కమలానిదే మరాఠా పీఠం
మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరన్న వాస్తవాన్ని రూడీ చేశారు మోడీ, అమిత్ షా. గత కొన్ని రోజులుగా మహాభారతాన్ని తలపింప చేసింది మారాఠా రాజకీయం. ఇదే సమయంలో ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగింది. ఏకంగా మరోసారి శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే కు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చారు ట్రబుల్ షూటర్లు. దేశమంతటా ఎంతో ఉత్కంఠకు దారి తీసింది మహా నాటకం. ఏ రాజకీయ పార్టీ కొలువు తీరుతుందోనని చర్చ జరిగింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ, శివసేన ఒకవైపు ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రచారం చేశాయి. అయితే ఏ ఒక్క పార్టీకి మెజార్టీ రాలేదు. ఇదే సమయంలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. కాగా మరాఠా పీఠం తమకు కావాలంటూ శివసేన పట్టుపట్టింది.
దీనిని అమిత్ షా , మోదీ ఒప్పుకోలేదు. పరిస్థితి చేయి దాటడంతో ఆర్ఎస్ఎస్ చీఫ్ మహేష్ భగవత్ జోక్యం చేసుకున్నా ఒప్పుకోలేదు శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే. కాంగ్రెస్, ఎన్సీపీ చీఫ్ లు సోనియా, శరద్ పవార్ లతో కలిసి శివసేన చీఫ్ పలు దఫాలుగా చర్చలు జరిపారు. చెరో సగం అధికారం పంచుకునేలా ఒప్పందం కూడా కుదిరింది. ఈ మేరకు రాష్ట్రపతి పాలన కూడా ఎత్తి వేశారు. ప్రమాణ స్వీకారం చేపట్టేందుకు కొద్ది సమయం ఉండగానే అనూహ్యంగా ఎన్సీపీ శివసేనకు ఝలక్ ఇచ్చింది. ఇదే సమయంలో మహారాష్ట్ర రాజకీయాల్లో పెద్ద మలుపు చోటు చేసుకుంది. రాత్రికి రాత్రే సమీకరణాలు మారి పోయాయి. అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటామన్న శివసేన కలలను బీజేపీ, ఎన్సీపీ భగ్నం చేశాయి.
శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి సీటులో కూర్చోవడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా దేవేంద్ర ఫడ్నవీస్ మళ్లీ సీఎంగా ప్రమాణం స్వీకారం చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. బీజేపీ, ఎన్సీపీ కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేశాయి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారం కూడా అయి పోయింది. ముంబై నగర మేయర్ పదవిని ఏకగ్రీవంగా దక్కించుకున్నామని మురిసి పోతున్న శివసేనను.. బీజేపీ, ఎన్సీపీ కలిసి ఏకంగా రాష్ట్రంలో అధికారానికి దూరం చేశాయి. శివసేన, ఎన్సీపీ పొత్తును విమర్శించిన బీజేపీ తెల్లారే సరికి ఎన్సీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం మహా విశేషం. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ద్వారా అమిత్ షా, నరేంద్ర మోదీ మరోసారి తమ ప్రత్యేకత చాటుకున్నారు.
వీరిద్దరి ముందు శివసేన, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని ఎత్తులు వేసినా పారలేదు. రెండు రోజుల క్రితం ప్రధాని మోదీని ఢిల్లీలో శరద్ పవార్ కలిసినప్పుడే మహారాష్ట్రలో బీజేపీ, ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వం ఖాయమని వచ్చిన వార్తలు నిజమయ్యాయి. అదే సమయంలో శరద్ పవార్‌కు ప్రధాని మోదీ, రాష్ట్రపతి పదవిని ఇవ్వజూపారని శివసేన ఆరోపించింది. వీటిని శరద్ పవార్ తోసి పుచ్చారు. కాంగ్రెస్, శివసేన చర్చలు జరుపుతూనే పవార్ చాణిక్యం ప్రదర్శించడం విశేషం. అయితే తాజా పరిణామం పవార్‌కు తెలియ కుండా జరిగిందని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి శివసేన, కాంగ్రెస్ పార్టీలకు ఊహించని షాకివ్వడం ద్వారా మోదీ, షా ద్వయం సమకాలీన రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా అవతరించింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి