దేనికైనా సిద్ధమంటున్న సీఎండీ

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు , రైతులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని , ఇందులో ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని, ఎలాంటి ఆరోపణలపైనా సీబీఐ లేదా సుప్రీం కోర్ట్ సిట్టింగ్ జడ్జ్ తో విచారణకైనా సిద్ధంగా ఉన్నామని ట్రాన్స్ కో, జెన్ కో విదుత్ సంస్థల సీఎండీ ప్రభాకర్ రావు స్పష్టం చేశారు. ఎవరైనా ఎలాంటి ఎంక్వయిరీ చేయించు కోవచ్చని చెప్పారు. ప్రజలు, ప్రభుత్వం తమపై పూర్తి నమ్మకాన్ని , విశ్వాసాన్ని ఉంచిందని ..దానిని ఎలా పోగొట్టుకుంటామని అన్నారు. దక్షిణ , ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు రఘుమా రెడ్డి , ఏ. గోపాల రావ్ , ట్రాన్స్ కో జీఎం డి శ్రీనివాస రావ్ తో కలిసి హైదరాబాద్ లోని విద్యుత్ సౌధ లో మాట్లాడారు.

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ రెండు రోజుల కిందట విద్యుత్ కొనుగోళ్ల పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని , నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. దీంతో విద్యుత్ సంస్థ బాధ్యులు లక్ష్మణ్ చేసిన విమర్శల్లో పస లేదని, అన్నీ సక్రమంగానే ఉన్నాయని, దేనికైనా నిరూపించేందుకు రెడీగా ఉన్నామని సవాల్ విసిరారు. తాము రేయింబవళ్లు కష్టపడుతూ కరెంట్ సరఫరా చేస్తున్నామని సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. సమాచార లోపం, సంస్థపై పూర్తిగా అవగాహన లేక పోవడం వల్ల బీజేపీ ప్రెసిడెంట్ ఆరోపణలు చేసినట్లు అర్థమైందన్నారు.
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నుండి 400 మెగా వాట్స్ కొనుగోలు చేస్తూ గరిష్ఠంగా 5 రూపాయల 19 పైసలు చెల్లిస్తున్నామని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు సౌర విద్యుత్ ఉత్పత్తి కెపాసిటీ 71 మెగావాట్ల ఉండగా దానిని 3 వేల 600 మెగావాట్లకు పెంచామన్నారు. దీనిని కొనుగోలు చేసిన విధానాన్ని దేశం ప్రశంసించింది అని చెప్పారు. అప్పట్లో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 7778 మెగా వాట్లుండగా ఇప్పుడు 16203 మెగా వాట్లకు చేరిందని ప్రభాకర్ రావు వెల్లడించారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థను 23 వేల కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. సంస్థల పని తీరు బాగున్నందు వల్లనే ఆర్ధిక సాయం తో పాటు రుణాలు సులభంగా వస్తున్నాయని, దీని గురించి తెలుసుకుంటే మంచిదన్నారు.

పీపీఏ ఒకే ఒక్క ప్రైవేటు విద్యుత్ సంస్థతో 570 మెగావాట్లకు యూనిట్ ను నాలుగు రూపాయల ఐదు పైసల చొప్పున కొనేలా చేసుకున్నాం. సీఎం కేసీఆర్ చేసిన కృషి వల్లనే ఉత్తర-దక్షిణ భారతాల మధ్య పవర్‌ కారిడార్‌ వచ్చిందని సీఎండీ చెప్పారు. తాము ఎలాంటి వత్తిళ్లకు లొంగడం లేదన్నారు. విద్యుత్‌ కొనుగోలుకు కేంద్రం ప్రవేశపెట్టిన ‘లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌’ విధానం.. రాష్ట్రాల విద్యుత్‌ సంస్థలకు గుదిబండగా మారిందన్నారు. అయితే విద్యుత్ కొనుగోళ్ల విషయంలో తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని లక్షణ్ స్పష్టం చేశారు. ఆధారాలు రెడీగా ఉన్నాయని ఇక విచారణ జరగడమే ఆలశ్యమన్నారు. మొత్తం మీద కమలం ..కారు మధ్యన పోరు జోరందుకున్నట్టుంది.

కామెంట్‌లు