కేసీఆర్ తో కేకే భేటీ

ఓ వైపు ఆర్టీసీ సమ్మె మరింత తీవ్ర రూపం దాల్చుతుండడంతో ప్రభుత్వం మరోసారి ఉన్నత స్థాయి సమీక్ష చేయనుంది. అటు కార్మికులు ఇటు ప్రభుత్వం మొండి పట్టు వీడడం లేదు. ఎవరికి వారే ఎమునా తీరే అన్న రీతిలో వ్యవహరిస్తుండడంతో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. దీంతో వేలాది మంది ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. సమ్మె తీవ్రతపై రాష్ట్ర హైకోర్టు సీరియస్ అయ్యింది. వెంటనే కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరపాలని ఆదేశించింది. అంతే కాకుండా సంస్థకు పూర్తి స్థాయిలో మేనేజింగ్ డైరెక్టర్ ను నియమించాలని, తక్షణమే కార్మికులందరికీ సెప్టెంబర్ నెల వేతనాలకు వారి ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశింది. దీనిపై ఆర్టీసీ జేఏసీ స్వాగతించింది. అంతే కాక జీతాలు తీసుకుని తిరిగి సమ్మె లోకి కార్మికులు వెళతారని నేతలు అశ్వత్థామ రెడ్డి, రాజి రెడ్డి, థామస్ రెడ్డిలు స్పష్టం చేశారు.
ప్రభుత్వం అరెస్టులకు దిగుతోందని, బెదిరింపులకు భయపడ బోమని తేల్చి చెప్పారు. మరో వైపు రాష్ట్ర బీజీపీ ప్రెసిడెంట్ లక్ష్మణ్ నేతృత్వంలో రాష్ట్ర గవర్నర్ ను కలిసి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల గురించి తెలియ చేశారు. సానుకూలంగా కార్మికుల సమ్మె పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు అన్ని పార్టీలతో పాటు విద్యార్ధి, ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించాయి. దీంతో రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య అదుపు తప్పే ప్రమాదం పొంచి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఆర్టీసీ సమ్మెపై చర్చల విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుతో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, ఎంపీ కేశవరావు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ భేటీ అయ్యారు.
ఆర్టీసీ జేఏసీతో చర్చల అంశాన్ని కేకే.. కేసీఆర్‌ దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ప్రభుత్వానికి సమ్మతమైతే..ఆర్టీసీ జేఏసీతో చర్చలకు తాను మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని కేకే కేసీఆర్‌తో పేర్కొన్నట్టు సమాచారం. ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ మధ్య చర్చలకు హైకోర్టు విధించిన డెడ్‌లైన్‌ ముగుస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్‌తో కేకే భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. చర్చలు ముగించి.. శుభవార్తతో రావాలని అటు ప్రభుత్వానికి, ఇటు ఆర్టీసీ జేఏసీకి హైకోర్టు సూచించిన సంగతి తెలిసిందే. సమ్మె కొనసాగిస్తున్న ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చల దిశగా కేసీఆర్‌-కేకే భేటీలో కీలక ముందడుగు ఏమైనా పడుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!