ముగిసిన సమావేశం..సమ్మె యధాతధం


ఆర్టీసీ కార్మికులు నెలన్నర రోజులుగా చేస్తున్న సమ్మెను ఎట్టి పరిస్థితుల్లో ఆపే ప్రసక్తి లేదని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి స్పష్టం చేశారు. సమ్మె కొనసాగించాలా లేక వద్దా అనే అంశంపై జేఏసీ నేతలు సమావేశం నిర్వహించారు. సమ్మె కొనసాగింపుపై కార్మికుల అభిప్రాయం తీసుకున్నామని, జేఏసీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కార్మికుల హామీ ఇచ్చారని వెల్లడించారు. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు తీర్పు కాపీ ఇంకా తమకు అంద లేదని, కోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత న్యాయ నిపుణులతో చర్చిస్తామని, తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కోర్టు తీర్పు తర్వాత తమ నిర్ణయం వెలువరిస్తామని తెలిపారు. జేఏసీ తుది నిర్ణయం తీసుకునే వరకు సమ్మె కొనసాగుతుందన్నారు. హైదరాబాద్ ఎల్బీనగర్‌ లో ఆర్టీసీ జేఏసీ నేతలు భేటీ అయ్యారు.

కార్మికుల సమ్మె అంశంతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై ఈ మీటింగ్ లో చర్చించారు. అంతకు ముందు కార్మిక సంఘాల నేతలు విడివిడిగా సమావేశమయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా కార్మికుల అభిప్రాయాలను డిపోల వారీగా సేకరించారు. టీఎంయూ,  ఈయూ,  ఎస్టీఎఫ్, టీజేఎంయూ నేతలు సమావేశమై చర్చించారు. జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. సమ్మె సందర్భంగా ప్రభుత్వం వాదన ఏమిటి, కార్మికుల తరఫున ఏ వాదన వినిపించారు, కోర్టులు ఏం చెప్పాయి అన్నది చర్చించారు. సమ్మె విరమణ విషయంలో కార్మికుల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదని సమాచారం.

మూడు నెలలుగా జీతాలు లేవని, ఇంకా సమ్మె కొనసాగిస్తే, ఇబ్బందులు ఎదురవుతాయని, లేబర్ కోర్టులో ఈ అంశం తేలడానికి సమయం పడుతుందని, కొంత మంది కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా, మరి కొంత మంది ఎన్ని రోజులైనా ప్రభుత్వం దిగొచ్చే వరకు సమ్మె కొనసాగించాల్సిందేనని పట్టు బట్టినట్టు తెలిసింది. కాగా సమ్మెను విరమిస్తే ప్రభుత్వం ఉద్యోగంలోకి తీసుకుంటుందో లేదా అన్న ఆందోళన కార్మికుల్లో వ్యక్తమవుతోంది. కనీసం లేబర్‌ కోర్టులో తేలే వరకైనా సమ్మె కొనసాగించాలని మెజారిటీ కార్మికులు అభిప్రాయ పడినట్టు తెలుస్తోంది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!