బాబుకు ఏసీబీ ఝలక్

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ ప్రెసిడెంట్ నారా చంద్రబాబు నాయుడుకు సంబంధించి ఆదాయానికి మించి ఆస్తుల కేసులో హైదరాబాద్‌ లోని అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానం ఝలక్ ఇచ్చింది. 14 ఏళ్ల క్రితం ఏసీబీ కోర్టులో లక్ష్మీపార్వతి దాఖలు చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టేందుకు ఏసీబీ కోర్టు అంగీకరించింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ కేసులో చంద్రబాబు స్టే గడువు ముగియడం, హైకోర్టు నుంచి ఎలాంటి పొడిగింపు లేక పోవడంతో కేసులో తదుపరి ప్రక్రియను ప్రారంభిస్తామని ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జి సాంబశివరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఫిర్యాదుదారుగా ఉన్న లక్ష్మీపార్వతి సాక్ష్యాన్ని నమోదు చేయాలని, తదుపరి విచారణను కోర్టు వాయిదా వేసింది.

సివిల్, క్రిమినల్‌ కేసుల్లో స్టే ఆరు నెలలకు మించ కూడదని సుప్రీంకోర్టు గత ఏడాది తీర్పు ఇచ్చింది. దీంతో చంద్రబాబు స్టే గడువు ముగిసిన విషయాన్ని, ఆ స్టేకు ఎలాంటి పొడిగింపు లేక పోవడాన్ని జడ్జి తన ఉత్తర్వుల్లో పొందుపరిచారు. విచారణ సందర్భంగా చంద్రబాబు తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ, తదుపరి ఉత్తర్వులు వెలువరించేంత వరకు 2005లో హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులు కొనసాగుతాయని వాదించారు. లక్ష్మీపార్వతి తరఫు న్యాయవాది సురేందర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ, సివిల్, క్రిమినల్‌ కేసుల్లో స్టే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తు చేశారు. ఆ స్టే పొడిగింపు ఉత్తర్వులు లేవని కోర్టుకు వివరించారు.

2005 మార్చి 14న అప్పట్లో ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను జడ్జి పరిశీలించారు. హైకోర్టు ఇచ్చిన స్టేను పొడిగించని విషయాన్ని, చంద్రబాబు తరఫు న్యాయవాది నిర్ధారించిన విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. చంద్రబాబు తెచ్చుకున్న స్టేను పొడిగిస్తూ హైకోర్టు ఎలాంటి లిఖిత పూర్వక ఉత్తర్వులు ఇవ్వ లేదని జడ్జి గుర్తు చేశారు. అందువల్ల ఈ కేసులో తదుపరి ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని, దీనిపై ఏసీబీ విచారణకు ఆదేశించాలని కోరుతూ లక్ష్మీపార్వతి ఫిర్యాదు దాఖలు చేశారు.

విచారణ ప్రారంభించక ముందే చంద్రబాబు ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. బాబు అభ్యర్థనను ఏసీబీ కోర్టు తోసి పుచ్చింది. దీనిపై ఆయన హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా స్టే ఉత్తర్వులను ఎత్తివే యాలని కోరుతూ లక్ష్మీపార్వతి అనుబంధ పిటిషన్‌ దాఖలు చేయగా, దానిని హైకోర్టు కొట్టేసింది. అప్పటి నుంచి స్టే కొనసాగుతూ వస్తోంది. ఇటీవల ఈ కేసు ఏసీబీ కోర్టు ముందుకు విచారణ కొచ్చింది. స్టే లేనట్లేనని భావిస్తూ విచారణ కొనసాగింపునకు జడ్జి నిర్ణయించారు.

కామెంట్‌లు