జోరుగా సాగు..బతుకంత పోరు..!

ఓ వైపు అనావృష్టి ..ఇంకో వైపు అతి వృష్టి..చెప్పు కోలేనంతటి దుఃఖం కలుగుతోంది. ఆరుగాలం శ్రమించి, రేయనక పగలనక కస్టపడి పండించిన పంటకు చేతికి రాకుండా పోతే ..ఆ బాధ వర్ణనాతీతం. నిన్నటి దాకా నీళ్ల కోసం వేచి చూసిన రైతన్నలకు భారీగా కురిసిన వర్షాలకు ప్రాజెక్టులు, చెరువులు, ఎత్తిపోతల పథకాలు , కాలువలు నిండినా అన్నం పెట్టి ఆకలితీర్చే అన్నదాతలకు మాత్రం ఆవేదన మాత్రమే మిగులుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసినా రైతుల పరిస్థితుల్లో మార్పులు రావడం లేదు. తాజాగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు కొంత మేరకు ఉపశమనం కలిగినా, పూర్తి స్థాయిలో సాగు అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

భూములు సాగు చేయాలంటే , పంటలు పండించాలంటే తడిసి మోపెడవుతోంది. చేసిన రుణాలు తీర్చలేక , అధిక వద్దెలకు అప్పులు తీసుకు వస్తే, చేసిన కష్టం వడ్డీలకే సరి పోతోంది. దీంతో వ్యవసాయం తలకు మించిన భారమవుతోంది. ఇప్పటికే వర్షాలు కురుస్తాయని రైతులు సాగు చేసిన పంటలు చేతికి వచ్చేలా లేవు. ఇటీవల పెద్ద ఎత్తున వర్షాలు కురియడంతో , భారీ ఎత్తున సాగు చేయడంలో తలమునకలై ఉన్నారు. ఎగువన కర్ణాటక , మహారాష్ట్ర ల నుండి కృష్ణా , గోదావరి నదుల్లోకి వరద ప్రవాహం పోటెత్తింది. దీంతో  తెలంగాణలో  సాగు విస్తీర్ణం మరింత పెరిగింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ వేసిన అంచనా ప్రకారం ఏకంగా 80 శాతానికి మించి సాగైనట్లు తేలింది. ఇంకా కొద్దీ రోజుల్లో అది  వంద శాతం పెరిగే అవకాశం ఉన్నది.

తెలంగాణ వ్యాప్తంగా సాగు విస్తీర్ణం కోటి ఎనిమిది లక్షల ఎకరాలు కాగా ఇప్పటి దాకా 92 . 52 లక్షల ఎకరాలు ప్రస్తుతానికి సాగైంది. ఎక్కువగా మన రైతాంగం వరి, పత్తి, పసుపు , వాణిజ్య పంటలను సాగు చేస్తున్నారు. మెట్ట పంటలపై మాత్రం వానల ప్రభావం ఎక్కువగా ఉంటోంది. దీని వల్ల భారీ నష్టాలను చవి చూసే ప్రమాదాన్ని రైతులు కొని తెచ్చుకుంటున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఎక్కువగా అన్నదాతలు వరి పైనే మక్కువ చూపించారు. ఇప్పటి వరకు 82 శాతానికి పైగా సాగు చేశారు. గత నెలలో వరి నారు మాత్రమే అట్టి పెట్టుకుని , వానలు కురిశాక తిరిగి నాట్లు వేయడం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా దీనిని పండించారు. మిగతా పంటలు కూడా ఇలాగే ఉన్నాయి. మొత్తం మీద వానలు భారీగా కురిసినా రైతుల చింత తీరడం లేదు..బతుకు సాగడం లేదు. 

కామెంట్‌లు