కంపెనీల మోత..కస్టమర్లకు దెబ్బ

నిన్నటి దాకా కస్టమర్లకు బంపర్ ఆఫర్స్ పేరుతో బురిడీ కొట్టించిన తెల్కం కంపెనీలు ఇప్పుడు బిల్లుల మోత ముగించేందుకు రెడీ అవుతున్నాయి. అపరిమిత డేటా వినియోగం పెరిగినా, మార్కెట్లో పోటీ తీవ్రతరం కావడం కూడా ఇందుకు ప్రధాన కారణమవుతోంది. భారీ నష్టాలు, పేరుకు పోయిన రుణాలు, సుప్రీంకోర్టు తాజా తీర్పుతో కేంద్రానికి వేల కోట్లు చెల్లించాల్సి రావటంతో కంపెనీలకు పాలుపోవడం లేదు. ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే వినియోగదారులపై భారం మోపాల్సిందేనని టెలికం కంపెనీలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగా కాల్‌ చార్జీలను పెంచ బోతున్నాయి. వచ్చే నెల నుంచి కాల్‌ చార్జీలను పెంచనున్నట్లు వొడాఫోన్‌ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌ ప్రకటించాయి.

అచార్జీల పెంపు ఎంత మేర ఉంటుందనేది మాత్రం నిర్దిష్టంగా వెల్లడించ లేదు. కస్టమర్లకు అంతర్జాతీయ స్థాయి డిజిటల్‌ సేవలు అందించడాన్ని కొనసాగించే క్రమంలో టారిఫ్‌లు పెంచబోతున్నాం అని వొడాఫోన్‌ ఐడియా ప్రకటించింది. కొద్ది సేపటికే భారతీ ఎయిర్‌టెల్‌ కూడా తమ రేట్ల పెంపు ప్రతిపాదనలు వెల్లడించింది. అతి వేగంగా మారుతున్న టెక్నాలజీకి తగ్గట్టు టెలికం రంగంలో భారీ పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది. డిజిటల్‌ ఇండియా కల సాకారం కావాలంటే టెలికం పరిశ్రమ లాభదాయకంగా ఉండటం ముఖ్యం. ఈ నేపథ్యంలోనే చార్జీలను తగు రీతిలో పెంచనున్నాం అని ఎయిర్‌టెల్‌ పేర్కొంది. రిలయన్స్‌ జియో రాకతో టెల్కోల మధ్య అత్యంత చౌక చార్జీల పోరాటాలు ఆరంభమైన సంగతి తెలిసిందే.

దీనికి తెరదించేలా అందరికీ కనీస చార్జీలను నిర్దేశించాలని కేంద్రం యోచిస్తున్న పరిస్థితుల్లో వొడాఫోన్‌ ఐడియా, ఎయిర్‌టెల్‌ నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది. ప్రస్తుతం వొడాఫోన్‌ ఐడియా నెలవారీ మొబైల్‌ సేవల ప్లాన్లు డేటా లేకుండా కనిష్టంగా 24 నుంచి, డేటాతో కలిసి ఉన్నట్లయితే 33 నుంచి ప్రారంభమవుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుతో కేంద్రానికి లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బాకీల కింద ఏకంగా 1.4 లక్షల కోట్ల దాకా టెలికం సంస్థలు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తంలో ఛార్జీలతో పాటు వాటిపై వడ్డీలు, పెనాల్టీలు, పెనాల్టీలపై వడ్డీలు కూడా కలిసి ఉన్నాయి.

మూడు నెలల్లో బకాయిలు చెల్లించాల్సిందేనంటూ టెలికం విభాగం ఆయా కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. వొడా ఫోన్‌ ఐడియా, ఎయిర్‌టెల్‌ రెండూ కలిపి 74,000 కోట్ల నష్టాలు ప్రకటించాయి. దివాలా తీసిన అనిల్‌ అంబానీ సంస్థ రిలయన్స్‌ కమ్యూనికేషన్‌ కూడా కేటాయింపులతో కలిసి 30,142 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. ఈ మూడు సంస్థల మొత్తమే లక్ష కోట్లు దాటేసింది. ఇందులో ఒక్క ఐడియా వాటాయే 50,921 కోట్లు. దేశీయంగా ఓ కార్పొరేట్‌ కంపెనీ ఈ స్థాయి నష్టాలు ప్రకటించడం ఇదే రికార్డు. మొత్తం మీద కస్టమర్స్ నెత్తిన బిల్లులు బాదేందుకు రెడీ అవుతున్నాయి.

కామెంట్‌లు