పిచాయ్ ప్రయారిటీ ఇండియానే - వరల్డ్ మార్కెట్‌లో మనమే బెటర్
ప్రపంచాన్ని విస్మయ పరిచి..దిగ్గజ కంపెనీలకు ఝలక్‌లు ఇస్తూ తనకంటూ విస్మరించలేని స్థానాన్ని ఏర్పాటు చేసుకుని ఐటీ రంగాన్ని ఒంటి చేత్తో శాసిస్తున్న కంపెనీగా పేరొందిన గూగుల్ దిగ్గజ కంపెనీ టాప్ ప్రయారిటీ ఏదన్నా ఉందంటే అది ఇండియా ఒక్కటేనట. మార్కెట్ రిసెర్చ్ కంపెనీలు చెబితే పొరపాటు పడినట్టే. సాక్షాత్తూ ఆ సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న వరల్డ్ హెడ్ సుందర్ పిచాయ్ మాటల్లోని వాస్తవం. ఇతర దేశాలకంటే భారత్‌లోనే మార్కెట్‌కు స్కోప్ ఎక్కువగా వుందన్నారు. తాజాగా అమెరికా- ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలు అంశాలపై సుందర్ పిచాయ్ మాట్లాడారు. ఏరకంగా మార్కెట్ విస్తరించనుందో స్పష్టం చేశారు. ఇండియన్ మార్కెట్ పరిస్థితులన్నీ కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేసేందుకు సహకరిస్తాయని వెల్లడించారు. ఇక్కడ వేటిని అభివృద్ది చేస్తామో ..వాటినన్నింటిని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లవచ్చని తెలిపారు. అమెరికా- ఇండియా దేశాలు కలిసి వ్యక్తిగత గోప్యతకు సరైన ప్రమాణాలు తీసుకు రాగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. చాలా రోజుల పాటు గూగుల్ కంపెనీ భారత్‌లో ఉండడంతో ఒక విషయం గమనించగలిగానని తెలిపారు. ఉత్పత్తిదారులు చాలా పరికరాలను దేశీయంగానే తయారు చేయడంలో నిమగ్నమై ఉన్నారు.
భారత ప్రభుత్వం కూడా దేశీయంగా సాంకేతిక అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టడం శుభ సూచకమన్నారు. మంచి పాలన, ఆర్థిక, సామాజిక అంశాలను మెరుగు పర్చడం వంటివి చేస్తున్నారని ప్రశంసించారు. తమ వరకు వస్తే..గూగుల్ కంపెనీ అందరిది. ఇవాళ కోట్లాది ప్రజలను ఒకే వేదికపైకి తీసుకు వస్తోంది. ప్రతి ఒక్కరు కొనుగోలు చేసి వాడుకునేలా అతి చౌకగా మొబైల్ ఫోన్లను తయారు చేసేలా జాగ్రత్తగా తీసుకుంటున్నాము. 2004లో రెండు సంస్థలు మాత్రమే ఇండియాలో ఫోన్లకు సంబంధించిన పరికరాలు తయారు చేశాయి. ఇపుడు ఆ సంఖ్య అంతకు రెట్టింపు అయ్యింది.
దాదాపు 200 కంపెనీలకు పైగా వీటిని తయారు చేసే పనిలో పడ్డాయి. అంటే టెక్నాలజీ ఒక రకంగా ఉపయోగపడడమే కాదు వాటికి ఆధారంగా పనిచేస్తోందన్న నిజం తేటతెల్లమైంది. భారత్ అనూహ్యంగా డిజిటల్ చెల్లింపుల వైపు మొగ్గినప్పుడు..తాము కూడా ఇక్కడి మార్కెట్‌లోకి రావాలని అనుకున్నాం. అందుకోసం పూర్తిగా మా తరపున కృషి చేశాం. ఇపుడు మేం తయారు చేసిన డిజిటల్ చెల్లింపుల ప్రొడక్ట్‌ను అంతర్జాతీయ మార్కెట్‌లోకి తీసుకెళుతున్నాం. ఇదంతా గూగుల్ సాధించిన విజయంగా అభివర్ణించారు సుందర్ పిచాయ్.
భారత దేశాన్ని ఒక అవకాశంగా మేం చూడబోవడం లేదు. ఇండియాను నిర్మిస్తే ప్రపంచానికి మరింత సేవ చేయవచ్చు..ఇది చాలా ఉత్కంఠ భరిత సమయం అని పేర్కొన్నారు..ఈ యువ సిఇఓ. సదస్సు అనంతరం సుందర్‌తో పాటు నాస్ డాక్ అధ్యక్షుడు అదెనా ఫ్రైడ్ మాన్‌కు గ్లోబల్ లీడర్ షిప్ అవార్డులు అందజేశారు నిర్వాహకులు. మొత్తం మీద డిజిటల్ చెల్లింపులు, టెక్నాలజీకి రాను రాను మరింత డిమాండ్ ఉండబోతోందన్న వాస్తవాన్ని సుందర్ స్పష్టం చేశారు. భారతీయ యువతీ యువకులు కలలు కనడం మానేసి..డిజిటల్ రంగాన్ని ఎంచుకుంటే మంచి భవిష్యత్ ఉంటుందన్నది వాస్తవం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి