యురేనియం వద్దే వద్దు.. హ్యాట్స్ ఆఫ్ యూ..శేఖర్ కమ్ముల..!

దర్శకులు కూడా మనుషులే. సినిమా అనే సరికల్లా హీరోలు, హీరోయిన్లు మాత్రమే గుర్తుకు వస్తారు. ఈ ఒక్క జాడ్యం మన తెలుగు వాళ్ళకే ఉన్నది. డైరెక్టర్లకు సామాజిక బాధ్యత కూడా ఉన్నదన్న విషయాన్ని మరోసారి గుర్తుకు తీసుకు వచ్చారు ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల. జీవితాన్ని మరింత కళాత్మకంగా  తీసే వారిలో ఆయన కూడా ఒకరు. అప్పట్లో కాశీనాథుని విశ్వనాథ్, భారతీ రాజా, వంశీ, గీత కృష్ణ లాంటి వాళ్ళు ఉండే వాళ్ళు. ఇప్పుడు ఆయనతో మరికొందరు లైఫ్ ను, భావోద్వేగాలను వెండితెర మీద పండిస్తున్నారు. అదే తమిళ సినిమాలో అయితే లెక్కలేనంత మంది క్రియేటివ్ డైరెక్టర్లు ఉన్నారు. వారికి ఎన్నో అవకాశాలు తలుపు తడతాయి. ఇక్కడ ఇలా కాదు. హీరో ఓరియెంటెడ్ సినిమాలే ఎక్కువగా తీస్తారు. 

వీళ్ళు తెరపై హీరోలు ..నిజ జీవితంలో జీరోలు. సినిమాల్లో చిలుక పలుకులు ..కానీ ఆదాయంపైనే మక్కువ ఎక్కువ. సామాజిక భాధ్యతను వీరు స్వీకరించేందుకు ఇష్టపడరు. శీతల పానీయాల వల్ల ఎన్నో రోగాలు వస్తున్నాయని పలువురు హెచ్చరిస్తుంటే, యాడ్స్ లలో నటిస్తూనే ఉన్నారు. ఇక తాజా విషయానికి వస్తే దర్శకుడు శేఖర్ కమ్ముల నల్లమల పై సంచలన కామెంట్స్ చేశారు. దయచేసి నల్లమలలో  యురేనియం తవ్వకాలు తక్షణమే నిలిపి వేయాలని , దీనిని  చేపట్టడం వల్ల మానవాళికి తీవ్ర ప్రమాదం ఏర్పడనుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ప్రకృతి సౌందర్యానికి, అడవి బిడ్డలకు, జంతు జీవాలకు అది కేంద్రంగా ఉందని పేర్కొన్నారు.

యురేనియం పేరుతో పర్యావరణానికి హాని తలపెట్టేలా ప్రభుత్వం చేయవద్దంటూ విన్నవించారు. చుట్టూ పక్కల ప్రజలు రోగాల బారిన పడతారు. నల్లమలను నమ్ముకున్న ఆదివాసులు క్యాన్సర్ రోగానికి బలవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. చెంచులు, ఇతర అటవీ వాసులు నివశిస్తున్న ప్రాంతం అయిన నల్లమల సమూలంగా నాశనం అవుతుంది. కృష్ణ , దాని ఉపనదులు కలుషితం అవుతాయి. ఇప్పటికే చాలా మంది  ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడ్డారు. దయచేసి యురేనియం నిక్షేపాల కోసం తవ్వకాలను జరపవద్దంటూ కోరారు శేఖర్ కమ్ముల. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన యురేనియంపై పునరాలోచించాలి. తక్షణమే చెంచులను, ఇతర ఆదివాసులను, పర్యావరణాన్ని మొత్తంగా నల్లమల అడవులను, అందాలను కాపాడాలి అని కోరారు. ఇదే అంశాన్ని కేటీఆర్ కు ట్వీట్ చేశారు. పొద్దాస్తమానం బంగారు తెలంగాణ అంటూ మాట్లాడే ప్రజాప్రతినిధులు, మంత్రులు ఈ దర్శకుడిని చూసి నేర్చుకోవాలి. కవులు, కళాకారులు, నటీ నటులు, దర్శకులు, రచయితలు, గాయకులు, ప్రజాస్వామిక వాదులు, నిబద్దత కలిగిన జర్నలిస్టులు , పర్యావరణ వేత్తలు, సామాజిక కార్యకర్తలు  పాలకుల చర్యలను ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!