!..వరికుప్పల..గలగల..!
మనుషులన్నాక కలలు ఉంటాయి..కన్నీళ్లు పలకరిస్తాయి. మానవ జీవితమే అంత. ఆవేదనలు ..ఆలోచనలు ..పలకరింపులు..చూపులు ..గుండెల్ని కదిలించే మాటలు ..మైమరిచి పోయేలా పాటలు..ఇవ్వన్నీ ఉండటం మామూలే. వీటిని దాటి వెళ్లిన వాళ్ళు పిచ్చోల్లైనా కావాలి లేదా యోగులైనా అయి ఉండాలి. జీవితంలో గొప్ప అనుభవం ఏదన్నా ఉందంటే అది సినిమా ఒక్కటే. అందుకే దాని కోసం ఇంతలా వెంపర్లాడుతాం. కుప్పలు తెప్పలుగా మాట్లాడుకుంటాం. కానీ పాటలు అలా కాదు. పదాల కలబోత. గుండెల్లో గుబులు రేపుతూ..మౌనాన్ని ఆశ్రయించే హృదయాలను కదిలేచేలా చేయటం ఒక్క పాటకు మాత్రమే ఉన్నది. అందుకే చాలా మంది కవులుగా రాణిస్తున్నారు. గొప్పగా రాస్తున్నారు. కానీ సినిమాల్లో సక్సెస్ కాలేక పోతున్నారు.
ఎందుకంటే కవిత్వం రాసినంత ఈజీ కాదు సాంగ్స్ రాయడం అంటే. సిట్యుయేషన్ కు తగ్గట్టు పాటలు రాయడం కత్తి మీద సాము చేయడం లాంటిది. అందుకే గేయ రచయితలకు భారీ డిమాండ్ ఉంటోంది. అప్పట్లో టాలీవుడ్ లో ఓ పాట జనాన్ని మెస్మరైజ్ చేసింది. అదే తెలంగాణకు చెందిన వరికుప్పల రాసిన అందమైన కుందనాల బొమ్మరా అనే పాట. కళాకారుడిగా పేరు తెచ్చుకున్న ఇతగాడు ఇప్పటి దాకా 200 కు పైగా పాటలు రాశాడు. కొన్నేళ్ల పాటు అవకాశాల కోసం నిరీక్షించాడు. కొంత కాలం ఆగాక రేసు గుర్రం సినిమాతో బ్రేక్ వచ్చింది. అదే అతడు రాసిన పాట బంపర్ హిట్. సినిమా చూపిస్త మావ ..నీకు అంటూ రాసిన ఈ సాంగ్ ప్రతి చోటా వినిపించింది.
యాదగిరికి ఇప్పుడు 43 ఏళ్ళు. నిజామాబాద్ జిల్లా సాతాపూర్ ఊరు. కవిగా , రచయితగా , గాయకుడిగా , సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పటి దాకా జనాన్ని ఆకట్టుకునేలా పాటలు అల్లాడు . పేద కుటుంబం కావడంతో చిన్నతనం లోనే పలు కష్టాలు ఎదుర్కున్నాడు. అయినా సినిమా అంటే అభిమానం. తండ్రితో కలిసి భజనకు వెళ్ళాడు. పశువుల కొట్టంలో పని చేశాడు. ఓ కాంట్రాక్టర్ దగ్గర అన్నయ్య పనికి పెట్టాడు. బడికి పోతానంటూ మూడు రోజులు అన్నం తినలేదు. భయపడ్డ అమ్మ యాదగిరిని చదువుకునేందుకు ఒప్పుకుంది. చదవడం , రాయడం మొదలు పెట్టాడు. బతుకులోని కష్టాలే అతడిని రాటుదేలేలా చేశాయి.
మొదట్నుంచీ సొంతంగా సాహిత్యం రాసుకొని, దానికి స్వరకల్పన చేసుకొని పాడటం అలవాటు. అలా రాసుకున్న ఓ ఐదు పాటల్ని యాదిరెడ్డి, ఎల్బీ శ్రీరాం లాంటి వాళ్ళ ముందు వినిపించాడు. వీరికి రెండు పాటలు బాగా నచ్చాయి. వాటిని సినిమాలో వాడుకుంటామని చెప్పారు. వాళ్ల వల్లే తను బాగా రాస్తానన్న విషయం ఇతడికి తెలిసింది. మూడు నెలల తరువాత ఆ పాటలు తీసుకున్నందుకు కొన్ని డబ్బులిచ్చారు. ప్రేమ పల్లకి సినిమాతో గాయకుడు కాబోయి అనుకోకుండా రచయితగా మారాడు. ఆ సినిమాని మయూరి సంస్థ పంపిణీ చేసింది. అందులోని పాటలు రామోజీరావుగారికి బాగా నచ్చడంతో, యాదగిరికి ఫిలింసిటీలో ని ఆడియో లైబ్రరీ ప్రాజెక్ట్ లో పని చేసేలా ఉద్యోగం ఇచ్చారు.
ఇక్కడ పని చేస్తున్న సమయంలో బ్యాచిలర్స్ మూవీ షూటింగ్ జరగడం, తాను రాసిన పాటలు తీసు కోవడం, వాటిని తానే పాడే ఛాన్స్ దక్కించుకున్నాడు వరికుప్పల. అప్పుడే యాదిరెడ్డి సంపంగి సినిమాకు అన్ని పాటలు రాసే అవకాశం ఇచ్చారు. ఆయన రాసి పాడిన అందమైన కుందనాల బొమ్మరా అనే సాంగ్ బంపర్ హిట్. తల్లి చని పోవడంతో మూడేళ్లు మనిషి కాలేక పోయాడు యాదగిరి.. సినీ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ ఫోన్ చేసి ఇతడిని పిలిచి క్లాస్ తీసుకున్నారు. ఆయన సినిమా తొట్టిగ్యాంగ్‌లో రెండు పాటలు రాయించారు. అయినా కస్టాలు అతడిని వెంటాడాయి. 100 రూపాయలకు ఇబ్బంది పడ్డాడు. ఇదే సమయంలో దేవుడిలా సురేందర్ రెడ్డి ఆదుకున్నాడు. కొన్ని పాటలకు సాహిత్యం రాసి, స్వరాలు సిద్దం చేసి తీసుకు రమ్మన్నాడు..వరికుప్పల రాసిన నాలుగు పాటలూ నచ్చడంతో వాటిని బ్యాంకాక్‌లో సిట్టింగ్స్‌కి తీసుకెళ్తానని చెప్పాడు.
తిరిగొచ్చాక ఆ పాటల సంగతి మరచిపోయి, సినిమాలో ప్రకాష్‌రాజ్‌ని ..అల్లు అర్జున్ ముప్పతిప్పలు పెట్టే సందర్భం చెప్పి పాట రాయమన్నాడు. దీంతో యాదగిరికి పట్టుదల పెరిగి ఆ పాటతో చావో రేవోతేల్చుకోవాలని అనుకున్నాడు. ఒకట్రెండు రోజుల్లో రాసి వినిపిస్తే సురేందర్ రెడ్డి సూపర్ అన్నాడు. అదే సినిమా చూపిస్త మామా అంటూ తెలుగు వాళ్లని వూపేసిన పాట.యూట్యూబ్ లో కోటీ తొంభై లక్షలమందికిపైగా వీక్షించిన ఒకే ఒక్క తెలుగు పాట ఇదే. ఆ సినిమాకే రాసిన స్వీటీ , రేసుగుర్రం చిత్ర గీతాలు కూడా కోటిన్నర మందికి పైగా చూశారు. దాంతో ఇతడి కెరీర్ మళ్లీ కొత్తగా మొదలైంది. ఇక పవర్, డిక్టేటర్, కరెంటు తీగ, శౌర్య, చుట్టాలబ్బాయి, కృష్ణాష్టమి, కిక్ 2 లాంటి సినిమాల్లో పాటలకు మంచి గుర్తింపు వచ్చింది. భగీరధుడు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి సినిమాలకు సంగీతం అందించాడు. ఒకప్పుడు యెనలేని కస్టాలు పడిన ఈ తెలంగాణ పోరడు ఇప్పుడు సక్సెస్ ఫుల్ రైటర్..అంటే నమ్మగలమా.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి