బ్రూక్ ఫీల్డ్ బిగ్ డీల్ - రిలయన్స్ కు బంపర్ ఆఫర్ ..!
ఏ సమయంలో ఇండియాలో ధీరూబాయి అంబానీ రిలయన్స్ సంస్థను ప్రారంభించాడో కానీ ఇవాళ భారతదేశం అంటేనే రిలయన్స్ అనే స్థాయికి చేరుకుంది ఈ కంపెనీ. అత్యల్ప కాలంలో ఎవరూ ఊహించని రీతిలో ..ఎప్పటికప్పుడు తన మార్కెట్ స్ట్రాటజీని మార్చుకుంటూ ..ప్రత్యర్థుల కంపెనీలకు చుక్కలు చూపిస్తూ..గణనీయమైన ఆదాయాన్ని గడిస్తూ రికార్డులను తిరగ రాస్తోంది..రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. టెలికాం, ఆయిల్, లాజిస్టిక్, డిజిటల్ టెక్నాలజీ, జ్యూయలరీ, తదితర రంగాలలోకి ఎంటరైంది. టెలికాం రంగంలో జియో రిలయన్స్ కొట్టిన దెబ్బకు ఎయిర్‌టెల్ , ఐడియా, వొడాఫోన్ , బిసీఎన్ఎల్ , తదితర కంపెనీలకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇంటర్నెట్ కనెక్టివిటీ, డిజిటల్, డేటా బేస్డ్ ఆధారంగా అందిస్తున్న సేవలు జనాన్ని సమ్మోహితులను చేశాయి. దెబ్బకు ఇతర ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు కోలుకోలేని స్థితికి చేరుకున్నాయి.
దేశ వ్యాప్తంగా ఇప్పటికే ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్ కలిగిన రిలయన్స్ తన హవాను కొనసాగిస్తోంది. ఏకంగా ఆసియా ఖండంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా టెలికాం రంగంలో ఏకంగా 33 కోట్ల మందికి పైగా సబ్‌స్క్రైబర్స్‌గా చేరారు. ఇది ఓ రికార్డు. దీని దెబ్బకు ఇండియాలో అతి పెద్ద టెలికాం ఆపరేటర్‌గా రెండో స్థానంలో నిలిచింది జియో రిలయన్స్. దీంతో మరింత తన వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్లాన్ చేసింది. ఇందు కోసం భారీగా పెట్టుబడులు పెడుతోంది. త్వరలోనే 5జి సర్వీసెస్ అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. మరో వైపు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ కూడా రెడీ అంటోంది. ఇందు కోసం ముందే ప్లాన్ చేసుకుంటోంది. ఏకంగా ప్రతి చోటా టచ్ చేస్తే చాలు మెగా బైట్స్ స్పీడ్‌లో నెట్ వచ్చేలా ప్రయత్నిస్తోంది రిలయన్స్. ప్రత్యర్థి కంపెనీలకు దిమ్మ తిరిగేలా చేసింది..ఈ కంపెనీ..టెల్కోలకు సవాళ్లు విసిరేందుకు గాను బ్రూక్ ఫీల్డ్‌తో ఒప్పందం చేసుకుంది.
ఈ రెండు కంపెనీల మధ్య కుదిరిన డీల్ విలువ ఏకంగా 25 వేల కోట్లు. దీంతో జియో కంపెనీ చేతికి మరిన్ని నిధులు వెల్లువలా వచ్చి పడ్డాయి. ఇప్పటికే సబ్‌స్క్రైబర్స్‌ను గణనీయంగా కోల్పోయిన ఇతర టెలికాం కంపెనీలు ఇపుడు విస్తుపోవడం వంతైంది. టవర్ల వ్యాపారం నిర్వహించే రిలయన్స్ జియో ఇన్‌ఫ్రాటెల్ యూనిట్‌ను కెనడాకు చెందిన బ్రూక్ ఫీల్డ్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ దశల వారీగా స్వంతం చేసుకోనుంది. ఇందు కోసం ఈ కంపెనీ ..రిలయన్స్ కు చెందిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్‌లో 25.21 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఇందులో టెలికాం టవర్ కంపెనీకి 51 శాతం వాటాలు ఉన్నాయి. ఒప్పందం పూర్తయ్యాక టవర్ కంపెనీ పూర్తిగా బ్రూక్ ఫీల్డ్, దాని భాగస్వాముల చేతికి వెళుతుంది.
టవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ట్రస్టుకు లక్షా 70 వేల టవర్లు దేశ వ్యాప్తంగా ఉన్నాయి. టవర్ల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బులతో జియో అప్పులన్నీ తీర్చడంతో పాటు మిగులు నిధులు కూడా సమకూరుతాయి. ఇండియాకు చెందిన ఇన్ ఫ్రా సంస్థలో విదేశీ కంపెనీ ఇంత భారీ ఎత్తున పెట్టుబడి పెట్టడం ఇదే మొదటి సారని జియో రిలయన్స్ కంపెనీ వెల్లడించింది. బ్రూక్ ఫీల్డ్ కు టవర్లు అమ్మినట్లుగానే జియో డిజిటల్ ఫైబర్ ను కూడా అమ్మేసేందుకు ఆలోచిస్తోంది రిలయన్స్. టవర్, ఫైబర్ లను వేర్వేరుగా చేశారు. దీంతో పాటు గ్యాస్ పైప్ లైన్‌ను సైతం విక్రయించేందుకు యత్నిస్తోంది. మొత్తం మీద తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం ఎలా గడించాలో తెలుసు కోవాలంటే ..జియో రిలయన్స్ సక్సెస్ ఏమిటో తెలుసు కోవాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి