చూస్తే చిన్నోడు ..డైరెక్టర్లలో గట్టోడు

తెలుగు సినిమా సక్సెస్ ఫుల్ సినిమాలతో వర్ధిల్లుతోంది. వేలాది మందికి ఈ పరిశ్రమ కూడు పెడుతోంది. టాలెంట్ వుంటే చాలు ఈ రంగం ఛాన్స్ ఇస్తోంది. తెలుగు మూవీస్ స్టామినా ఇప్పుడు హాలీవుడ్ రేంజ్ కు వెళ్ళింది. నిన్న మొన్నటి దాకా 20 కోట్లు అంటే మహా గొప్పగా భావించే వాళ్ళు. కానీ సీన్ మారింది. 100 కోట్ల రేంజ్ దాటేసింది. దీనికి అంతటికి కారణం ఎస్ ఎస్ రాజమౌళి తీసిన బాహుబలి సినిమా. ఓవర్సీస్ లలో కూడా మన తెలుగు సినిమాలు వసూళ్ళలో రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. ఒకప్పుడు హీరోలదే  డామినేషన్. కానీ ఇప్పుడు అలా లేదు. మొత్తం సినిమాల స్వరూపాన్ని దర్శకులు డిసైడ్ చేస్తున్నారు. మూవీస్ సక్సెస్ లో డైరెక్టర్స్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరిలో టాప్ పొజిషన్ లో కొనసాగుతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, సందీప్ రెడ్డి, సంకల్ప్ రెడ్డి , సురేందర్ రెడ్డి, హరీష్ శంకర్, సతీష్ వేగ్నేశ, పరశురామ్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో తమను తాము ప్రూవ్ చేసుకుంటున్నారు.

తాజాగా సక్సెస్ ఫుల్ దర్శకుల జాబితాలో మరొకరు ఉన్నారు..ఆయనే దాసరి మారుతి. లో ప్రొఫైల్ మెయింటెనెన్స్ చేసే ఇతని టేకింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. చూస్తే చిన్నోడిలా గా అగుపిస్తారు కానీ మహా గట్టోడు. సినిమాను పవర్ ఫుల్ మాధ్యమంగా భావించే ఈ దర్శకుడు తీసిన సినిమాలు దేనికదే డిఫరెంటుగా ఉన్నాయి. ప్రతి సినిమాలో ఏదో ఒక మెస్సేజ్ ఉండేలా తీసాడు. మారుతి దాసరి కి ఇప్పుడు 37 ఏళ్ళు. 1981 అక్టోబరు 8 న మచిలీపట్నం లో పుట్టారు. భార్య వీణారాగ స్పందన. దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా మారుతి ఉన్నారు. మారుతి పేదరికంలో పెరిగాడు. తండ్రి బండ్ల మీద అరటిపళ్లు అమ్మే వాడు. అమ్మ టైలరింగ్ పని చేసేది. మొదట్లో వాహనాలకు నంబర్ స్టిక్కర్లు వేసే వాడు. కష్టాల మధ్యే డిగ్రీ పూర్తి చేశాడు. త్రీ డి యానిమేషన్ నేర్చుకోవాలన్న సంకల్పంతో 1998లో హైదరాబాదు వచ్చేశాడు.

నిజాంపేటలో ఉంటున్న అక్క ఇంట్లో కొన్నాళ్ల పాటు ఉన్నాడు. ఆ రోజుల్లో నిజాంపేటకు బస్సులు తక్కువ. ఆటోలు కూడా వచ్చేవి కావు. జేఎన్‌టీయూ నుంచి నిజాంపేట వరకూ నడిచే వాడు. జూబ్లీహిల్స్‌లోని హార్ట్ ఇనిస్టిట్యూట్ అకాడమీలో యానిమేషన్ కోర్స్‌లో చేరాడు. ఉదయం పదింటికే నిజాంపేట నుంచి సైకిల్ మీద జేఎన్‌టీయూ బస్టాప్ చేరుకునేవాడు. తెలిసిన వాళ్ల షాప్ దగ్గర సైకిల్ పార్క్ చేసి బస్సులు మారి రెండింటికి ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్లేవాడు. ఐదింటికి క్లాస్ అయి పోయాక బయల్దేరితే.. ఇంటికి చేరుకునే సరికి రాత్రి తొమ్మిది దాటేది. ఇలా చదువు కన్నా జర్నీకే ఎక్కువ టైం పట్టేది. మారుతికి బొమ్మలు వేయడం అంటే మహా సరదా. సిటీ రోడ్లపై బాగా చక్కర్లు కొట్టేవాడు. ఆ టైంలోనే బస్టాప్‌ల దగ్గర వేచి ఉండే ప్రయాణికుల బొమ్మలు గీసేవాడు. గోల్కొండ, చార్మినార్, నెహ్రూ జంతు ప్రదర్శనశాల లోని జంతువులు, పక్షులు ఇలా ఎన్నో బొమ్మలు గీశాడు. సమయం దొరికితే చాలు హైదరాబాద్ అందాలను స్కెచింగ్‌లో చూపించే ప్రయత్నం చేశాడు.

2008లో పెళ్లయింది. తర్వాత యానిమేషన్ ట్రైనింగ్ క్లాసెస్ నిర్వహిస్తూ జీవనం కొనసాగించాడు. ఈ టైంలోనే బన్నీ వాసుతో పరిచయం ఇతని జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది. ఆర్య సినిమాకు డిస్ట్రిబ్యూటర్‌గా అవకాశం వచ్చింది. తర్వాత ఏ ఫిల్మ్ బై అరవింద్, ప్రేమిస్తే సినిమాలకు కో ప్రొడ్యూసర్‌గా చేశాడు. కొన్ని ప్రకటనలు కూడా తీశాడు. తర్వాత దర్శకత్వం తన వృత్తిగా స్వీకరించాడు. 2012 లో ఈ రోజుల్లో సినిమా తీశాడు. ఇదే ఏడాదిలో బస్టాప్ మూవీ సక్సెస్ అయ్యింది. 2013 లో ప్రేమకథా చిత్రమ్ తీశాడు ఇది హిట్ గా నిలిచింది. ఇందులో నటించిన సప్తగిరి బెస్ట్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2015 లో భలే భలే మగాడివోయ్ సినిమా తీస్తే శర్వానంద్ తో మహానుభావుడు మూవీ తీశాడు. శైలజా రెడ్డి అల్లుడు మంచి టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం మారుతి మెగా హీరో సాయితేజ్‌తో ‘ప్రతిరోజూ పండుగే’ అనే చిత్రాన్ని చేస్తున్నారు. లైఫ్ మీద పట్టున్న ఈ దర్శకుడు మరిన్ని సక్సెస్ లు అందుకోవాలని ఆశిద్దాం. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!