అటు అరెస్టులు..ఇటు ఆందోళనలు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు చేపట్టిన సమ్మె అరెస్టుల దాకా వెళ్ళింది. ఆర్టీసీని విలీనం చేయాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీలో ఉన్న అన్ని కార్మిక సంఘాల నాయకులు కోరుతున్నారు. ఆయా సంఘాలన్నీ ఒకే గొడుగు కిందకు వచ్చాయి. అంతకు ముందు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ రాష్ట్ర కార్మిక శాఖతో పాటు ఆర్టీసీ యాజమాన్యానానికి నోటీసులు కూడా అందజేశారు. దసరా పండుగ సమయంలో తాము సమ్మె చేయబోతున్నామంటూ ముందస్తుగానే తెలంగాణ ప్రజానీకానికి వెల్లడించారు. ఆ మేరకు ఆర్టీసీలో ఉన్న అన్ని డిపోలలో పనిచేస్తున్న కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్ లు మొత్తం 56 వేల మంది విధులను బహిష్కరించారు. ఆందోళన బాట పట్టారు.

దీంతో కార్మికులు చేస్తున్న సమ్మె విరుద్ధమని, నిర్దేశించిన గడువు లోగా విధుల్లోకి చేరాలని, లేకపోతే ఆయా విభాగాలలో పనిచేస్తున్న వారందరిని ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తీసి వేస్తామని హెచ్చరించారు. ఆ మేరకు సంబంధిత రవాణా శాఖామంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు. అయినా ఆర్టీసీ జేఏసీ ఏ మాత్రం ఒప్పుకోలేదు. తమ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసేంత దాకా తమ ఆందోళన కొనసాగిస్తామని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి హెచ్చరించారు. మొదటి రోజు సమ్మె సక్సెస్ అయ్యింది. కొద్దీ మంది మినహా 90 శాతానికి పైగా కార్మికులు , సిబ్బంది విధుల్లోకి వెళ్ళలేదు. దీంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్లను నియమించింది. వారికి రోజుకు డ్రైవర్లకు 1500 , కండక్టర్లకు 1000 రూపాయల చొప్పున చెల్లిస్తోంది. అయినా ఎక్కడ కూడా ఆర్టీసీ నేతలు, కార్మికులు అడ్డుకోలేదు. శాంతియుతంగా ఆందోళన చేపట్టారు.

ఇదిలా ఉండగా గన్ పార్కు వద్ద అమర వీరులకు నివాళులు అర్పించేందుకు వెళ్లిన జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి తో పాటు ఇతర నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్కడికక్కడ ఆర్టీసీ సంఘాల నేతలను అడ్డుకున్నారు. సర్కార్ బెదిరింపులకు భయపడేదిలేదని, అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని అన్నారు. మరో వైపు నేతలు బయటకు వచ్చినట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఆర్టీసీ సమ్మెతో ఊళ్లలోకి వెళ్లేందుకు సిద్దమైన జనానికి పండగ వేళ ప్రయాణ కష్టాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సరిపోక పోవటంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు జనం. అయితే ఇదే అదునుగా భావిస్తున్న ప్రవేటు యాజమాన్యాలు అందినంత మేర దండుకుంటున్నారు. ప్రభుత్వం మాత్రం ఆర్టీసీ సంఘాల నేతలతో చర్చలు జరిపే ప్రసక్తి లేదని అంటోంది. కాగా తాము అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళతామని నేతలు అంటున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!