స్టార్ టీవీకి జాక్ పాట్ - ఇండియా పాక్ మ్యాచ్‌కు 100 కోట్ల ఆదాయం
ప్రపంచాన్ని ఊపేస్తూ..ఆశ్చర్య పోయేలా చేస్తూ..కోట్లాది ప్రజల గుండెల్ని లయబద్ధంగా మార్చేసే సన్నివేశం ఏదైనా వుందంటే అది క్రికెట్ ఒక్కటే. అమెరికా లాంటి పెద్దన్న లాంటి దేశమే ఈ ఆటకున్న క్రేజ్ చూసి నివ్వెర పోతోంది. ఎందుకింత క్రేజ్ వుందో తెలుసుకోమని ఏకంగా తన క్రీడా నిపుణులను ఆదేశించిందంటే దానికున్న డిమాండ్ ఏమిటో అర్థమవుతుంది. అన్ని దేశాలు ఆడడం మామూలే. కానీ దాయాదులైన పాకిస్తాన్ , ఇండియా క్రికెట్ జట్ల మధ్య జరిగే ఏ మ్యాచ్ అయినా అది తీవ్ర ఉత్కంఠకు గురి చేస్తుంది. కోట్లాది భారతీయులే కాదు లక్షలాది పాకిస్తానీయులు కూడా కళ్లప్పగించి చూస్తారు. నిద్రహారాలు మాని ఏం జరగబోతుందో అంచనాలు, చర్చోప చర్చలు జరుగుతుంటాయి.
మ్యాచ్ జరిగే వారం రోజుల కిందటి నుంచే వరల్డ్ వైడ్‌గా భారీ ఎత్తున బెట్టింగ్‌లు జోరందుకుంటాయి. కోట్లాది రూపాయలకు పైగా బెట్టింగ్ ఉంటుందని క్రికెట్ వర్గాలే అంగీకరిస్తున్నాయి. ఆక్టోపస్ లాగా ఈ క్రికెట్ ఆట పేరుకు పోయింది. చాప కింద నీరులా ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ కప్ టోర్నమెంట్ జరుగుతోంది. ఇంగ్లండ్‌లో జరుగుతున్న మ్యాచ్‌లలో ఎక్కువగా వర్షం కారణంగా రద్దవుతున్నాయి. మిగతా మ్యాచ్‌ల కంటే తాజాగా జరగబోయే ఇండియా, పాక్‌ల మధ్య జరిగే మ్యాచ్‌కు ఎక్కడలేనంతటి డిమాండ్ ఉంటోంది. వరల్డ్ కప్ టోర్నీ మ్యాచ్‌లన్నింటిని 1647 కోట్లకు పెట్టి ప్రసార హక్కులను స్టార్ గ్రూప్ చేజిక్కించుకుంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా అరుదైన రికార్డుగా నమోదైంది. ఇంత భారీ ఎత్తున టెలికాస్ట్ హక్కులను పొందడం ఆషామాషీ వ్యవహారం కాదు.
అందుకే స్టార్ గ్రూప్ తన హవాను కొనసాగిస్తోంది. మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లో తనకంటూ ఎదురు లేకుండా చేసుకుంటోంది. ప్రస్తుతం డిజిటల్ రంగంలోకి విస్తరించింది. సోషల్ మీడియాను తెగ వాడుకుంటోంది. ఇబ్బడి ముబ్బడిగా ఆదాయాన్ని పొందుతోంది. కోట్లాది రూపాయలు కొల్లగొడుతోంది. కేవలం ప్రకటనల ద్వారానే లక్షల కోట్లు వెనకేసుకుంటోంది స్టార్ గ్రూప్. దీని వెనుక సిఇఓ ఉదయ్ శంకర్ ఉన్నాడుగా. మొండోడు..మహా గట్టోడు. ఇంకేం స్టార్‌కు ఎనలేని బ్రాండ్ వాల్యూ తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించాడు. ఇపుడది రారాజుగా విరాజిల్లుతోంది. ప్రాంతీయ భాషల్లో కూడా స్టార్ విస్తరించింది. ఎక్కడా ఏ ఒక్క ఛాన్స్ ను పోగొట్టుకోవడానికి వీలు లేదంటూ సంస్థ గట్టి పట్టుదలతో వుంది. 10 సెకండ్ల ప్రకటనకు 25 లక్షలు వసూలు చేస్తోంది స్టార్.
మిగతా గేమ్స్ విషయంలో అయితే కొంత వెసలుబాటు కల్పించింది. 16 నుంచి `18 లక్షలు ఛార్జ్ చేస్తోంది. అయితే దాయాదుల పోరులో జరిగే మ్యాచ్ టెలికాస్ట్ చేస్తే ఆ ఒక్క రోజులోనే 100 కోట్ల ఆదాయం కేవలం ప్రకటనల రూపేణా రావచ్చని అంచనా వేస్తోంది. ఈనెల 16న ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఇప్పటికే 50 శాతానికి పైగా బుకింగ్స్ అయిపోయాయని స్టార్ గ్రూప్ వెల్లడించింది. ప్రస్తుతానికి 100 కోట్లు వస్తాయని అంచనా వేసినా..అంతకంటే ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఇండియా ఆడే మ్యాచ్‌లన్నింటికి వ్యూవర్ షిప్ ఎక్కువగా వుంటోందని సంస్థ తెలిపింది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఇండియా పాకిస్తాన్ జట్టుతో తలపడింది.
ఇక అప్పటి నుంచి నేటి దాకా మ్యాచ్ ఆడలేదు. ఇపుడు అసలైన పోరు రెండు రోజుల్లో తేలిపోతుంది. ఇరు జట్లు మరింత పోరాటాన్ని ప్రదర్శించేందుకు రెడీ అవుతున్నాయి. పాక్ , ఇండియా జట్ల మధ్య జరిగే మ్యాచ్ సందర్భంగా కంపెనీలు తమ యాడ్‌లు ప్రదర్శించేందుకు ఎంత మొత్తమైనా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారని సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఇది కూడా స్టార్‌కు కలిసి వచ్చే అంశమే. ఇప్పటికే ఇంటర్నేషనల్ బిగ్ బ్రాండ్స్ తో ఒప్పందం చేసుకుంది. ఫోన్ పే, ఒన్ ప్లస్, హావెల్స్, అమెజాన్, డ్రీం11, ఎంఆర్ఎఫ్ టైర్స్, కోకో కోలా, ఉబెర్, మోండెలెజ్ , తదితర కంపెనీలున్నాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి