మంద గమనంలో మార్కెట్

కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఉద్దీపన చర్యలు తీసుకుంటున్నా ఇండియన్ మార్కెట్ మాత్రం అంతకంతకూ దిగజారుతోంది. దీని ప్రభావం అన్ని వ్యాపార రంగాలపై పడుతోంది. ఆర్థిక మందగమన భయాలతో భారతీయ స్టాక్‌ మార్కెట్‌ తీవ్రంగా నష్ట పోయింది. దీంతో రెండు ట్రేడింగ్‌ సెషన్ల లాభాలకు బ్రేక్‌ పడింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉన్నప్పటికీ, భారత వృద్ధి మంద గించగలదన్న వివిధ సంస్థల నివేదికలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను పూర్తిగా దెబ్బ తీశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ స్వల్పంగా తగ్గడం కూడా ప్రతికూల ప్రభావం చూపించింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 72 పాయింట్లు పతనమై 40,284 పాయింట్ల వద్ద ముగిసింది.

ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11 పాయింట్ల నష్టంతో 11,885 పాయింట్ల వద్ద ముగిశాయి. ప్రైవేట్‌ బ్యాంక్, ఐటీ, ఇంధన, ఎఫ్‌ఎమ్‌సీజీ, వాహన షేర్లు మరింతగా క్షీణించాయి. సెన్సెక్స్‌ లాభాల్లో ఆరంభమైనా, అర గంటకే నష్టాల్లోకి జారి పోయింది. కొంత సమయం పాటు లాభ, నష్టాల మధ్య కొనసాగినా, ఆ తర్వాత పూర్తిగా నష్టాల్లోనే ట్రేడైంది. ఒక దశలో 185 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌ మరో దశలో 135 పాయింట్లు పతనమైంది. మొత్తం మీద రోజంతా 320 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. కంపెనీల క్యూ2 ఫలితాల సీజన్‌ పూర్తి కావడం, ఈ వారంలో ప్రధానమైన ఈవెంట్స్‌ ఏమీ లేకపోవడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.

దీంతో సెన్సెక్స్, నిఫ్టీలు పరిమిత శ్రేణిలో కదలాడాయి. కీలక వడ్డీ రేటును చైనా తగ్గించడంతో ప్రపంచ మార్కెట్లు లాభపడ్డాయి. ఈ ప్రభావంతో మన దగ్గర నష్టాలకు కళ్లెం పడిందని నిపుణులు అభిప్రాయపడ్డారు. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించి సానుకూల వార్తలు రావడంతో లోహ షేర్లు భారీగా లాభ పడ్డాయి. ఇదిలా ఉండగా ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగిస్తే, యూరప్‌ మార్కెట్లు మిశ్రమంగా మొదలు కావడం గమనార్హం. ఇంకో వైపు భారత విత్త మంత్రి నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు రెడీగా ఉన్నా, అవేవి ప్రభావం చూపించలేక పోతున్నాయి. 

కామెంట్‌లు