వరల్డ్ మార్కెట్‌లో భారీగా పెరిగిన ఎంఎస్ వాల్యూ
టెక్నాలజీ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా చూస్తే మైక్రోసాఫ్ట్ కంపెనీ బ్రాండ్ విలువ అమాంతం పెరిగింది. తన చరిత్రను తానే తిరిగి రాసుకుంది. ఈ ఘనతను తెలుగువాడి సారథ్యంలో ఈ సంస్థకు దక్కడం మనవారందరికీ గర్వకారణమనే చెప్పాలి. గత ముప్పై ఏళ్లుగా రారాజుగా మైక్రోసాఫ్ట్ వెలుగొందుతోంది. మార్కెట్ కాపిటలైజేషన్ జూన్ 7 వరకు చూస్తే ట్రిలియన్ డాలర్ల మైలు రాయిని అందుకుంది. అంటే దీని విలువ రూపాయల్లో చూస్తే 70 లక్షల కోట్లుగా వుంది. అమెరికాలో అత్యంత విలువైన కంపెనీగా ఎంఎస్ అవతరించడంలో ఆ కంపెనీకి సిఇఓగా వున్న సత్య కీలక పాత్ర పోషించారు. అదే అమెరికాకు చెందిన మరో కంపెనీ అమెజాన్ రెండో ప్లేస్‌లో ఉండగా, మూడో స్థానంలో యాపిల్ కంపెనీ ఉంది.
ఈ రెండు కంపెనీల మార్కెట్ కాపిటలైజేషన్ దాదాపు 880 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అంటే దాదాపు 62 లక్షల కోట్లు రూపాయలుగా వుంది. జూన్ 7కు నాలుగు రోజుల ముందు నుంచి మైక్రోసాఫ్ట్ షేర్ ధర 10 శాతానికి పైగా పెరిగింది. ఇది మదుపరులకు శుభ సూచకం. మైక్రోసాఫ్ట్ కంపెనీ తన స్ట్రాటజీని మార్చుకుంది. క్లౌడ్ సర్వీసెస్‌కు మంచి భవిష్యత్ ఉంటుందని భావించింది. దానిపైనే ఎక్కువగా దృష్టి పెట్టింది. ఇన్వెస్టర్లు కూడా ఈ సర్వీసెస్‌పై అత్యధికంగా నమ్మకం కలిగి ఉండడం కూడా ..మార్కెట్ కేపిటలైజేషన్ భారీగా పెరగడానికి కారణమైందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అత్యంత క్లిష్ట సమయంలో కంపెనీ బాధ్యతలు చేపట్టారు తెలుగు ప్రాంతానికి చెందిన సత్య నాదెళ్ల. తనదైన రీతిలో మైక్రోసాఫ్ట్ కంపెనీలో చేరినప్పటి నుంచి కొత్త పుంతలు తొక్కించారు. తనదైన ముద్రను కనబరిచారు. కూల్‌గా వుంటూనే కంపెనీకి బ్రాండ్ విలువ పెంచడంలో కొత్త వ్యూహాలు అమలు పరిచారు. కార్యాచరణలో ప్రతి ఒక్కరిని కార్యోన్ముఖులుగా మలిచారు. ఇది సత్యకు ఉన్న గొప్ప అసెట్. మార్కెట్ ట్రెండ్ గురించి, కాపిటలైజేషన్ గురించి మాట్లాడేందుకు ఈ కంపెనీ సిఇఓ ఇష్టపడరు. సెలబ్రేట్ చేసుకోరు. కేవలం దీని ఒక్కదాని కోసం సెలబ్రేషన్స్ చేసుకోవడం బావుండదని ఆయన సున్నితంగా తిరస్కరించారు.
సత్య 2014 ఫిబ్రవరి నెలలో ముఖ్య కార్యనిర్వహణాధికారిగా మైక్రోసాఫ్ట్ కంపెనీ బాధ్యతలు చేపట్టారు. అప్పటికే మైక్రోసాఫ్ట్ మొబైల్ ఫోన్ బూమ్ ఒక్కసారిగా పడిపోయింది. గూగుల్ సెర్చ్ ఇంజిన్‌కు పోటీగా మరో సెర్చ్ ఇంజన్‌ను డెవలప్ చేయక పోవడం, సోషల్ నెట్ వర్కింగ్‌ను పక్కన పెట్టడం వంటి కారణాల రీత్యా వెనక్కి నెట్టి వేయబడింది. దీంతో కంపెనీని గాడిలో పెట్టే పనిలో నిమగ్నమయ్యారు నాదెళ్ల. ఆయన ప్రయత్నం ఫలించింది. ఇవ్వాల నమ్మకమైన బ్రాండ్‌గా ఎదిగింది. విండోస్ ఆపరేటింగ్ సిస్టం, ఆఫీస్ సాఫ్ట్ వేర్, క్లౌడ్ కంప్యూటింగ్‌ల మీద కాన్ సెంట్రేషన్ చేశారు. అది బాగా వర్కవుట్ అయింది. కంపెనీకి భారీ లాభాలను తెచ్చి పెట్టేలా చేసింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్‌కు సరైన ప్రత్యామ్నాయంగా మైక్రోసాఫ్ట్ అజూర్‌ను తెచ్చారు. తన ప్రత్యేకతను చాటుకున్నారు సత్య.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి