రికార్డులకెక్కిన నిజామాబాద్ రైతన్నలు
తాజాగా దేశ వ్యాప్తంగా జరిగిన 17వ సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా రైతులు ప్రపంచ రికార్డును సృష్టించారు. ఇది ఒకరకంగా భారతీయ ఎన్నికల చరిత్రలో మరిచి పోలేని సన్నివేశంగా అభివర్ణించవచ్చు. దేశమంతటా ఐపీఎల్ ఫీవర్ ఉన్నా..మరో వైపు నరేంద్ర దామోదర దాస్ ఛరిష్మా పనిచేస్తున్నా ..విపక్షాలు గగ్గోలు పెట్టినా..రాష్ట్ర స్థాయిలోని ప్రచురణ, ప్రసార, సామాజిక మాధ్యమాలు పట్టించుకోక పోయినా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రాంతానికి చెందిన రైతుల గురించి అనేకరకమైన ఆసక్తికరమైన కథనాలు వెల్లువలా వచ్చి పడ్డాయి. రైతులు తీసుకున్న ఈ అసాధారణమైన నిర్ణయానికి జాతి యావత్తు జేజేలు పలికింది.
తాము కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకం కాదని, తమ న్యాయపరమైన డిమాండ్లను సాధించుకునేందుకు, తాము ఎదుర్కొంటున్న సమస్యలను పాలకుల దృష్టికి తీసుకు వెళ్లేందుకు మాత్రమే ఎన్నికల బరిలో నిలవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. అన్నం పండించే తాము అర్ధాకలితో అలమటిస్తున్నామని, పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదని, ఆసియా ఖండంలోనే అత్యధికంగా పసుపు పండించే ప్రాంతంగా నిజామాబాద్ జిల్లా ప్రథమ స్థానంలో ఉన్నా ఈ రోజు వరకు పసుపు బోర్డును ఏర్పాటు చేయడం లేదని, జొన్నలు, చెరుకు పంటలకు ధర రావడం లేదని, పెట్టుబడి రోజు రోజుకు పెరుగుతూ పోతోందని , ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఎంపీగా ఉన్నా తమకు న్యాయం చేయలేక పోయారంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు, సమ్మెలు, ధర్నాలు చేపట్టారు.
ఏకంగా జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించేందుకు యత్నించారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. శాంతియుతంగా తాము ఆందోళన చేపడితే అరెస్ట్ చేయడం ఎంత వరకు సబబు అని అన్నదాతలు వాపోయారు. వారికి ప్రతిపక్షాలు, మేధావులు, అన్ని వర్గాలకు చెందిన ప్రజలు, కళాకారులు, స్వచ్ఛంధ సంస్థలు బేషరతుగా మద్ధతు పలికారు. లోక్‌సభ ఎన్నికల బరిలో తామందరం నిలబడాలని సామూహిక నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 185 మంది రైతులు భిక్షమెత్తుకుని , మరికొందరితో అప్పులు చేసి పోటీ చేశారు. దేశంలోనే అత్యధికంగా అభ్యర్థులు నిలిచిన నియోజకవర్గంగా నిజామాబాద్ జిల్లా చరిత్ర సృష్టించింది. అంతకు ముందు తమను ఆదుకోవాలని, కనీస మద్ధతు ధర కల్పించాలని కోరుతూ మహారాష్ట్ర నుండి రైతులు ఢిల్లీకి భారీ ఎత్తున ప్రదర్శన చేపట్టారు.
తమిళనాడుకు చెందిన రైతులు ఢిల్లీలో అర్దనగ్న ప్రదర్శన చేపట్టారు. వారిని రాకుండా అడ్డుకునేందుకు నానా తంటాలు పడింది కమలం సర్కార్. అయినా తమ పట్టు వీడలేదు. ఇక నిజామాబాద్ జిల్లా రైతులకు పాలమూరు జిల్లా పోలేపల్లి వాసుల పోటీ స్ఫూర్తిగా నిలిచింది. తమ భూములు తమకు కావాలని, భారీ నష్ట పరిహారం చెల్లించాలని కోరుతూ మహబూబ్‌నగర్ ఎంపీ స్థానం నుండి పోటీ చేశారు. 80 వేలకు పైగా ఓట్లు పొందారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి పోటీ చేసిన 185 మంది రైతులకు 96 వేలకు పైగా ఓట్లు సాధించారు. ఇది కూడా రికార్డు. బిజిపికి చెందిన ధర్మపురి అరవింద్ ఇక్కడ సిట్టింగ్ ఎంపీ కవితపై 60 వేల పై చిలుకు ఓట్లతో గెలుపొందారు. రైతులు తాము అనుకున్నది సాధించారు. ఏకంగా ఎంపీని ఓటమి పాలయ్యేలా చేశారు. ఇది కూడా చారిత్రిక రికార్డుగా నమోదైంది.
దేశ వ్యాప్తంగా రైతులు చరిత్రను తిరగ రాశారు. పాలకుల కళ్లు తెరిపించారు. ఏకంగా కంట్రీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులకు ఎక్కారు. కంట్రీ బుక్ నిర్వాహకుల నుంచి అధికారికంగా లెటర్ అందినట్లు ఈసీ , ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. త్వరలో ఈ లేఖను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కు పంపిచనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ 11న జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ సీటుకు భారీ ఎత్తున పోటీ చేశారు. దీంతో 1788 పోలింగ్ స్టేషన్లలో, 26,820 బ్యాలెట్ యూనిట్లను, 2 వేల కంట్రోల్ యూనిట్లు, 2 వేల వీవీ ప్యాట్లను ఈసీ ఏర్పాటు చేసింది.. ఎన్నికల నిర్వహణలో 2 వేల మంది సిబ్బంది, 600 మంది ఇంజనీర్లు పాల్గొన్నారు. ఫలితాల కౌంటింగ్‌కు 15 హాళ్లలో 149 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఎక్కడా ఇబ్బంది రాకుండా ఫలితం ప్రకటించారు. ఏది ఏమైనా శాంతియుతంగా , ధర్మబద్ధంగా పోటీ చేసిన రైతులకు సలాం చేయాల్సిందే.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి