పని చేయని రాందేవ్ మంత్రం

నిన్నటి దాకా దేశవ్యాప్తంగా హవా చెలాయించిన ప్రముఖ యోగా గురు బాబా రామ్ దేవ్ బాబా మంత్రం ఇప్పుడు ఎక్కడా పని చేయడం లేదు. రామ్ దేవ, ఆచార్య బాలకృష్ణ సంయుక్త ఆధ్వర్యంలో పతంజలి పేరుతో ఓ సంస్థను స్థాపించారు. స్థానికత, సాంప్రదాయత, దేశ సంస్కృతి కలగలిసేలా ప్రతి చోటకు ఇది విస్తరించింది. దీనికి తోడు కేంద్రంలో బీజేపీ కూడా కొలువు తీరడంతో మన బాబాకు అన్ని మార్గాలు కలిసి వచ్చాయి. దీంతో దేశమంతటా పతంజలి పేరు మారు మోగింది. ఆ సంస్థ ఆధ్వర్యంలో తయారు చేసిన ప్రతి ప్రోడక్ట్ కు విపరీతమైన ఆదరణ లభించింది. పతంజలి కొట్టిన దెబ్బకు విదేశీ కార్పొరేట్ కంపెనీలు ఒక్కసారిగా నష్టాలకు లోనయ్యాయి.

ప్రతి ఇంటిల్లిపాదికి, అన్ని పేద, సామాన్య, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండేలా, అందరూ వాడుకునేలా, సరసమైన ధరల్లో ఉండేలా చేసింది. పతంజలి గ్రూప్ అమ్మకాల్లో రికార్డులను తిరుగ రాసింది. 2011–2017 మధ్య దీని ఆదాయం10 వేల కోట్లు పెరగడమే ఇందుకు నిదర్శనం. అయితే గత ఏడాది నుంచి మాత్రం ఆదాయాలు గణనీయంగా తగ్గడం గమనార్హం. ఇది తయారు చేసే టూత్‌‌ పేస్టు, సబ్బులు, పిండి, తేనె, నెయ్యికి విపరీతంగా గిరాకీ ఉండేది. పతంజలి ప్రొడక్ట్స్‌‌ను ప్రదర్శించేందుకు ఇటీవల వరకు రిటైలర్లు తమ షాపుల్లో ప్రత్యేకంగా స్థలం కేటాయించేవారు. రాను రాను పరిస్థితి మారింది. జనం పతంజలి బ్రాండ్​ వస్తువులకు దూరమవుతున్నారు.

దీంతో సంస్థ ఆర్థిక పరిస్థితి బలహీనంగా మారుతోంది. ఏటా ఆదాయాలు తగ్గుతూనే ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ గ్రూపు ఆదాయం 2.38 శాతం మాత్రమే పెరిగి 8,330 కోట్లుగా నమోదయింది. అయితే 2017 ఆర్థిక సంవత్సరంలో దీనికి ఏకంగా 10,561 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాది ఇది 8,135 కోట్లకు పడి పోయింది. పతంజలి వస్తువులకు గిరాకీ తగ్గి పోతోంది. ఏవో రెండు ప్రొడక్ట్స్‌‌ తప్ప మిగతావి అమ్ముడు పోవడం లేదు. ఒకప్పుడు హెచ్‌‌యూఎల్‌‌, డాబర్‌‌, ఐటీసీ వంటి కంపెనీలను వణికించిన పతంజలి, ఇప్పుడు వాటితో పోటీ పడలేక పోతోంది. దంత్‌‌ కాంతి పేస్టు అమ్మకాలు పెరగడంతో మిగతా ఎఫ్‌‌ఎంసీజీ కంపెనీలు కూడా ఆయుర్వేద పేస్టులను తీసుకు రావడం తప్పనిసరి అయింది.

అయితే ఇప్పుడు దంత్‌‌కాంతి పేస్టు, నెయ్యి మిగతా పతంజలి ప్రొడక్ట్స్‌‌ అమ్ముడు పోవడం లేదు. ఈ విషయమై మార్కెట్ గురు ఆచార్య బాలకృష్ణ మాత్రం దీనిని ఒప్పు కోవడం లేదు. తమ సప్లై చెయిన్‌‌, డిస్ట్రిబ్యూషన్‌‌ నెట్‌‌వర్క్‌‌ను మరింత చేయాల్సి ఉందని, లేకపోతే గ్రోత్‌‌ టార్గెట్స్‌‌ను చేరుకోలేమని అంగీకరించారు. అయితే కంపెనీ నెమ్మ దించడానికి నోట్ల రద్దు, జీఎస్టీ కూడా కారణాలేనని విమర్శించారు. బాబా రామ్‌‌దేవ్‌‌ గురించి తెలిసిన వారు మొదట్లో తమ ప్రొడక్టులను బాగా కొనడం వల్ల అప్పట్లో ఆదాయాలు బాగున్నాయని, ఇతర వినియోగదారులు కూడా పతంజలి వస్తువులు కొనేలా చేయాలన్నారు.

కాగా పతంజలి ఎక్స్‌‌క్లూజివ్‌‌ స్టోర్లు కూడా క్రమంగా కనుమరుగు అవుతున్నాయి. పతంజలి డిస్ట్రిబ్యూషన్‌‌ సరిగ్గా లేకపోవడం ఒక సమస్య అయితే, వీటి ప్రొడక్ట్స్‌‌ నాణ్యతపై పలుసార్లు ఫిర్యాదులు కూడా భారీగా వచ్చాయి. మొత్తం మీద బాబా మంత్రం ఇక్కడ పని చేయక పోగా, బాలకృష్ణ మాత్రం మళ్ళీ పుంజుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎక్కడ వెనుకబడి పోయామో పూర్తిగా పరిశీలిస్తాం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా పతంజలి హవాను అడ్డుకునే సత్తా మిగతా కంపెనీలకు లేదంటున్నారు ఆచార్య.

కామెంట్‌లు