కొలువులు రావు..కడుపులు నిండవు ..అర్ధాకలితో నిరుద్యోగులు

ఓ వైపు పక్కనే ఉన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వేలాదిగా ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. కానీ బలిదానాలు, త్యాగాలు, పోరాటాల సాక్షిగా కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో లెక్కలేనన్ని కొలువులున్నా భర్తీ చేయడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. నిరుద్యోగులు, విద్యార్థులు , అభ్యర్థులు వేలాది మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. అయినా సర్కార్ పల్లెత్తు మాట మాట్లాడటం లేదు. పొద్దస్తమానం బంగారు తెలంగాణ భజన తప్ప భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టడం లేదంటూ నిరుద్యోగులు వాపోతున్నారు.

ఇప్పటికే చాలా మందికి ఉద్యోగాలకు కావాల్సిన అర్హతలు ఉన్నప్పటికీ , వయసు విషయంలో నిర్దేశించిన ఏజ్ దాటి పోతుండడంతో తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. అయినా మానవతా దృక్పథంతో ఒక్క ప్రకటన కూడా చేయడం లేదు. వ్యవస్థను గాడిలో పెట్టి, సమాజాన్ని బాగు పరిచే క్రమంలో ఉన్నత విద్య దోహద పడుతుంది. చదువు ఒక్కటే కాకుండా జనానికి. లోకానికి మేలు చేకూర్చే పరిశోధనలు అటకెక్కినవి. ఒకప్పుడు యూనివర్సిటీలు చదువులకు కేరాఫ్ గా ఉండేవి. ఇప్పుడు అవి రాజకీయాలకు, పాలకుల బంధువులకు కేరాఫ్ గా మారాయి. వారికి వంత పాడే వాళ్ళు ఉన్నత పదవులలో కొనసాగుతున్నారు. ఈరోజు వరకు పూర్తి స్థాయిలో బోధన, బోధనేతర సిబ్బందిని భర్తీ చేయడం లేదు. చాలా చోట్ల గెస్ట్ ఫ్యాకల్టీ తో నెట్టుకు వస్తున్నారు. కాలేజీలు, యూనివర్సిటీలలో అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉంది.

పూర్తి స్థాయిలో విద్య అందక పోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.  ప్రయివేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు రెడ్ కార్పెట్ పరుస్తున్న సర్కార్ , ప్రభుత్వ ఆధీనంలోని యూనివర్సిటీల బాగోగులను గాలికి వదిలేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పరిధిలో 404 జూనియర్ కాలేజీలు , 55 పాలిటెక్నీక్ కాలేజీలు , 131 డిగ్రీ కాలేజీలు, 11 యూనివర్సిటీలు ఉన్నాయి. 2008 నోటిఫికేషన్ వేశారు. పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ రాలేదు. మొత్తం మీద 6500 మంది కాంట్రాక్ట్ లెక్చరర్స్ గా పని చేస్తున్నారు. ఇంకా బోధనేతర సిబ్బంది భర్తీ ఊసే లేదు. అప్పుడో ఇప్పుడో వస్తాయని కలలు కంటున్న వారంతా అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఇకనైనా సర్కార్ ఖాళీలను వెంటనే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!