అమ్మో లావ‌ణ్య‌..నోట్ల క‌ట్ట‌లు..ఆభ‌ర‌ణాలు..రెవిన్యూ శాఖ‌లో మ‌రో జ‌ల‌గ ..ఎమ్మార్వో అరెస్ట్ ..ఏసీబీ కోర్టుకు త‌ర‌లింపు..!

ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల్సిన అధికారులు త‌మ‌కు అడ్డే లేదంటూ అడ్డ‌గోలుగా సంపాదించేస్తున్నారు. తెలంగాణ ఏర్ప‌డ్డాక అవినీతి అంటూ ఉండ‌ద‌ని చెప్పిన స‌ర్కార్ కు దిమ్మ తిరిగేలా అందినంత మేర దోచేస్తున్నారు. ప్ర‌తి ప‌నికి ఓ రేటు నిర్ణ‌యించేసి ..ప్ర‌జ‌లకు సేవ‌లందించాల్సిన ఆఫీసుల‌నే అడ్డాలుగా మార్చేసుకున్నారు. ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లా గ‌త కొన్నేళ్లుగా దోపిడీకి లోనైంది. దీనిని నాలుగు జిల్లాలుగా విభ‌జించారు. అయినా పేద‌ల బ‌తుకులు మార‌లేదు. రైతుల వెత‌లు తీర‌లేదు. ఒక‌టే జ‌పం..బంగారు తెలంగాణ‌. అక్ర‌మార్కుల‌కు, రియ‌ల్ ఎస్టేట్ దారుల‌కు, మ‌ర్డ‌ర్లు, మాన‌భంగాల‌కు , ర‌హ‌దారి ప్ర‌మాదాల‌కు నెల‌వై పోయింది ఈ తెలంగాణ‌. అన్ని శాఖ‌ల‌కంటే రెవిన్యూ శాఖ‌లో అవినీతి రాజ్య‌మేలుతోంది. పైస‌లు త‌డ‌పందే ఫైళ్లు క‌ద‌ల‌లేని ప‌రిస్థితి దాపురించింది. టిఆర్ ఎస్ స‌ర్కార్ ఏర్పాటు అయ్యాక ఎవ‌రైనా లంచం అడిగితే నేరుగా త‌మ‌కు ఫిర్యాదు చేయండంటూ ..సీఎం అప్ప‌ట్లో టోల్ ఫ్రీ నెంబ‌ర్ ప్ర‌క‌టించారు. దానికి వేలాది మంది బాధితులు విన‌తులు స‌మ‌ర్పించుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు చ‌ర్య‌లు తీసుకున్న పాపాన పోలేదు. 

వీరి నిర్వాకానికి ఇటీవ‌లే ఓ క‌లెక్ట‌ర్ ముందే ఓ రైతు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేయ‌బోయాడు. లెక్క‌లేన‌న్ని మోసాలు. లెక్కించ‌లేనంత లంచాలు మూట‌గ‌ట్టుకున్నారు. తాత్కాలికంగా స‌స్పెండ్ చేయ‌డం, ఆ త‌ర్వాత తిరిగి పైస‌లు ఇవ్వ‌డం..మళ్లీ డ్యూటీలో జాయిన్ కావ‌డం మామూలై పోయింది. కాగా ఈసారి సీఎం మ‌రో సారి సీరియ‌స్ కామెంట్స్ చేశారు. రెవిన్యూ శాఖ‌లో అవినీతి పెచ్చ‌రిల్లి పోయింద‌ని, దీనిని వ్య‌వ‌సాయ శాఖ‌లో విలీనం చేస్తానంటూ ప్ర‌క‌టించారు. దీంతో వ‌ర్కు టు రూల్, పెన్ డౌన్ కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుట్టారు స‌ద‌రు రెవిన్యూ శాఖ ఉద్యోగులు. తాజాగా అవినీతికి కేరాఫ్‌గా మారిన‌..స‌ధ‌రు శాఖ‌కు చెందిన షాద్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలోని కేశంపేట మండ‌ల రెవిన్యూ అధికారిణి లావ‌ణ్య‌తో పాటు విఆర్ఓను రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. 

ఈ ఇష్యూలో విఆర్ఓను విచారించిన అవినీతి అధికారుల‌కు దిమ్మ తిరిగే స‌మాధానం దొరికింది. తాను అవినీతికి పాల్ప‌డ‌టం లేద‌ని, బాధితుల‌తో వ‌సూలు చేసిన డ‌బ్బుల‌న్నీ ప‌నిచేస్తున్న ఎమ్మార్వో లావ‌ణ్య చెబితేనే తాను తీసుకుంటున్నాన‌ని , త‌న‌కు ఎలాంటి సంబంధం లేదంటూ చెప్పారు. దీంతో ఇద్ద‌రిపై కేసు న‌మోదు చేశారు. స‌ద‌రు లావ‌ణ్య‌కు చెందిన ఇంటిపై మూకుమ్మ‌డి దాడి చేశారు. నోట్ల క‌ట్ట‌లు దొరికాయి. ఎక్క‌డ చూసినా 500 నోట్లు, 2000, 100 రూపాయ‌ల క‌ట్ట‌లు గుట్ట‌లుగా పేర్చి పెట్టారు. అంతేకాకుండా లెక్కించ‌లేనంత ఆభ‌ర‌ణాలు దొరికాయి.

న‌గ‌దు 93 ల‌క్ష‌ల రూపాయ‌ల‌తో పాటు 40 తులాల బంగారు ఆభ‌ర‌ణాలు ల‌భించాయి. ఆమె భ‌ర్త జిహెచ్ఎంసీలో సూప‌రింటెండెంట్‌గా ప‌నిచేస్తున్నారు. లావ‌ణ్య‌తో పాటు ఆమె బంధువులు, భ‌ర్త ప‌నిచేస్తున్న చోటుతో పాటు ఆయ‌నకు చెందిన స్నేహితులు, ఇత‌రుల ఇళ్ల‌లో సోదాలు జ‌రిపారు. ఒక ప్ర‌భుత్వ అధికారిణి ఇంట్లో గ‌త ప‌దేళ్ల‌లో ఇంత పెద్ద ఎత్తున న‌గ‌దు సొమ్ముతో ప‌ట్టుబ‌డ‌టం ఇదే తొలిసారి. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండ‌లం ద‌త్తాయిప‌ల్లికి చెందిన రైతు మామిడిప‌ల్లి బాస్క‌ర్ త‌న 9.7 ఎక‌రాల పొలానికి కేటాయించిన నంబ‌రు స‌ర్వే రికార్డులో లేదంటూ రెండు నెల‌ల నుంచి త‌హ‌శిల్దార్ కార్యాల‌యం చుట్టూ తిరుగుతున్నారు. డ‌బ్బులిస్తేనే ప‌ని జ‌రుగుతుంద‌ని విఆర్వో అనంత‌య్య చెప్పాడు. 8 ల‌క్ష‌లు లంచం ఇవ్వాల‌ని డిమాండ్ చేశాడు. అందులో త‌న‌కు 5 ల‌క్ష‌లు ఎమ్మార్వో కు 3 ల‌క్ష‌లు అని చెప్పాడు. 

గ‌త నెల‌లో ముంద‌స్తుగా 30 వేలు బ‌యానా తీసుకున్నాడు. ఇంత పెద్ద మొత్తం లంచం ఎందుకివ్వాల‌ని త‌న‌లో తాను ఆలోచించుకున్నాడు. అనిశా అధికారుల‌ను ఆశ్ర‌యించాడు. లావ‌ణ్య ఆదేశాల మేర‌కే తాను లంచం తీసుకున్నాన‌ని, ఆమె ఇల్లు హ‌య‌త్‌న‌గ‌ర్‌లో ఉంద‌ని చెప్పాడు. విఆర్వోను త‌క్ష‌ణ‌మే అరెస్ట్ చేసి జైలుకు త‌ర‌లించారు. మ‌రో వైపు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న‌ట్లు తేల‌డంతో లావ‌ణ్య‌ను అరెస్ట్ చేసి నాంప‌ల్లిలోని ఏసీబీ కార్యాల‌యానికి త‌ర‌లించి విచారిస్తున్నారు. విచార‌ణ పూర్త‌యిన త‌ర్వాత త‌హ‌శిల్దార్ లావ‌ణ్య‌ను ఏసీబీ ప్ర‌త్యేక కోర్టుకు త‌ర‌లించారు. రంగారెడ్డి, ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలో ప‌నిచేస్తున్న రెవిన్యూ అధికారుల‌పై విచార‌ణ చేప‌డితే ఇంకొన్ని జ‌ల‌గ‌లు బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం ఉంది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!