డబ్బులు మాయం..ఖాతాదారులు భద్రం

కస్టపడి దాచుకున్న డబ్బులకు భద్రత లేకుండా పోతోంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా మోసాలకు కేరాఫ్ గా మారాయి. తాజాగా దేశీయ అతి పెద్ద బ్యాంకు స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఖాతాదారులకు షాకింగ్‌ న్యూస్‌ ఇచ్చింది. ఎస్‌బీఐ ఖాతాల్లో డబ్బులు అనూహ‍్యంగా మాయమై పోతున్నాయన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. నకిలీ చెక్కుల ద్వారా కోట్లాది రూపాయలు మోసగాళ్ల చేతుల్లోకి పోతున్నాయి. దేశంలోని అత్యున్నత వైద్య సంస్థ ఎయిమ్స్ బ్యాంకింగ్ మోసానికి గురైంది. దీంతో ఎస్‌బీఐ వివిధ నగరాల్లోని తన అన్ని శాఖలను అప్రమత్తం చేసింది. పెద్ద మొత్తంలో ఉన్న నాన్‌ హోం చెక్కుల క్లియరింగ్‌పై కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఎస్‌బీఐ ఫ్రాడ్ మానిటరింగ్ సెల్ వాట్సాప్ సమాచారాన్ని తన బ్రాంచీలకు అందిస్తోంది.

వివరాల్లోకి వెళితే, ఎయిమ్స్‌ కు చెందిన ఎస్‌బీఐ రెండు ఖాతాల్లోని 12 కోట్ల రూపాయలకు పైగా సొమ్ము గల్లంతైనట్టు గుర్తించారు. ఎయిమ్స్ డైరెక్టర్ నిర్వహిస్తున్న ప్రధాన ఖాతా నుంచి 7 కోట్లు, రీసెర్చ్ ఆఫ్ ఎయిమ్స్ డీన్స్‌కు చెందిన మరో ఖాతా నుంచి మరో 5 కోట్ల నగదు అక్రమంగా తరలి పోయాయి. గత రెండు నెలల్లోనే ఈ మోసం జరిగినట్టు సంస్థ ఆలస్యంగా గుర్తించింది. అధీకృత సంతకాలులేని నకిలీ చెక్కులకు చెల్లింపులు చేయడంలోని వైఫల్యానికి ఆయా శాఖలే కారణమని ఎయిమ్స్‌ ఆరోపిస్తోంది. ప్రోటోకాల్‌ను అనుసరించడంలో ఎస్‌బీఐ విఫలమైందని, తాము పోగొట్టుకున్న నగదును జమ చేయాలని బ్యాంకును కోరింది.ఈ కుంభకోణంపై దర్యాప్తు కోరుతూ ఏయిమ్స్ వర్గాలు ఇప్పటికే ఢిల్లీలోని ఆర్థిక నేరాల విభాగాన్ని సంప్రదించాయి.

దీనికి సంబంధించి ఒక నివేదికను కూడా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సమర్పించింది. ఈ మోసం వెలుగులోకి వచ్చిన తరువాత కూడా, గత వారం డెహ్రాడూన్ నుంచి 20 కోట్లు, ఎస్‌బీఐ నాన్ హోమ్ శాఖల నుంచి 9 కోట్లు క్లోన్ చెక్కుల ద్వారా 29 కోట్లకు పైగా నగదును అక్రమంగా విత్‌డ్రా చేసుకునే ప్రయత్నాలు జరిగాయని పీటీఐ పేర్కొంది.
బ్యాంకు సూచనల మేరకు ఏదైనా నాన్-హోమ్ బ్రాంచ్‌లో నుంచి 2 లక్షలకు పైగా విలువైన చెక్‌ వస్తే దాన్ని క్లియర్ చేయడానికి లేదా డబ్బు బదిలీ చేయడానికి ముందు ధృవీకరణ కోసం కస్టమర్‌ను సంప్రదించాలని ఎస్‌బీఐ సూచిస్తోంది. అయితే 25 వేలకు పైన లావాదేవీలను కూడా తాము పరిశీలిస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా 3 కోట్లకు పైగా బ్యాంకు మోసం జరిగినట్లు తెలిస్తే, బ్యాంక్ సీబీఐకి  ఫిర్యాదు చేస్తుంది.

కామెంట్‌లు