ఉద్యమ కెరటం స్ఫూర్తి శిఖరం

ప్రపంచ చరిత్రలో విస్మరించలేని పదం తెలంగాణ. పోరాటాలకు, ఆరాటాలకు, ఉద్యమాలకు, బలిదానాలకు, త్యాగాలకు చిరునామా ఈ ప్రాంతం. ఎందరో మహానుభావులు ఈ మట్టిలోంచి మొలకెత్తారు. ఉద్యమాలకు సారధ్యం వహించారు. ఇంకొందరు తామే చరిత్రను సృష్టించారు. ఈ నేల లోనే ఆత్మాభిమానం దాగి ఉన్నది. అందుకే ఇక్కడ జన్మించిన వాళ్ళు ఎవ్వరికీ తలవంచరు. కడుపులు కాలుతున్నా సరే అమ్ముడుపోరు. ఈ ప్రాంతానికి ఉద్విగ్నంగా చరిత్ర ఉన్నది. ఎనలేని కథ ఉన్నది. చెప్పుకుంటూ పోతే చరిత్ర నిండా అంతులేని గాయాలున్నవి. చెప్పుకోలేనంత దుఃఖం దాగి ఉన్నది. తెలంగాణకు తలమానికంగా ఉన్నది ఉస్మానియా యూనివర్సిటీ. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ప్రపంచంలో ప్రతి చోటా ఉన్నారు. తమ ప్రతిభా పాటవాలతో ప్రభావితం చేస్తూనే ఉన్నారు. అలాంటి వారిలో ఒకే ఒక్కడు జార్జ్ రెడ్డి. ఓయూలో చదువుకున్నాడు. వామపక్ష భావజాలానికి ఆకర్షితుడయ్యాడు. విప్లవ వాద విద్యార్థి సంఘాల నాయకుడుగా పని చేశాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విప్లవ వాద విద్యార్ధుల ఉద్యమ స్థాపకుడుగా కీలక పాత్ర పోషించారు.

జార్జ్ రెడ్డి 1947, జనవరి 15 న కేరళలోని పాల్ఘాట్ లో పుట్టారు. చిత్తూరు జిల్లాకు చెందిన చల్లా రఘునాథరెడ్డి, ట్రావెన్కూరు ప్రాంతానికి చెందిన లీలా వర్గీస్ దంపతులకు జన్మించారు. తల్లితండ్రులు మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో కలుసుకున్నారు. రఘునాథరెడ్డి బి.ఏ హానర్స్ చేయగా, లీలా వర్గీన్ రసాయనశాస్త్రం లో డిగ్రీ పూర్తి చేసి, ఎంఏ చదివారు.వీరికి ఐదుగురు సంతానం. పెద్దవాడైన డాన్ రెడ్డి బిఈడీ పూర్తి చేసి ఒరిస్సాలో స్థిరపడ్డాడు. రెండవ కొడుకు కార్ల్ రెడ్డి ఐ.ఏ.ఎస్ అధికారి అయ్యాడు. కుమార్తె జాయ్ రెడ్డి భాషా శాస్త్రంలో ఎం.ఏ చేసి మైసూరులోని భారతీయ భాషా అధ్యయన కేంద్రంలో పని చేశారు. నాలుగవ సంతానం జార్జి రెడ్డి. చివరి వాడు సిరిల్ రెడ్డి. జార్జ్ రెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసం బెంగుళూరు ,చెన్నైలలో సాగింది. ఐదు, ఆరు, ఏడు తరగతులు క్విలాన్ జిల్లా తంగచ్చేరిలోని ఇన్‌ఫెంట్ జీసస్ ఉన్నత పాఠశాలలో, ఎనిమిది, తొమ్మిది తరగతులు చెన్నై ఎగ్మోరులోని డాన్ బాస్కో ఉన్నత పాఠశాలలో చదివాడు.

1961-62లో కాజీపేటలోని సెయింట్ గాబ్రియేల్ ఉన్నత పాఠశాలలో కొన్నాళ్ళు చదివాడు. ఆ తరువాత కుటుంబం హైదరాబాదుకు మారింది. అక్కడ సెయింట్ పాల్స్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేశాడు. నిజాం కాలేజీలో  పీ.యూ.సీ పూర్తి చేశాడు. 1964లో బీ.ఎస్సీ చేయటానికి ఉస్మానియా విశ్వ విద్యాలయపు సైన్సు కళాశాలలో చేరాడు. హైదరాబాదులోని నిజాం కళాశాలలో బియస్సీ (1964-67) డిగ్రీ చేశారు. ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఫిజిక్స్ లో ఎమ్మెస్సీ చేశారు. ఇదే యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తూ పాక్షిక సమయంలో కొన్ని నెలల పాటు ఏ.వి. కళాశాలలో జూనియర్ లెక్చరర్ గా పనిచేశారు. పీహెచ్ డి కి అనుమతి పొందారు. జార్జ్ రెడ్డికి పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. ప్రతి రోజు పుస్తకాలు చదవడం హాబీగా పెట్టుకున్నాడు. 25 ఏళ్ల వయసులో మరణించే నాటికి హేగెల్, మార్క్స్ , ఫ్రాయిడ్ రచనలను చదివాడు. భౌతిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉస్మానియా విశ్వ విద్యాలయం  స్వర్ణ పతకాన్ని సాధించారు. అభ్యుదయ ప్రజాస్వామ్య విద్యార్థి సమాఖ్య ను స్థాపించారు. 

జార్జి రెడ్డి తొలుత కాంగ్రేస్ పార్టీలోని యంగ్ టర్క్‌లను అనుసరించాడు. 1969-70ల నుంచి సోవియట్ యూనియన్ అండతో కాంగ్రేస్ పార్టీ పెట్టుబడిదారీ సంస్కరణ పంథా వైపు నడిపించే ప్రయత్నం జరిగింది. అందుకోసం యంగ్ టర్క్‌లు కాంగ్రేస్ పార్టీలో యువ బృందంగా అవతరించింది. ఫ్యూడల్ భూస్వాములకు వ్యతిరేకంగా యంగ్‌ టర్కుల తీవ్రవాద నినాదాలు జార్జిని ఆకర్షించాయి. వారు "సోషలిస్టు స్టడీ ఫోరం"గా ఏర్పడి సాగించిన ప్రచారాన్ని చిత్తశుద్ధిగా నమ్మాడు. తన స్నేహితుడు శ్రీనాథ్ రెడ్డి తండ్రి, కేంద్ర మంత్రి రఘునాథరెడ్డి ప్రోద్భలంతో కాంగ్రేస్ పార్టీ  విద్యార్థి సంఘమైన యూత్ కాంగ్రేసులో చేరాడు. కానీ అది పెట్టుబడిదారీ వ్యవస్థను కొత్త ముసుగుతో పరిరక్షించే ఎత్తుగడగా త్వరలో అర్ధం చేసుకొని, దానిపై భ్రమలు వీడి విప్లవ పంథాను స్వీకరించాడు.

1972 జూలై 14 సాయంత్రం ఎన్నికల ప్రచారానికి వెళ్లి తిరిగొస్తున్న సమయంలో ఒంటరిగా ఉన్న జార్జి రెడ్డి పై 30 మందికి పైగా దుండగలు ఉస్మానియా విశ్వ విద్యాలయపు ఇంజనీరింగ్ కళాశాల మెట్లపై కత్తి పోట్లతో దాడి చేసి చంపేశారు. జార్జ్ రెడ్డి చనిపోయినా ఆయన అందించిన స్పూర్తితో వేలాది మంది విద్యార్థులు నేటికీ న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన స్టూడెంట్స్ కు ఆయనే స్ఫూర్తి. జార్జ్ రెడ్డి జీవితాన్ని తెరమీద చూపించేందుకు ఓ సినిమా రాబోతోంది. జార్జ్ రెడ్డి - ఏ మ్యాన్ ఆఫ్ యాక్షన్  అనే పేరుతో రాబోతున్న ఈ సినిమాలో వంగవీటి ఫేమ్ సందీప్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు . ఈ చిత్రానికి ‘దళం’ దర్శకుడు జీవన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాతలు దాము రెడ్డి, అప్పి రెడ్డి కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

‘పేదలు ఇంకా పేదలు అవుతున్నారు. ధనికులు ఇంకా ధనికులు గా మారుతున్నారు’ అనే డైలాగ్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్ లో పలు విభిన్న అంశాలను చూపించారు. ‘రెయిజ్ యువర్ వాయిస్.. బిఫోర్ ట్రూత్ డైయిస్’ అంటూ హీరో సందీప్ మాధవ్ చెబుతున్న డైలాగా ఆకట్టుకుంటోంది. కళాశాలలో రెండు విద్యార్ధి గ్రూపుల మధ్య గొడవ, న్యాయం కోసం విద్యార్ధుల పోరాటాలు, రైతుల పరిస్థితి.. ఇలా ఆసక్తి కరమైన అంశాలతో ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ చిత్రంలో సత్యదేవ్ , శాండీ, శతృ, అభయ్ బెతిగంటి తదితరులు నటిస్తున్నారు. జార్జ్ రెడ్డి బతికి ఉన్నప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఇప్పుడు అలాగే ఉన్నాయి. మొత్తం మీద సినిమాతోనైనా నేటి తరం ఆ వీరుడిని తెలుసుకునే వీలు కలుగుతుంది. జార్జ్ రెడ్డి వ్యక్తి కాదు ఓ వ్యవస్థ. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!