ఉత్కంఠ రేపుతున్న టీమిండియా ఎంపిక - నిలిచేదెవ్వ‌రు..ఆడేదెవ్వ‌రు..?

ప్ర‌పంచ క‌ప్ టోర్న‌మెంట్‌లో భాగంగా నాకౌట్ ద‌శ‌లో న్యూజిలాండ్ జ‌ట్టుతో జ‌రిగిన సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌ను చేజేతులారా పోగొట్టుకుని..ఉన్న ప‌రువు పోగొట్టుకుని ఇండియాకు తిరిగి వచ్చిన భార‌త క్రికెట్ టీంలో ఎవ‌రు ఉంటార‌నే దానిపై దేశ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. బీసీసీఐ సెల‌క్ష‌న్ కమిటీ ఛైర్మ‌న్ అయిన ఎం.ఎస్.కె. ప్ర‌సాద్ అనుస‌రిస్తున్న తీరుపై కూడా ప‌లు ఆరోప‌ణ‌లు వచ్చాయి. దీంతో ఏకంగా జ‌ట్టు కెప్టెన్, ఆట‌గాళ్లు..ముఖ్యంగా కోచ్ ర‌విశాస్త్రిలపై వేటు ప‌డే ఛాన్స్ ఉందంటూ వార్త‌లు గుప్పుమ‌న్నాయి. త్వ‌ర‌లో వెస్టిండీస్ లో జ‌రిగే టూర్ కు టీమిండియా జ‌ట్టును ఎంపిక చేయాల్సి ఉండ‌గా అర్ధాంత‌రంగా వాయిదా ప‌డింది. ఆదివారం నాడు పూర్తి స్థాయి జ‌ట్టును ఎంపిక అవ‌కాశాలు ఉన్నాయి. టీం ఎంపిక ప్ర‌క్రియ‌లో ప‌లు మార్పులు చోటు చేసుకున్నాయి. ఇది అనూహ్యంగా జ‌రిగింది. ఎవ‌రూ ఊహించ‌లేదు.
జ‌ట్టు ఎంపిక అన్న‌ది బిసీసిఐ సెల‌క్ష‌న్ కమిటీ ఛైర్మ‌న్‌కు క‌త్తి మీద సాములాగా మారింది. తుది జ‌ట్టు రూప‌క‌ల్ప‌న‌లో ఎవ‌రు ఉంటార‌న్న‌ది ప్ర‌శ్నార్థకంగా మారింది. ప్ర‌పంచ క‌ప్‌లో ఆడే టీం ఎంపిక ప్ర‌క్రియ అంతా లోప‌భూయిష్టంగా ఉందంటూ ఫ్యాన్స్ విరుచుకుప‌డ్డారు. సీనియ‌ర్లు కూడా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. దీంతో సెల‌క్ష‌న్ అన్న‌ది మ‌రింత క్లిష్ట‌త‌రంగా మారింది. మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ భ‌విష్య‌త్ పైనే ఊహాగానాలు పెరిగాయి. ఆయ‌న క్రికెట్ నుంచి నిష్క్ర‌మిస్తాడా..లేక మ‌రో ఏడాది పాటు జ‌ట్టులో కొన‌సాగుతాడా అన్న‌ది తేలాల్సి ఉంది. వ‌చ్చే నెల‌లో విండీస్‌లో ప‌ర్య‌టించాల్సి ఉండ‌డంతో భార‌త జ‌ట్టును ఎంపిక చేసేందుకు జాతీయ సెల‌క్ష‌న్ క‌మిటీ స‌మావేశం ఏ కార‌ణం చూప‌కుండానే వాయిదా వేశారు. బీసీసీఐ కార్య‌ద‌ర్శి స్థానంలో ఇక ప్ర‌ధాన సెల‌క్ట‌రే సెల‌క్ష‌న్ క‌మిటీ స‌మావేశాల‌కు క‌న్వీన‌ర్‌గా ఉండాల‌న్న ప‌రిపాల‌కుల క‌మిటీ ఆదేశించ‌డంతో ఈ మార్పు చోటు చేసుకుంది.
ఈ మీటింగ్‌కు కెప్టెన్ కోహ్లి అందుబాటులో ఉంటాడా లేదా అన్న అంశం గురించి క్రికెట్ ఆప‌రేష‌న్స్ బృందం సిఓఏ ఛైర్మ‌న్‌కు వివ‌రించాల్సి ఉంటుంది. కెప్టెన్ కోహ్లి భార్య అనుష్క శ‌ర్మ‌తో క‌లిసి లండ‌న్ నుంచి ముంబ‌యికి చేరుకున్నాడు. సండే రోజు జ‌రిగే మీటింగ్‌కు అత‌ను హాజ‌రవుతారు. మొద‌టి వ‌న్డు, టీ20 సిరీస్‌కు దూరంగా ఉంటార‌ని స‌మాచారం. స‌మావేశం ఎప్పుడు జ‌రిగినా ధోనీ ఉంటాడా ..తీసి వేస్తారా అన్న‌ది తేలాల్సి ఉంది. ఒక‌ప్ప‌టి దూకుడు క‌నిపించ‌డం లేద‌ని, అత‌డిని ప‌క్క‌న పెట్ట‌డ‌మే మంచిద‌న్న అభిప్రాయం మ‌రికొంద‌రిలో నెల‌కొంది. కాగా భార‌త జ‌ట్టుకు ధోనీ సేవ‌లు అవ‌స‌రం ఉందంటూ సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు , అభిమానులు అభిప్రాయ‌ప‌డ్డారు. ఇదిలా ఉండ‌గా ధోనీని వ‌ద్ద‌ని అనుకుంటే ..ఆ విష‌యాన్ని అత‌డికి బీసీసీఐ స్ప‌ష్టంగా చెప్పాలంటూ మాజీ ఆట‌గాడు వీరేంద్ర సెహ్వాగ్ సూచించారు. మొత్తం మీద టీమిండియా జ‌ట్టు ఎంపికలో ఎవ‌రికి చోటు ద‌క్కుతుంద‌నేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

కామెంట్‌లు