అధికారుల నిర్వాకం - పిల్ల‌ల ప్రాణసంక‌టం

పిల్ల‌లు పిట్ట‌ల్లా రాలిపోతున్నా తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు తీరు మార‌డం లేదు. ఉన్న‌తాధికారుల బాధ్య‌తా రాహిత్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఒక‌రి వెంట మ‌రొక‌రు వీరి దెబ్బ‌కు ప్రాణాలు కోల్పోతున్నా క‌నీసం స్పందించ‌డం లేదు. అడుగ‌డుగునా బాధ్య‌తా రాహిత్యం, నిర్ల‌క్ష్యం ప్ర‌స్ఫుటంగా క‌నిపించినా ప్ర‌భుత్వం , సంబ‌ధిత విద్యాశాఖ మంత్రి ఈ రోజు వ‌ర‌కు స్ప‌ష్ట‌మైన హామీ ఇవ్వ‌లేక పోయారు. ఇంత మంది చ‌నిపోతే ..ఏ ఒక్క కుటుంబానికి ఎక్స్ గ్రేషియా కూడా ప్ర‌క‌టించ‌లేదు. తెలంగాణ ఏర్ప‌డి ఆరేళ్లయినా గోస ఆగ‌డం లేదు. పేప‌ర్లు దిద్ద‌డం మొద‌లుకుని ..రిజ‌ల్ట్స్ ప్ర‌క‌టించేంత దాకా తీరు మార‌లేదు. ఒక్క అడుగు ముందుకు వెళ్ల‌లేదు. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ మొద‌లుకొని ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యేంత దాకా గ్లోబ‌రినా సంస్థ‌కు అప్ప‌గించిన బోర్డు, స‌ర్కార్ చేతులెత్తేసింది.

ఈ విష‌యంపై హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసినా ఫ‌లితం లేకుండా పోయింది. విద్యా శాఖ మంత్రి కాకుండా కేటీఆర్ సంఘ‌ట‌న జ‌రిగిన తీరుపై స్పందించ‌డంపై విప‌క్షాలు మండిప‌డ్డాయి. విద్యార్థి సంఘాలు, పిల్ల‌ల త‌ల్లిదండ్రులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాజాగా ప్ర‌క‌టించిన రీ వెరిఫికేష‌న్ ఫ‌లితాల్లో సైతం ఈ విష‌యం స్ప‌ష్ట‌మైంది. 1, 137 మంది పాసైన‌ట్లు ఇంట‌ర్ బోర్డు ప్ర‌క‌టించినా..మ‌రో 90 వేల మంది విద్యార్థుల మార్కుల్లో మార్పులు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. పాసైన స్టూడెంట్స్ రీ వెరిఫికేష‌న్‌లోనూ 16 వేల మంది మార్కులు ఛేంజ్ అయిన‌ట్లు స‌మాచారం. రీ వెరిఫికేష‌న్ కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న మొత్తం 4.2 ల‌క్ష‌ల మంది విద్యార్థుల్లో సుమారు 1.07 ల‌క్ష‌ల మంది మార్కుల్లో మార్పులు జ‌రిగాయి. ల‌క్ష‌కు పైగా విద్యార్థుల విష‌యంలో త‌ప్పులు జ‌రిగిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

రీ వెరిఫికేష‌న్ అంటే సున్న మార్కుల‌కు, దిద్ద‌ని జ‌వాబుల‌కు మాత్ర‌మే మార్కులు వేస్తారు. ఇక్క‌డ ల‌క్ష మందికి ఎక్కువ మార్కులు రావ‌డం గ‌మ‌నార్హం. ఇంట‌ర్ ప‌రీక్ష‌ల ఫ‌లితాల్లో ఇంత‌టి గంద‌ర‌గోళ ప‌రిస్థితులు త‌లెత్త‌డానికి ..ఆద‌రా బాద‌రాగా ప్ర‌క‌టించ‌డం వెనుక అధికారుల నిర్ల‌క్ష్యం ఉంది. గ్లోబ‌రీనా సంస్థ‌తో అడ్మిష‌న్ల ప్రక్రియ‌, ఫీజుల చెల్లింపు, హాల్ టికెట్ల జారీ ..ఇలా ప్ర‌తి దానిలోను త‌ప్పులు దొర్లినా అధికారులు చూసీ చూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రించ‌డంపై పేరెంట్స్ మండిప‌డ్డారు. దీనికి తోడు రోజుకో లెక్చ‌ర‌ర్‌తో 50 నుంచి 60 పేప‌ర్లు దిద్దించ‌డం మ‌రో కార‌ణం. ఆన్స‌ర్ షీట్స్ వాల్యూయేష‌న్ ప్రక్రియ‌లో 5 వేల 841 మంది లెక్చ‌ర‌ర్లు, అధికారులు పాల్గొన్నారు. వీరిలో వీరిలో 2 వేల 400 మంది లెక్చ‌ర‌ర్ల‌ను పేప‌ర్లు దిద్దేందుకు నియ‌మించిన‌ట్లు చెబుతున్నారు.

పేప‌ర్లు ఎలా , ఏ ప‌ద్ధ‌తిన దిద్దాల‌నే దానిపై ముందుగా శిక్ష‌ణ ఇస్తారు. ఈసారి అలాంటిది ఏమీ లేకుండానే జ‌రగ‌డం విద్యార్థుల‌కు న‌ష్టం వాటిల్లేలా చేసింది. సీనియ‌ర్ లెక్చ‌ర‌ర్లు ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌ల్లో ఉండ‌గా జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్లు పేప‌ర్లు దిద్దే ప్ర‌క్రియ‌లో నిమ‌గ్న‌మై ఉండ‌డం మ‌రో కార‌ణం. కొత్త‌గా వ‌చ్చిన వారికి పేప‌ర్లు ఎలా దిద్దాల‌నే దానిపై క్లారిటీ లేక పోవ‌డం అవ‌రోధంగా మారింది. ఇంత జ‌రిగినా ప్ర‌భుత్వం కానీ, ఇంట‌ర్ బోర్డు కానీ స్పందించ‌క పోవ‌డంపై ..త‌ప్పెక్క‌డ జ‌రిగింద‌నే దానిపై ఓ శ్వేత ప‌త్రాన్ని విడుద‌ల చేయ‌క పోవ‌డం విద్యార్థుల‌తో పాటు పేరెంట్స్ కు ప‌లు అనుమానాలు క‌లుగ చేస్తోంది. ఎక్కడ పొర‌పాటు జ‌రిగిందో బేరీజు వేసుకుని చ‌ర్య‌లు తీసుకుంటే కొంచెమైనా మేలు జ‌రిగేది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!