ఏపీలో మార్కెట్లకు మహర్దశ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధి కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. ఈ మేరకు ఆయన సంచలన ప్రకటన చేశారు. ఇక నుంచి ఏపీలో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు పలు చర్యలకు శ్రీకారం చుట్టారు. ఏపీలోని అన్ని మార్కెట్ యార్డులను నాడు, నేడు పథకం కింద ఆధునికీక రించడంతో పాటు మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను పటిష్ట పరచాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. పంటల ధరలు ఎక్కడ పడి పోతుంటే అక్కడ వెంటనే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.
ఎక్కడ కూడా గిట్టు బాటు ధర కంటే తక్కువకు అమ్మేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఐదో అగ్రి మిషన్ సమావేశంలో మాట్లాడారు. ప్రతి నియోజకవర్గానికి ఒక మార్కెట్ యార్డ్ విధిగా ఉండాలన్నారు. అవసరమైతే అధ్యయనం చేసి మరికొన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. కొన్ని రైతు బజార్లలో రైతులు కాని వారు అమ్మకాలు చేస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయని, నిబంధనలు తప్పక పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 56 రైతు బజార్లను కొత్తగా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
అవసరమైన చోట్ల వేరుశనగ, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, చిరుధాన్యాల శుద్ధికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చిరుధాన్యాల సాగు ఖర్చు పరిగణనలోకి తీసుకుని, మద్దతు ధర వచ్చేలా తక్షణమే కొనుగోలు ధర నిర్ణయించాలన్నారు. టమాటా ధర పడిపోకుండా మార్కెటింగ్ శాఖ కొనుగోలు చేసి ధరలు స్థిరీకరించాలని చెప్పారు. గోడౌన్ల నిర్మాణంపై నియోజకవర్గాలు, మండలాల వారీగా మ్యాపింగ్ చేయాలని సూచించారు. చీనీ రైతులకు మంచి ధర వచ్చేలా అనుసరించాల్సిన మార్కెటింగ్ వ్యూహాలపైనా చర్చించారు. పత్తి కొనుగోళ్లపై ఆరా తీశారు.
రైతు భరోసా పథకం కింద ఇప్పటి వరకు 45,20,616 మంది రైతు కుటుంబాలు లబ్ధి పొందాయని చెప్పారు. డిసెంబర్ 15 వరకు కౌలు రైతులకు అవకాశం కల్పించాలని, దేవాలయాల భూములు, సొసైటీల పేరుతో సాగు చేసుకుంటున్న రైతులనూ రైతు భరోసా కింద పరిగణనలోకి తీసుకు రావాలని సీఎం ఆదేశించారు. రికార్డుల పరంగా, ఇతరత్రా సమస్యలు ఏమైనా ఉంటే ఎప్పటికప్పుడు పరిష్కరించుకునే వెసులుబాటు ఉన్నందున వచ్చే మే నెల నాటికి మరింత మందికి లబ్ధి చేకూర్చాలని సూచించారు.
గ్రామ సచివాలయాల పక్కన ఏర్పాటు చేసే దుకాణాలు, వర్క్‌షాపులు జనవరి నుంచి ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. ఈ దుకాణాల్లో దొరికే ప్రతి వస్తువుకూ ప్రభుత్వం గ్యారెంటీగా ఉంటుందన్నారు. భూసార పరీక్షలు వర్క్‌షాపులోనే నిర్వహించాలని చెప్పారు. ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించాలని, గ్రామ సచివాలయాల్లోని అగ్రికల్చర్, ఉద్యాన అసిస్టెంట్ల సేవలను వర్క్‌షాపుల్లో విరివిగా వినియోగించుకోవాలని సూచించారు. మోసాలను అరికట్టడానికి ఏపీ బయో ప్రోడక్టŠస్ రెగ్యులేటరీ యాక్ట్ తీసుకు రావాలని సీఎం నిర్ణయించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి