మానవాభివృద్ధిలో ఇండియా వెనుకంజ

సామాజిక, రాజకీయ, ఆర్ధిక, వ్యాపార, వాణిజ్య రంగాల్లో వెనుకబాటుకు గురైన ఇండియా తాజాగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిన ప్రపంచ మానవాభివృద్ధి సూచీలో పూర్తిగా వెనుకబడి పోయింది. ఓ వైపు నమో నమామి మోదీ సునామీ అంటూ ఊదర గొడుతున్న బీజేపీ ప్రభుత్వానికి ఈ నివేదిక ఓ చెంప పెట్టు లాంటిది. సర్కారు పని తీరుకు ఇది నిదర్శనం. ఇప్పటికే ఆర్ధిక మందగమనంలో ఉన్న ఈ దేశానికి ఓ హెచ్చరిక కూడా. నిరుద్యోగం పెచ్చరిల్లి పోయింది. దారుణాలు, ఆర్ధిక నేరాలు చోటు చేసుకుంటున్నా అడిగే దిక్కే లేకుండా పోయింది. పట్ట పగలు మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డోంట్ కేర్ అంటున్నాయి. జవాబుదారీ తనం చూద్దామంటే అగుపించడం లేదు. ఇక తాజాగా ప్రకటించిన జాబితాలో భారత్‌ 129వ స్థానంలో నిలిచింది.

ఐక్యరాజ్యసమితి..ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం నివేదిక – 2019ను విడుదల చేసింది. తొలి మూడు స్థానాల్లో నార్వే, స్విట్జర్లాండ్, ఐర్లాండ్‌ నిలిచాయి. పాకిస్తాన్‌ 152వ స్థానంలో ఉంది. అట్టడుగున 189 స్థానంలో నైగర్‌ ఉంది. 189 దేశాలతో జాబితా రూపొందించింది. 2005–06 నుంచి 2015–16 వరకు 27.1 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయట పడినట్టు యూఎన్‌డీపీ ఇండియా ప్రతినిధి షోకో నోడా వెల్లడించారు. 2018లో భారత్‌ 130వ స్థానంలో ఉంది. మూడు దశాబ్దాలుగా జరుగుతున్న అభివృద్ధి కారణంగా పేదరికంలోనూ, భారతీయుల ఆయుర్దాయంలోనూ, విద్య, వైద్య సదుపాయాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయని రిపోర్టు వెల్లడించింది.

1.3 బిలియన్ల మంది నిరుపేదల్లో 28 శాతం మంది భారత్‌లో ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకా స్త్రీలు, బాలికలు అసమానతల సవాళ్ళను ఎదుర్కొంటూనే ఉన్నారు. భర్తల చేతిలో హింసకు గురౌతున్న మహిళలు సింగపూర్‌లో అతి తక్కువ. దక్షిణాసియాలో 31 శాతం మంది మహిళలు భర్తల చేతిలో హింసకు గురౌతున్నారు. లింగ అభివృద్ధి సూచీలో దక్షిణాసియా దేశాల సగటు కంటే భారత్‌ కొద్దిగా మెరుగైన స్థితిలో ఉండటం శుభసూచకం. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!