ట్ర పురోభివృద్దికి ఓ స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను రూపొందించింది. మూడు ప్రాంతాల ప్రాధాన్యత, సహజ వనరులు, అభివృద్ధి అవకాశాలను విశ్లేషిస్తూ సమగ్రాభివృద్ధికి కీలక సూచనలు చేసింది. రాజధాని విషయంలో వివిధ దేశాల్లోని పరిస్థితులను ఉదహరిస్తూ ఆర్థిక భారం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని సిఫార్సులు చేసింది. న్యాయ, శాసన, పరిపాలనా వ్యవస్థలను విశాఖపట్నం, అమరావతి, కర్నూలులో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది.ప్రాంతీయ ప్రాతినిథ్యం, సమన్వయం, వ్యయం, ప్రజల సౌలభ్యం కోణాల్లో రెండు ఆప్షన్ల అనుకూల, ప్రతికూల అంశాలను బీసీజీ విశ్లేషించింది. రెండు ఆప్షన్లనూ పరిశీలించి, రాష్ట సమగ్రాభివృద్ధి, ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల్లోని ఉదాహరణలను పరిశీలించి రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణ, ప్రధానంగా రాజధాని వ్యవస్థ ఎలా ఉండాలన్నది బీసీజీ పేర్కొంది. పరిపాలన వికేంద్రీకరణతో బహుళ రాజధానుల వ్యవస్థ ఉండటంతోనే ప్రాంతీయ సమానాభివృద్ధి సాధ్యమని పేర్కొంది. తద్వారానే ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం సాధ్యమవుతుందని చెప్పింది. తక్కువ వ్యయంతో రాజధాని వ్యవస్థ ఏర్పాటు ద్వారా ప్రజలకు మెరుగ్గా, సులువుగా పౌర సేవలు అందించగలమని అభిప్రాయ పడింది. జర్మనీ, దక్షిణ కొరియా తదితర దేశాల్లో ఈ విధంగానే సమగ్రాభివృద్ధి సాధిస్తూ, ప్రజలకు మెరుగైన రీతిలో సేవలు అందిస్తున్నారని ఉదహరించింది. అన్ని అంశాలను పరిశీలించి, విశ్లేషించిన మీదట రాష్ట్రంలో కర్నూలు, అమరావతి, విశాఖపట్నం నగరాలను రాజధాని ఏర్పాటు కోసం పరిగణనలోకి తీసుకోవాలని సిఫార్సు చేసింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి