యురేనియం..ఉరే నయం..పాలమూరు భవితవ్యం..ప్రశ్నార్థకం..నల్లమలకు ప్రమాదం..!
నల్లమల ఉమ్మడి పాలమూరు జిల్లాకు కొండ గుర్తు. పచ్చని అడవితో పాటు పులులు, జంతువులకు ఆలవాలమైన ఈ సుందరమైన నేల త్వరలోనే ధ్వంసానికి గురి కానున్నది. ఇప్పటికే కలపను అక్రమంగా తరలిస్తుండగా మరో వైపు వజ్రాలకు నెలవైందని సర్వేలు తేటతెల్లడం చేయడంతో బడా బాబుల కన్ను దీనిపై పడింది. సెజ్‌ల పేరుతో, ప్రమాదకరమైన పరిశ్రమల ఏర్పాటుతో పచ్చని పాలమూరును పాలకులు వందేళ్ల వెనక్కి నెట్టి వేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ పాలమూరును చూపించే చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిలు ప్రపంచ బ్యాంకుకు దాసోహమన్నారు.
అందినంత మేర దండుకున్నారు. నిట్ట నిలువునా ముంచారు. ఈ జిల్లాను దత్తత తీసుకున్న చంద్రబాబు..సర్వనాశనం చేశారు. తెలంగాణను ఎన్‌కౌంటర్లకు, అభివృద్ధికి నోచుకోని ప్రాంతంగా వివక్ష ప్రదర్శించారు. గత పాలకుల దమనకాండకు, ఫేక్ ఎన్‌కౌంటర్లకు ముక్కు పచ్చలారని పిల్లలు, యువకులు, మహిళలు తమ రక్తాన్ని ధారపోశారు. పిట్టలను కాల్చినట్లు కాల్చేశారు. ఆనాడు సాగించిన మారణకాండ దెబ్బకు ప్రత్యేక రాష్ట్రం కావాలనే నినాదం బలంగా పుంజుకుంది. అది పెద్ద ఉద్యమమై ఎగసి పడ్డది. స్వరాష్ట్రం ఏర్పాటైంది. కానీ అంతకంటే ప్రమాదకరమైన పరిస్థితులు ఇవాళ నెలకొన్నాయి.
మాట్లాడాలన్నా..ప్రశ్నించాలన్నా నిర్బంధం కొనసాగుతున్నది. ఇది ఎంత దాకా వెళ్లిందటే ఆనాడు ఎన్‌కౌంటర్ స్పెషలిస్టులుగా పేరొందిన వారంతా ఇపుడు ఉన్నత స్థానాల్లో కొనసాగుతున్నారు. చిలుక పలుకులు పలుకుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాను సర్వనాశనం చేసిన పాలకులు రియల్ ఎస్టేట్ దందాలకు తెర తీశారు. ప్రతి ఒక్క కార్యకర్త రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నిమగ్నయ్యారంటే అర్థం చేసుకోవచ్చు. దందా ఎంతకు దిగజారిందో. అయితే ఎన్నికలు లేదంటే సంక్షేమ పథకాలు..ఇదీ నయా తెలంగాణ. తాజాగా మరో పాలమూరు గుండె మీద మరో పిడుగు పడింది. అదేమిటంటే..యురేనియం నిక్షేపాలు ఉన్నాయని నల్లమలలో. గతంలో డిబీర్స్ కంపెనీ ఈ ప్రాంతంపై కన్నేసింది. అపారమైన నిల్వలు ఉన్నాయి. ఇక్కడ పరిశోధన జరిపించిన ఆ కంపెనీ ఏకంగా ఒప్పందం చేసుకుంది. దీనిపై అప్పట్లో ప్రజా సంఘాలు, అడవి బిడ్డలు పెద్ద ఎత్తున అభ్యంతరం తెలపడంతో కంపెనీ వెనక్కి తగ్గింది.
ప్రకాశం, కర్నూలు, ఉమ్మడి పాలమూరు జిల్లాలు నల్లమలపై ఆధిపత్యం కలిగి ఉన్నాయి. ఎక్కువ శాతం అంటే 60 శాతానికి పైగా వాటా పాలమూరుకే ఉంది. తాజాగా నాగర్‌కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో మైనింగ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రాంతంలో యురేనియాన్ని వెలికి తీసేందుకు కేంద్ర అణుశక్తి సంస్థ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇది ప్రస్తుతం అనుమతి కోరే దశలో ఉంది. ఒకవేళ ఓకే చెబితే నల్లమల భవితవ్యం ప్రశ్నార్థకమవుతుంది. దీనిపై గులాబీ నేతలు నోరు మెదపడం లేదు. చాలా చోట్ల పెద్ద పులులు అంతరించే పోయే దశలో ఉన్నాయి. ఇక్కడ టైగర్ ప్రాజెక్టు ఉంది. యురేనియం తవ్వకాల వల్ల రోడ్లతో పాటు పచ్చని అడవికి ప్రమాదం పొంచి వుంది. జీవనాధారం మరింత ప్రమాదంలోకి నెట్టి వేయ బడుతుంది. ప్రజలకు ఎనలేని రోగాలు వస్తాయి.
యురేనియం తాలూకు దుమ్ము, ధూళి కారణంగా ఫారెస్ట్ ఏరియా వెలుపల ఉన్న వారిపై ప్రభావం చూపిస్తుంది. ఖనిజ అన్వేషణ ప్రతిపాదనకు తెలంగాణ వన్యప్రాణి మండలి, కేంద్ర సంస్థ కూడా మూడేళ్ల కిందట పచ్చ జెండా ఊపాయి. ఈ ప్రాజెక్టు చేపడితే దాదాపు 4 వేలకు పైగా బోర్లు వేయాల్సి ఉంటుంది. దీని దెబ్బకు జంతువులు మైదానాల వైపు వచ్చే ప్రమాదం ఉంది. ఏది ఏమైనా ఇప్పటికే బతికే హక్కు కోల్పోయిన ఆదివాసీలు, అడవి బిడ్డలకు ఇపుడు యురేనియం వల్ల ఉరే నయం అన్నది మేలన్న అభిప్రాయాన్ని బాధితులు వ్యక్తం చేశారు. ఇప్పటికైనా భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని నల్లమలను యురేనియం ప్రాజెక్టు నుంచి మినహాయించాలన్న డిమాండ్ పెరుగుతోంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి