విప్లవ ధృవతార..ఈ తరం చేగువేరా
నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడిన యోధుడు. వ్యక్తిగా మొదలై వ్యవస్థగా మారిన ధీరుడు. జనం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మానవుడు. తెలంగాణ మాగాణంపై మరిచి పోలేని చరిత్రకు నాంది పలికిన నాయకుడు. తాను దారుణ హత్యకు గురై 47 ఏళ్ళు అవుతున్నా, కొన్ని తరాలు గడిచినా, నాలుగు దశాబ్దాలు పూర్తయినా నేటికీ జార్జి రెడ్డి ప్రజల గుండెల్లో ప్రవహిస్తూనే వున్నాడు. జనాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నాడు. ఆయన మరణం లక్షలాది మందికి స్ఫూర్తి కలిగిస్తూనే ఉన్నది. ఇంతలా వెంటాడుతున్న ఆయన చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం నేటికీ ఉందంటూ మేధావులు, ప్రజాస్వామిక వాదులు చెబుతూనే వున్నారు. తాజాగా జార్జి రెడ్డి మళ్ళీ వార్తల్లోకి వచ్చారు. ఇప్పుడు టాలీవుడ్‌లో వీరుల కథల ట్రెండ్ నడుస్తోంది.
తొలి స్వాతంత్ర్య సమర యోధుడు నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా తీసిన సైరా నరసింహారెడ్డి చిత్రం సక్సెస్ సాధించింది. ప్రస్తుతం అదే కోవలో విప్లస్ఫూర్తి కలిగిన, మనం మరిచి పోయిన వీరుడు జార్జి రెడ్డి కథను దళం డైరెక్టర్ జార్జి రెడ్డి పేరుతో సినిమా తీశాడు. భగత్ సింగ్, చెగువేరా, మార్క్స్ పుస్తకాలు చదివాడు. అన్యాయాన్ని ప్రశ్నించాడు. న్యాయం కోసం నిలబడ్డాడు. సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాడు. నమ్ముకున్న వారి కోసం చివరి దాకా నిలబడ్డాడు. జార్జి రెడ్డి కేరళలో పుట్టాడు. బెంగళూర్, చెన్నైలలో చదివాడు. ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్ గా ఎదిగాడు. నిరంతరం చదవడం, ప్రతి విషయాన్నీ శోధించి తెలుసు కోవడం చేస్తూ వచ్చాడు. కత్తి, కర్ర సాము, బాక్సింగ్‌లో ప్రావీణ్యం పొందాడు.
తల్లి తోడ్పాటు, సహకారంతో జార్జి రెడ్డి అన్ని రంగాల్లో రాటు దేలాడు. ఓయూ జార్జి రెడ్డి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. మోస్ట్ ఫెవరబుల్ మేధావిగా గుర్తింపు పొందాడు. ఎన్నో ప్రముఖ యూనివర్సిటీలు ఆహ్వానం పలికినా వెళ్ళలేదు. కమ్యూనిస్టు ఉద్యమాల పట్ల ఆకర్షితులయ్యాడు. అతడే ఓ ఆయుధంగా మారాడు. విప్లవ విద్యార్ధి సంస్థను ఏర్పాటు చేశాడు. ఓయూలో తిరుగులేని నాయకుడిగా, శక్తిగా ఎదిగాడు. అనుకోని రీతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఒక మరణం కన్నీళ్లను మిగిలిస్తే ఇంకో మరణం వేలాది ప్రజల్లో దీపాలు వెలిగిస్తుంది. అలాంటి వెలుగే జార్జి రెడ్డి. ఎంతో సామాజిక బాధ్యతతో ఈ సినిమాను తీశాడు దళం జీవన్ రెడ్డి.
సందీప్ మాధవ్ ఈ సినిమాలో జార్జి రెడ్డి పాత్రలో నటించాడు. బాడీ లాంగ్వేజ్, దుస్తులు, నడవడిక అచ్చం జార్జిరెడ్డిని తలపించేలా చేశాడు. పలు చోట్ల జార్జిరెడ్డే కళ్ల ముందే నిలుచున్నట్లు అనిపిస్తుంది. ఇక తల్లి పాత్రలో మరాఠీ నటి దేవిక జీవించిందనే చెప్పాలి. హీరోయిన్ ముస్కాన్ మెప్పించింది. ఇతర నటులు నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఆదర్శం కోసం, సామాజిక మార్పు కోసం విలువైన జీవితాన్ని జార్జి రెడ్డి కోల్పోయాడు. ఆయన బతుకు కథను తెర మీదకు తీసుకు రావాలను కోవడం ఓ రకంగా సాహసమే. సినిమాను గొప్పగా తీశాడు దర్శకుడు. అప్పటి సన్నివేశాలను అతికినట్టుగా తీయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి