బాబు, జగన్‌ల సంవాదం ..ఏపీ అసెంబ్లీలో గందర గోళం..!
ఏపీ విధానసభలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంటోంది. పదే పదే స్పీకర్ జోక్యం చేసుకోవాల్సి వస్తోంది. సభ్యులు ప్రవర్తిస్తున్న తీరు జనానికి ఏవగింపును కలిగించేలా చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో ఏపీలో నిర్మించిన ప్రజా వేదిక భవనాన్ని అక్రమంగా కట్టారంటూ..జగన్ హయాంలో కూల్చి వేశారు. దీనిపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఇదే అంశంపై విధానసభలో వాడి వేడిగా చర్చ జరిగింది. వ్యవస్థను బాగు చేయాలన్న సత్ సంకల్పంతో మేమున్నామని , దానిని అడ్డు కోవాలని అనుకోవడం మూర్ఖత్వమే తప్ప మరొకటి కాదంటూ జగన్ నిండు సభలో స్పష్టం చేశారు. దీంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు దీనికి అభ్యంతరం తెలిపారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్మిస్తే దానిని అక్రమమంటారా అంటూ నిలదీశారు. ఒకవేళ అది వద్దనుకుంటే, వేరే కార్యాలయానికి ఇవ్వొచ్చు కదా అంటూ ప్రశ్నించారు.
నిబంధనలకు విరుద్ధంగా, అడ్డగోలుగా తమ అస్మదీయులకు అప్పనంగా కోట్లాది రూపాయలు కట్టబెడుతూ దీనిని అక్రమంగా నిర్మించారని , అందుకే కూల్చి వేశామని తెలిపారు జగన్. భూమి కింద ఉన్న స్విమ్మింగ్ పూల్‌కి..భూమి పైన ఉన్న బిల్డింగ్‌కు ఒకటే చట్టం వర్తిస్తుందన్నారు. నదీ పరివాహక ప్రాంత నిర్మాణాలకు అనుకూలంగా సుప్రీం కోర్టు ధర్మాసనం ఏనాడో తీర్పు చెప్పిందని, అందుకే హైకోర్టు సైతం కూల్చేందుకు పర్మిషన్ ఇచ్చిందన్న వాస్తవాన్ని గుర్తించక పోతే ఎలా చంద్రబాబు ..అంటూ ప్రశ్నించారు. బాబుకు మెదడులో ఏమున్నదో నాకైతే అర్థం కావడం లేదు.కృష్ణా నది వరద ప్రవాహ స్థాయి 22.60 మీటర్లుంటే..చంద్రబాబు నివసిస్తున్న ఇల్లు 19.50 మీటర్ల ఎత్తులో ఉందని, రివర్ కన్జర్వేషన్ చట్టానికి విరుద్ధంగా నిర్మించిన ఇంట్లో ఆయన నివాసం ఉంటున్నారని గుర్తు చేశారు. వరద ప్రవాహానికి అడ్డంగా నిర్మాణాలు చేస్తే ముంబయి, చెన్నైలో జరిగిన నష్టాన్ని ప్రత్యక్షంగా కళ్లారా చూశామన్నారు.
దీనిని అడ్డుకుంటూ చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. వైఎస్ జగన్ తనపై వ్యక్తిగత కక్షతో ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. 74 వేల నిర్మాణాలను తొలగించేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఇది ఎంత మాత్రం మంచి పద్ధతి కాదన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ఉన్నా ..సర్కార్ భవనాన్ని కూల్చేయడంతో ప్రతి ఒక్కరు భయాందోళనకు లోనవుతున్నారని చెప్పారు. నన్ను తిట్టినా, అవమానించినా భరించేందుకు సిద్ధంగా ఉన్నా. నేను ఏనాడూ ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదన్నారు. సీఎంకు నేనున్న ఇల్లే కనిపించిందా..చట్టాల గురించి మాట్లాడే ముందు రాజశేఖర్ రెడ్డి విగ్రహాల గురించి ఆలోచించాలని సూచించారు. ప్రజా వేదిక తొలగింపుతో పాటు బాబు నివాసం తొలగింపుపై తాఖీదుల జారీపై విధానసభలో అధికార, ప్రతిపక్షాల మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు, జగన్‌ల మధ్య మాటల యుద్ధం జరిగింది. సుప్రీం తీర్పునకు లోబడే నిర్మాణం చేపట్టామన్నారు చంద్రబాబు. మొత్తం మీద వీరి ఆధిపత్య పోరులో ఏపీ రగిలి పోతోంది..!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి