చదవండి..ఎదగండి..స్ఫూర్తిగా నిలవండి..కపిల్ దేవ్
సమాజాన్ని, జీవితాన్ని ప్రభావితం చేసేలా..పదిమందికి స్ఫూర్తి దాయకంగా ఉండేలా విద్యార్థులు ఎదగాలని ప్రముఖ క్రికెటర్, మాజీ టీమిండియా సారథి కపిల్ దేవ్ పిలుపునిచ్చారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని కోరారు. విద్య మాత్రమే ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు దోహద పడుతుందన్నారు. డాక్టర్ అయ్యన్న చౌదరి రామినేని స్మృత్యర్థం అమెరికాలోని రామినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం గుంటూరు లో జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా కపిల్ దేవ్ హాజరయ్యారు. ఈ సందర్బంగా జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు.
సత్తా చాటిన స్టూడెంట్స్ తో పాటు ఉత్తమ టీచర్స్ కు కూడా పురస్కారాలను అందించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను పిల్లలు, విద్యార్థులు అనుసరించాలని, స్ఫూర్తిగా తీసుకోవాలని కపిల్ దేవ్ కోరారు. టీచర్లు చెప్పిన ప్రతి విషయాన్ని శ్రద్దగా నోట్స్ రాసు కోవాలని, దీనివల్ల స్టూడెంట్స్ కు మేలు జరుగుతుందన్నారు. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా సరే పెద్దలను మరిచి పోవద్దని హితవు పలికారు. తాను కూడా మీలాగే చిన్నప్పటి నుంచి అష్టకష్టాలు పడ్డానని కపిల్ దేవ్ చెప్పారు. అయినా ఎప్పుడు అధైర్య పడలేదని, ఒకే లక్ష్యం పెట్టుకుని ముందుకు సాగానని, ఇవ్వాళ మీ ముందు ఇలా నిలబడ్డానని కపిల్ అన్నారు. బాగా చదువుకుని మీ పుట్టిన ఊరుకు, రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకు రావాలని కోరారు.
మొత్తం 190 మంది గురువులకు, 261 మంది విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. మరో అతిథిగా పాల్గొన్న ఏపీ విద్యా శాఖామంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం విద్యాభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. ప్రతి ఒక్కరు చదువుకునేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉచితంగా వసతి, సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. స్మార్ట్ ఫోన్స్ లను వాడొద్దని సూచించారు మంత్రి. ప్రతి ఒక్క విద్యార్ధి చదువే గమ్యంగా సాగి పోవాలని సురేష్ పిలుపునిచ్చారు. రామినేని ఫౌండేషన్ చేస్తున్న ఈ ప్రయత్నం గొప్పదని అన్నారు. అలాగే మిగతా స్వచ్చంద సంస్థలు, ఫౌండేషన్స్ సామాజిక బాధ్యత గా భావించి బడులలో మౌలిక వసతులు కల్పించేందుకు సహాయం చేసేందుకు ముందుకు రావాలని పలువురు పిలుపునిచ్చారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి