ఆదుకోక పోతే మూయడమే

కేంద్రానికి చెల్లించాల్సిన పాత బకాయిలకు సంబంధించి ప్రభుత్వం ఊరట చర్య లేమీ తీసుకోక పోతే కంపెనీని మూసి వేయక తప్పదని టెలికం సంస్థ వొడాఫోన్‌, ఐడియా చైర్మన్‌ కుమార మంగళం బిర్లా స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి ఏ రకమైన తోడ్పాటూ లేకపోతే ఇక వొడాఫోన్‌ ఐడియా కథ ముగిసినట్లే. ఇందులో ఇంకా పెట్టుబడులు పెట్టడం వల్ల ప్రయోజనమేమీ ఉండదు. సంస్థను మూసేయాల్సి ఉంటుందన్నారు. అయితే, ఎకానమీని గాడిలో పెట్టే దిశగా.. సంక్షోభంలో ఉన్న టెలికం రంగాన్ని గట్టెక్కించేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. టెలికం అనేది చాలా కీలక రంగమని ప్రభుత్వం గుర్తించింది. మొత్తం డిజిటల్‌ ఇండియా కార్యక్రమమంతా దీనిపైనే ఆధారపడి ఉంది. ఇది నిలదొక్కు కోవాల్సిన అవసరం ఉంది కాబట్టి..సర్కారు నుంచి మరింత తోడ్పాటు అవసరం అని ఆయన చెప్పారు.

ఏ రకమైన ఊరట చర్యలు కోరుకుంటున్నారన్న ప్రశ్నపై స్పందిస్తూ..ప్రధానమైన సమస్య.. సవరించిన స్థూల ఆదాయం  వివాదమే. ఇది ప్రస్తుతం కోర్టులో ఉంది. ప్రభుత్వమే టెల్కోలకు వ్యతిరేకంగా ఈ కేసు వేసింది. చర్చల ద్వారా దీన్ని పరిష్కరించవచ్చు అని బిర్లా పేర్కొన్నారు. ఏజీఆర్‌ లెక్కింపు వివాదంలో ఇటీవల కేంద్రానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో టెలికం సంస్థలు ఏకంగా1.4 లక్షల కోట్ల మేర లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బకాయీలు కట్టాల్సి రానుంది. దీంతో వీటికి కేటాయింపులు జరపాల్సి రావడం వల్ల 50,921 కోట్ల మేర రికార్డు స్థాయిలో నష్టాలు ప్రకటించడం తెలిసిందే. ఎకానమీకి ఊతమిచ్చేందుకు కార్పొరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించటం మాత్రమే సరిపోదని, ఆర్థికంగా తోడ్పాటు నిచ్చేలా పటిష్టమైన ఉద్దీపన ప్యాకేజీ లాంటిది అవసరమని బిర్లా చెప్పారు.
ఆ రూపంలో వచ్చే నిధులతో కొన్ని కార్పొరేట్లు రుణ భారం తగ్గించు కోగలవని, మరికొన్ని ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింతగా విస్తరించు కోగలవని వివరించారు.

ఎకానమీని గట్టెక్కించడానికి ఆదాయ పన్ను రేటును తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోందన్న వార్తలపై స్పందించారు. ఇది కేవలం వినియోగ డిమాండ్‌ పెంచడానికే పరిమితమైన సమస్య కాదు. ఆదాయాలు తక్కువగా ఉన్నాయి. ప్రజలు మరింతగా ఖర్చు చేయడానికి ఇష్టపడటం లేదు. దీన్నుంచి బైట పడాలంటే.. ఉద్దీపన చర్యలు ప్రకటించడం ఒక్కటే మార్గం. జీఎస్‌టీని 15 శాతానికి తగ్గిస్తే చాలు అదే పెద్ద ఉద్దీపన చర్య అవుతుందన్నారు. మరోవైపు ఇన్‌ఫ్రాపై ప్రభుత్వం మరింతగా పెట్టుబడులు పెట్టడం కూడా ఎకానమీపై బాగా సానుకూల ప్రభావం చూపగలదని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు అంచనాలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఏకంగా 6.1 శాతం నుంచి 5 శాతానికి కుదించిన నేపథ్యంలో బిర్లా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!