ఒక్క రూపాయికే సువిధ న్యాప్కిన్స్ - మోడీ సర్కార్ నిర్ణయం..!
కేంద్రంలో కొలువు దీరిన బీజేపీ ప్రభుత్వం మంచి పనులు చేస్తోంది. సమాజంలో సగానికి పైగా ఉన్నటువంటి మహిళలు, యువతులు, బాలికల సంరక్షణ కోసం చర్యలు చేపట్టింది. ఎక్కువగా పేద మహిళలు, కుటుంబాలు ప్రతి నెలా వచ్చే నెలసరి కోసం వాడే సానిటరీ ప్యాడ్స్ ను కొనుగోలు చేయలేని దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే గుర్తించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోట్లాది బాధిత మహిళలకు తీపి కబురు అందించారు. ఇక నుంచి కేవలం ఒకే ఒక్క రూపాయి ఇస్తే చాలు ప్రభుత్వ సహకారంతో నడుస్తున్న వేలాది జనరిక్ మందుల షాప్స్ లలో ఇవి లభిస్తాయి. ఆ మేరకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేనటువంటి న్యాప్కిన్స్ ను అందుబాటులో ఉంచుతోంది.
ఇందు కోసం సర్కార్ కోట్లాది నిధులను మంజూరు చేసింది. ఇప్పటికే లక్షలాది మంది మార్కెట్లో అధిక ధరలకు అందుబాటులో ఉన్న ప్యాడ్స్ ను కొనుగోలు చేయలేక పోతున్నారు. దీంతో అనుకోని ఇబ్బందులతో పాటు చెప్పుకోలేని రోగాలకు గురవవుతున్నారు. దీనిని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. మహిళల కోసం ఇప్పటికే రాయితీపై గ్యాస్ సిలిండర్లతో పాటు గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది. ఇప్పుడు ఒక్క రూపాయి తో ఇవ్వాలని నిర్ణయించింది. రెండున్నర రూపాయలు ఉన్న దానిని రూపాయిన్నర తగ్గించింది. ఒక్క ప్యాక్ లో నాలుగు ఉంటాయి. ఒక్కో దానికి వన్ రూపీ చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఏర్పాటైన 5500 జన ఔషధీ దుకాణాల్లో సువిధ పేరుతో విక్రయిస్తారు.
కేంద్ర ప్రభుత్వం మహిళలు, బాలికల ఆరోగ్యంపై సర్వే చేపట్టింది. అందులో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగు చూశాయి. 23 శాతానికి పైగా బాలికలు న్యాప్కిన్స్ వాడక పోవడం, రుతు సంబంధమైన ఇబ్బందులు ఉండడంతో బడులకు వెళ్లలేక పోతున్నారని గుర్తించింది. 28 శాతం మంది ఇంటికే పరిమితమవుతున్నారని, ఆ నాలుగు రోజులు నరకం అనుభవిస్తున్నారని తేలింది. నేషనల్ ఫామిలీ హెల్త్ సర్వే ప్రకారం ఇండియాలో కేవలం 48 శాతం మంది మహిళలు, బాలికలు మాత్రమే సానిటరీ న్యాప్కిన్స్ వాడుతున్నారని తెలిపింది. తక్కువ ధరకు ప్రభుత్వం సువిధ ప్యాడ్స్ ను అమ్ముతుండడంతో , గత సంవత్సరం రెండు కోట్ల 20 లక్షల న్యాప్కిన్ ప్యాడ్స్ జనరిక్ దుకాణాల ద్వారా అమ్ముడు పోయినట్లు గుర్తించారు. దీంతో వీటి అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం వాటి మీద పన్ను లేకుండా చేసింది. ఈ నిర్ణయం వల్ల కోట్లాది మంది మహిళలు, బాలికలు మేలు చేకూరనుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి