ప్రైవేట్ యూనివ‌ర్శిటీల‌కు బార్లా..కార్పొరేట్ కంపెనీలకు ప‌చ్చ జెండా..జోరుగా విద్యా దందా ..!

బ‌లిదానాలు, త్యాగాలు , పోరాటాలు, ఉద్య‌మాలు చేసి కోరి తెచ్చుకున్న తెలంగాణలో కార్పొరేట్ కంపెనీలు గ‌ద్ద‌ల్లా వాలిపోతున్నాయి. ఇప్ప‌టికే రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారుల‌కు అడ్డాగా..నేరాలు, ఘోరాల‌కు కేరాఫ్‌గా ఈ రాష్ట్ర రాజ‌ధాని వినుతికెక్కింది. కేజీ టు పీజీ జ‌పం చేస్తున్న స‌ర్కార్ ...ప్ర‌భుత్వ బ‌డుల‌ను మూసి వేసేందుకు ప్లాన్ చేస్తోంది. క‌నీస వ‌స‌తులు లేక విద్యార్థులు రోడ్డెక్కుతుంటే..ఇంట‌ర్ ఫ‌లితాలు విద్యార్థుల‌ను బ‌లి తీసుకుంటే ..చోద్యం చూస్తోందే త‌ప్పా..చ‌ర్య‌లు చేప‌ట్టిన దాఖ‌లాలు లేవు. యూనివ‌ర్శీటీల‌లో మౌళిక వ‌స‌తులు క‌ల్పించ‌లేదు. ఇప్ప‌టి దాకా పూర్తి కాలం వీసీలు లేరు. ఖాళీలు వేల‌ల్లో ఉన్నాయి. భ‌ర్తీ మాత్రం లేనే లేదు. ఏడేళ్ల కాలంలో నిన్న గాక మొన్న నోటిఫికేష‌న్ వేశారు. దానికి ఎన్నో నిబంధ‌న‌లు. చాలా మంది ఉద్య‌మాల్లో పాల్గొని ..ఉద్యోగాలు వ‌స్తాయ‌ని ఆశ‌గా ఎదురు చూసిన పాపానికి కొలువులు రాక పోగా..వ‌య‌సు మాత్రం చావుకు ద‌గ్గ‌ర‌వుతోంది.

ఈ రాష్ట్రం ఎందుకు తెచ్చుకున్నామా అన్న ఆందోళ‌న మొద‌లైంది నిరుద్యోగుల్లో. ఇదేమి అన్యాయ‌మంటూ ప్ర‌శ్నించే వారిని స‌ర్కార్ టార్గెట్ చేస్తోంది. అయినా పిల్ల‌లు విన‌డం లేదు. ప్ర‌పంచంలోనే ఘ‌న‌మైన చ‌రిత్ర క‌లిగిన ఉస్మానియా యూనివ‌ర్శిటీ క‌నీస వ‌స‌తుల‌కు నోచుకోలేక కునారిల్లుతోంది. పుండు మీద కారం చ‌ల్లిన‌ట్టు ..మ‌రో ప్ర‌మాద‌క‌ర‌మైన చ‌ట్టానికి ఆమోదం తెలిపింది టిఆర్ఎస్ ప్ర‌భుత్వం. ప్రైవేట్ యూనివ‌ర్శిటీలు ఏర్పాటు చేసేందుకు ఏకంగా ఉత్త‌ర్వుల‌ను జారీ చేసేసింది. వీటిలో త‌మ ఇష్టానుసారం ఫీజులు నిర్ణ‌యించుకునే వెస‌లుబాటుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. వీటిలో తమ ఇష్టానుసారం ఫీజులు నిర్ణ‌యించు కోవ‌చ్చు. ఇందులో రిజ‌ర్వేష‌న్లు ఉండ‌వు. పేదోళ్ల బిడ్డ‌ల‌కు చోటు ద‌క్క‌దు. బ‌డా బాబుల‌కు, కాంట్రాక్ట‌ర్ల పిల్ల‌ల‌కు, కంపెనీల‌కు చెందిన వారికే అందులో అడ్మిష‌న్లు. కొంత శాతం మాత్ర‌మే సీట్లు భ‌ర్తీ చేస్తారు. వ‌చ్చే ఏడాది నుంచే ప‌ర్మిష‌న్స్ ఇవ్వాల‌ని యోచిస్తోంది.

ముందు నోటిఫికేష‌న్ ను జారీ చేస్తుంది ప్ర‌భుత్వం. ఆ త‌ర్వాత ద‌రఖాస్తుల‌ను స్వీక‌రిస్తుంది. ఇప్ప‌టికే విద్యా రంగం పూర్తిగా డ‌బ్బున్న‌వాళ్ల చేతుల్లోకి వెళ్లింది. యూనివ‌ర్శిటీల ఏర్పాటు కోసం ప‌లు కంపెనీలు, విద్యా సంస్థ‌లు బార్లా నిల‌బ‌డ్డాయి. దీంతో ప్రైవేట్ యూనివ‌ర్శిటీల వ‌ల్ల ప్ర‌మాదం ఉంద‌ని, విద్యా రంగంపై తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌ని విప‌క్షాలు, మేధావులు, ప్ర‌జా సంఘాలు నిర‌స‌న వ్య‌క్తం చేశాయి..అభ్యంత‌రం తెలిపాయి. వాటిని ఏ మాత్రం ఖాత‌రు చేయ‌కుండా ముందుకెళుతోంది. గ‌త ఏడాదిలో ఆమోదించిన ప్రైవేట్ యూనివర్శిటీల చ‌ట్టాన్ని అమ‌లులోకి తీసుకు రావాల‌ని స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు జిఓ నెంబ‌ర్ 17ను విద్యా శాఖ కార్య‌ద‌ర్శి జ‌నార్ద‌న్ రెడ్డి జారీ చేశారు. చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పారు. స‌ద‌రు ఉత్త‌ర్వుల‌తో ప్రైవేట్ యూనివ‌ర్శిటీల చ‌ట్టం అమ‌లులోకి వ‌చ్చిన‌ట్ల‌యింది. దీనికి సంబంధించిన నియ‌మ నిబంధ‌న‌లు, మార్గ‌ద‌ర్శ‌కాల‌ను త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నుంది.

ఇందుకు సంబంధించిన స్థలం, మూల నిధిపై స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం కూడా తీసుకున్న‌ట్లు స‌మాచారం . ఈ ఏడాది ఇప్పటికే ఇంజనీరింగ్‌తో పాటు పలు పీజీ కోర్సుల అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. చాలా మంది విద్యార్థులు ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని ప్రైవేటు యూనివర్సిటీల్లో అడ్మిషన్లు తీసుకున్నారు. దీనికితోడు.. ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేయాలి. దరఖాస్తులు స్వీకరించాలి. వాటిని పరిశీలించి అనుమతులు జారీ చేయాలి. ఇందుకు కనీసం నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ముందస్తుగా చర్యలు తీసుకోవడం వల్ల వచ్చే ఏడాదికి మార్గం సుగమం అయ్యేలా ఉంది. ఇదిలా ఉండ‌గా యూనివ‌ర్శిటీల ఏర్పాటు కోసం కార్పొరేట్ కంపెనీలు, వ్య‌క్తులు, సంస్థ‌లు క్యూ క‌ట్ట‌డం విశేషం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!