కోర్టుకు చేరిన క‌ర్నాట‌కం..సందిగ్ధంలోనే ప్ర‌భుత్వం

రోజుకో ట్విస్ట్ తో  క‌న్న‌డ నాట రాజ‌కీయాలు మ‌రింత హీటెక్కిస్తున్నాయి. రాజీనామా స‌మ‌ర్పించిన ఎమ్మెల్యేలు త‌మ లెట‌ర్ల‌కు ఆమోదం తెల‌పాల‌ని స్పీక‌ర్ ర‌మేష్ కుమార్‌కు విన్న‌వించారు. ఆయ‌న స‌సేమిరా అన‌డంతో చివ‌ర‌కు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. దీంతో స్పందించిన స‌ర్వోన్న‌త న్యాయ స్థానం వెంట‌నే నిర్ణ‌యాన్ని తీసుకోవాల‌ని సీజేఐ బెంచ్ స్పీక‌ర్‌ను ఆదేశించింది. దీనికి స్పీక‌ర్ మాత్రం త‌క్ష‌ణ‌మే వారి రాజీనామాల‌ను ఆమోదించేందుకు కుద‌ర‌ని, కొంత స‌మ‌యం కావాల‌ని కోరారు. స‌రైన ఫార్మాట్‌లో ఇవ్వ‌కుండా ఎక్క‌డో ఉండి రాజకీయాలు చేస్తే ఎలా అని స్పీక‌ర్ ప్ర‌శ్నించారు. ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకుంటున్నాన‌ని, త‌న వ‌య‌సు అయిపోయింద‌ని, ఆ మాత్రం త‌న ప‌ద‌వికి క‌ట్టుబ‌డి ప‌నిచేయ‌క పోతే తాను ఎందుకు ఇక్క‌డ ఉన్న‌ట్టు అంటూ ప్ర‌శ్నించారు. రోజు రోజుకు రాజ‌కీయాల్లో విలువ‌ల‌కు చోటు లేకుండా పోతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

భార‌త రాజ్యాంగాన్ని ప‌రిర‌క్షించ‌డంలో భాగంగానే తాను ఈ నిర్ణ‌యాన్ని తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని, ప్ర‌తి అంశాన్ని నిశితంగా ప‌రిశీలిస్తున్నాన‌ని స్పీక‌ర్ వెల్ల‌డించారు. ముంబై హోట‌ల్‌లో ఇంత‌కాలం సేద దీరిన రెబ‌ల్ ఎమ్మెల్యేలు 10 మంది ప్ర‌త్యేక విమానంలో బెంగ‌ళూరుకు బ‌య‌లుదేరి వ‌చ్చారు. మొద‌టిసారి స‌మ‌ర్పించిన రాజీనామాలు స‌రైన ఫార్మాట్‌లో లేవంటూ స్పీక‌ర్ అభ్యంత‌రం తెలిపారు. దీంతో తిరిగి రెండోసారి 10 మంది ఎమ్మెల్యేలు స్పీక‌ర్ కు స‌మ‌ర్పించారు. ఈ విష‌యంపై మ‌రోసారి సుప్రీంకోర్టు విచారించ‌నుంది. ఇదిలా ఉండ‌గా పాలిటిక్స్ పసందుగా మారిన స‌మ‌యంలో తాజా ముఖ్య‌మంత్రి కుమార స్వామి మాత్రం తాను ఎట్టి ప‌రిస్థితుల్లోను త‌న ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రిజైన్ చేసే ప్ర‌స‌క్తి లేదంటూ స్ప‌ష్టం చేశారు. ఎలాంటి బ‌ల‌ప‌రీక్ష‌కైనా తాను సిద్ధంగా ఉన్నానంటూ పేర్కొన్నారు. ఈ రాజ‌కీయ అనిశ్చిత ప‌రిస్థితి గ‌త ఆరు రోజులుగా కొన‌సాగుతూ వ‌స్తోంది.

అనేక మ‌లుపులు తిరుగుతూ వ‌స్తోంది. పొలిటిక‌ల్ పంచాయ‌తీ ఇపుడు సుప్రీంకోర్టు వాకిట చేరుకుంది. క‌ర్నాట‌క కేసును ఎమ‌ర్జెన్సీగా విచారించింది. అంతే వేగంగా నిర్ణ‌యం తీసుకోవాల‌ని సీజేఐ బెంచ్ క‌ర్నాట‌క స్పీక‌ర్‌కు సూచించింది. రాజ్యాంగ ప‌ద‌విలో ఉన్న తాను, కోర్టు చెప్పిన‌ట్లు న‌డుచు కోలేనంటూ స్పీక‌ర్ ధిక్కార స్వ‌రం వినిపించ‌డంతో వ్య‌వ‌హారం మ‌రింత సంక్లిష్టంగా మారింది. రాజీనామాలు ఆమోదించేలా స్పీక‌ర్ ను ఆదేశించాలంటూ 10 మంది రెబ‌ల్స్ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను సీజెఐ రంజ‌న్ గొగొయ్ బెంచ్ విచారించింది. కాగా అసెంబ్లీలో బ‌ల‌ప‌రీక్ష నిర్వ‌హించేందుకంటే ముందే త‌మ‌పై అన‌ర్హ‌త వేటు వేసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని, అందుకే రాజీనామాలు చేసి తాము ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని అనుకుంటున్నామ‌ని కోర్టుకు రెబ‌ల్స్ తెలిపారు. వాద‌న విన్న వెంట‌నే సీజేఐ బెంచ్ తీర్పు చెప్పింది. తిరిగి విచార‌ణ కొన‌సాగిస్తామంటూ పేర్కొంది. కొంత గ‌డువు కావాలంటూ స్పీక‌ర్ వేసిన పిటిష‌న్ ను బెంచ్ నిరాక‌రించింది.

 - ఎమ్మెల్యేలతో జ‌రిగిన సంభాషణ మొత్తాన్ని వీడియోలో రికార్డు చేశాం. ఆ ఫుటేజీని సుప్రీంకోర్టు రిజిస్ట్రార్​కు పంపుతాం. ఈ విషయంపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు నన్ను ఆదేశించింది. అయితే ఏ నిర్ణయం తీసుకోవాలో స్పష్టంగా చెప్పలేదు. ఆ మాట ఎందుకన్నారో, మూడ్రోజులకే ఇంత హడావుడిగా ఆదేశాలివ్వాల్సిన అవసరం ఏమొచ్చిందో నాకు అర్థం కాలేదు. యస్​, నేను పుట్టిన గడ్డను ప్రేమిస్తాను కాబట్టే, ఇక్కడ అన్నీ బాగుండాలని కోరుకుంటాను.  బాధ్యతగల స్పీకర్​గా అడ్డగోలు వ్యవహారాలను నేను అస్సలు ప్రోత్సహించను అంటూ స్పీక‌ర్ ర‌మేష్ కుమార్ స్ప‌ష్టం చేశారు. దీంతో క‌న్న‌డ రాజ‌కీయం మ‌రింత హాటుగా మారింది. -!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!