జ‌గ‌న్‌..బాబుల మ‌ధ్య మాట‌ల యుద్ధం ..!

ఆంధ్రా అసెంబ్లీ ర‌ణరంగాన్ని త‌ల‌పింప చేసింది. మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు..తాజా ముఖ్య‌మంత్రి సందింటి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తెలంగాణ నీళ్ల అంశం కుదిపేసింది. చ‌ర్చంతా దీనిపైనే జ‌రిగింది. బాబు, జ‌గ‌న్‌ల మ‌ధ్య మాట‌ల యుద్దం న‌డిచింది. ఒక‌రిపై మ‌రొక‌రు తీవ్ర విమ‌ర్శ‌లు చేసుకున్నారు. శాస‌న‌స‌భ నియ‌మ నిబంధ‌న‌ల‌కు కాళేశ్వ‌రం , గోదావ‌రి -కృష్ణా లింక్‌పై అధికార‌, ప్ర‌తిప‌క్ష సభ్యుల మ‌ధ్య స‌భ‌లో వాడి వేడిగా చ‌ర్చ జ‌రిగింది. తెలంగాణ ప్రాంతం నుంచి ఏపీకి నీళ్లు తెస్తామ‌ని ఇందు కోసం ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఓకే చేశార‌ని ఏపీ సీఎం జ‌గ‌న్ స‌భ‌లో ప్ర‌క‌టించారు. త‌న‌కున్న సత్సంబంధాల వ‌ల్ల‌నే ఇది సాధ్య‌మైంద‌ని తెలిపారు. తెలంగాణ భూమి మీదుగా గోదావ‌రి జ‌లాల‌ను త‌ర‌లించి..ఏపీలోని కృష్ణా ఆయ‌క‌ట్టును స్థిరీక‌రిస్తామ‌ని చెప్పారు. ఈ విష‌యంపై సీఎం అభ్యంత‌రం తెలుపుతూ తెలంగాణ నుంచి ఒక‌వేళ నీళ్లు రాక‌పోతే ఏం చేస్తారంటూ చంద్ర‌బాబు అభ్యంత‌రం తెలిపారు. 

దీనిపై తీవ్రంగా స్పందించారు జ‌గ‌న్. ఏపీలో అభివృద్ధి కోసం కేసీఆర్ స‌హ‌క‌రిస్తున్నారు. ఏపీకి తెలంగాణ నుంచి నీళ్లు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. తెలంగాణ హ‌ద్దులో ఉన్న గోదావ‌రి నీళ్ల‌ను శ్రీ‌శైలం, నాగార్జున‌సాగ‌ర్‌కు తెచ్చుకుని ..రాయ‌ల‌సీమ‌కు, కృష్ణా ఆయ‌క‌ట్టుకు ఇస్తామంటే చంద్ర‌బాబుకు ఎందుకంత బాధ అంటూ వ్యాఖ్యానించారు. గోదావ‌రి న‌దికి నాలుగు పాయ‌లుంటే, నాసిక్ నుంచి వ‌చ్చే పాయ ఏనాడో ఎండి పోయింద‌ని అది తెలంగాణ‌కు చేర‌డం లేద‌న్నారు. రెండో పాయ ప్రాణ‌హిత‌లో 36 శాతం, మూడో పాయ ఇంద్రావ‌తిలో 26 శాతంగా మొత్తం 60 శాతం గోదావ‌రి జ‌లాలు తెలంగాణ ప్రాంతానికి ఉన్నాయ‌ని జ‌గ‌న్ వెల్ల‌డించారు. అయితే ఏపీకి శ‌బ‌రి పాయ ద్వారా కేవ‌లం 11 శాతం అంటే 500 టీఎంసీలు మాత్రమే ద‌క్కుతాయ‌ని ..ఈ స‌మ‌యంలో నీటి ల‌భ్యత ఎక్కువ‌గా ఉన్న తెలంగాణ ..దిగువ‌కు నీటిని వ‌దిలితే త‌ప్పా ఏపీకి దిక్కు లేద‌న్నారు. చంద్ర‌బాబు హ‌యాంలో 3 టీఎంసీల నీళ్ల‌ను త‌ర‌లించే కాళేశ్వ‌రం ప్రాజెక్టు క‌డుతున్న‌ప్పుడు ఎందుకు అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌లేదంటూ నిల‌దీశారు. 

ఎగువ భాగంలో ఉన్న వాళ్లు ప్రాజెక్టులు క‌ట్ట‌డం..నీటిని త‌ర‌లించుకు పోవడం స‌హ‌జాతి స‌హ‌జ‌మ‌ని ..అందుకు గొడ‌వ‌లు చేసి, కోర్టుల‌కు వెళ్లి  కేసులు వేస్తే అవి ఏనాటికీ ప‌రిష్కారం కావ‌న్నారు. క‌ర్నాట‌క‌లో ఆల్మ‌ట్టి ఎత్తు పెంచినా , 
 మహారాష్ట్రలో అడ్డగోలు ప్రాజెక్టులు కట్టినా, తెలంగాణలో కేసీఆర్ కాళేశ్వరం ద్వారా రోజూ 3 టీఎంసీలను లిఫ్ట్ చేసుకొని పోతున్నా ఏమీ చేయ‌లేక పోయార‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఈ స‌మ‌యంలో ఇప్పడు మనకు కావాల్సింది గొడవలు కాదు. రాష్ట్రాల మధ్య సఖ్యత.. సీఎంల మధ్య సత్సంబంధాలు ఉంటే, కలిసి పనిచేసే గుణం ఉంటే ఏదైనా అభివృద్ధి  జరుగుతుందన్నారు. ఈ స‌మ‌యంలో కేసీఆర్ ఒక అడుగు ముందుకు వేస్తే త‌ప్పేంట‌ని ప్ర‌శ్నించారు.  గోదావరి నీటిని నాగార్జున సాగర్​కు తరలించడం వల్ల  తెలంగాణలోని మహబూబ్​నగర్,  రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు సాగునీరు ఇవ్వవచ్చని కేసీఆర్ భావిస్తున్నారని, ఏపీకి సంబంధించి రాయలసీమలోని నాలుగు జిల్లాలతోపాటు ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల‌కు  కృష్ణా ఆయకట్టును స్థిరీకరించే అవకాశం ఉంటుంద‌ని పేర్కొన్నారు. మొత్తంగా అసెంబ్లీ మొత్తం ఈ అంశాల‌పై మాట‌ల యుద్ధం కొన‌సాగింది. దీంతో స్పీక‌ర్ స‌భ‌ను వాయిదా వేశారు.  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!