ఆశలు సజీవం..దక్కేనా విజయం

భారత ఫుట్‌బాల్‌ జట్టు ప్రస్తుతం అగ్ని పరీక్షను ఎదుర్కుంటోంది. ఒమన్‌తో తాడో పేడో తేల్చు కోవడానికి మన జట్టు సిద్ధమైంది. 2022 ఫుట్‌బాల్‌ ప్రపంచ కప్‌కు అర్హత రేసులో నిలవాలంటే ఇండియాకు ఈ విజయం తప్పనిసరి. ఒకవేళ ఓడిందంటే మాత్రం ఇక దారులు మూసుకు పోయినట్లే. క్వాలిఫయర్స్‌లో భాగంగా గ్రూప్‌ ‘ఇ’లో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతుంది. ఇప్పటికే భారత్‌ నాలుగు మ్యాచ్‌లు ఆడింది. ఒక దాంట్లో ఓడి పోగా, మూడింటిని ‘డ్రా’ చేసుకుంది. భారత్‌ 3 పాయింట్లతో గ్రూప్‌లో నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు ఒమన్‌ మాత్రం నాలుగింటిలో మూడు గెలిచి 9 పాయింట్లతో గ్రూప్‌లో రెండో స్థానంలో ఉంది.

క్వాలిఫయర్స్‌ తొలి అంచె పోటీల్లో ఇరు జట్లు గౌహతి వేదికగా తలపడగా భారత్‌ 1–2తో ఓటమి చవి చూసింది. ఆ మ్యాచ్‌లో 80 నిమిషాల పాటు ఆధిక్యం కనబరిచిన భారత్‌, చివరి 10 నిమిషాల్లో చేతులెత్తేసి రెండు గోల్స్‌ ప్రత్యర్థికి సమర్పించుకొని ఓడిపోయింది. ఆసియా చాంపియన్‌ ఖతర్‌తో జరిగిన మ్యాచ్‌లో అంచనాలకు మించి మన జట్టు రాణించింది. ఈ మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. గెలుపు ఖాయం అనుకున్న బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ మ్యాచ్‌లను ‘డ్రా’తో సరి పెట్టుకున్న భారత్‌ ప్రస్తుతం చావో రేవో పరిస్థితి తెచ్చుకుంది.

గత రెండు మ్యాచ్‌ల్లోనూ సారథి సునీల్‌ చెత్రి ఎటువంటి ప్రభావం చూపలేక పోయాడు. ప్రస్తుత మ్యాచ్‌లో ఒమన్‌ను ఓడించడం అంత సులభం కాదు. ఇప్పటి వరకు ఇరు జట్లు 11 సార్లు తలపడగా భారత్‌ ఎనిమిదింట ఓడి, మూడింటిని ‘డ్రా’ చేసుకుంది. ఒమన్‌కు పోటీ ఇవ్వాలంటే భారత్‌ అన్ని విభాగాల్లోనూ రాణించాల్సి ఉంటుంది. ముఖ్యంగా డిఫెన్స్‌ విషయంలో మెరుగవ్వాలి. అయితే కీలక ఆటగాళ్లు గాయాలతో మ్యాచ్‌కు దూరమవ్వడం భారత్‌కు ప్రతికూలాంశం. అయితే ఇండియా గెలిస్తేనే నిలుస్తుంది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!