సౌతాఫ్రికాకు ఝ‌ల‌కిచ్చిన బంగ్లాదేశ్

వ‌ర‌ల్డ్ క‌ప్ క్రికెట్ టోర్న‌మెంట్‌లో అద్భుత‌మైన పెర్‌ఫార్మెన్స్ ను ప్ర‌ద‌ర్శించింది బంగ్లాదేశ్ క్రికెట్ జ‌ట్టు. ఇప్ప‌టి దాకా చ‌ప్ప‌గా సాగిన మ్యాచ్‌ల కంటే ఈసారి సౌతాఫ్రికా, బంగ్లాల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠ‌ను రేపింది. క్రికెట్ ప్రేమికుల‌కు మంచి మ‌జాను మిగిల్చింది. మెగా టోర్నీ తొలి వారంలోనే అతి సంచ‌ల‌నం న‌మోదైంది. పేరుకు చిన్న జ‌ట్టే అయినా ..ఎంతో అనుభ‌వం క‌లిగిన ద‌క్షిణాఫ్రికా జ‌ట్టుకు చుక్క‌లు చూపించింది. ర‌బాడ‌, ఎంగిడి, క్వాయో, మోరిస్, తాహిర్ అంద‌రూ వ‌ర‌ల్డ్ క్లాస్ బౌల‌ర్లే..అలాంటి జ‌ట్టును మ‌ట్టిక‌రిపించింది. బంగ్లా జ‌ట్టులో వెంట‌ర‌న్ ప్లేయ‌ర్లు షకీబుల్ హ‌స‌న్, ముష్పిక‌ర్ ర‌హీం ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌ను ఓ ఆటాడుకున్నారు. తామేం త‌క్కువ అన్న‌ట్టు సౌమ్య స‌ర్కార్, మ‌హ్మ‌దుల్లా దూకుడు పెంచారు. దీంతో త‌మ జ‌ట్టు త‌ర‌పున ప్ర‌పంచ క‌ప్‌లో అత్య‌ధిక స్కోరు చేసింది ఆ జ‌ట్టు.

 తిరుగులేని బంగ్లా బౌలింగ్‌తో అద్భుత‌మైన బోణీ కొట్టింది. మిగ‌తా జ‌ట్ల‌కు వార్నింగ్ ఇచ్చింది. సౌతాఫ్రికాకు ఈ టోర్నీలో వ‌రుస‌గా రెండో ఓట‌మి. ఓపెనింగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడిన ఆ జ‌ట్టు ..బంగ్లాను త‌క్కువ‌గా అంచ‌నా వేసి బోర్లా ప‌డింది. ఆల్ రౌండ‌ర్ ప్ర‌ద‌ర్శ‌న చేసి ఔరా అనిపించింది. బిగ్ టీమ్స్ ను ఊహించ‌ని రీతిలో షాకింగ్ ఇవ్వ‌డం బంగ్లా టీంకు అల‌వాటే. 21 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి మొద‌ట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా జ‌ట్టు 50 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్లు కోల్పోయి 330 ప‌రుగుల భారీ స్కోరు చేసింది. ర‌హీం 78 ప‌రుగులు, హ‌స‌న్ 75 ప‌రుగులు చేసి జ‌ట్టు స్కోర్‌ను ప‌రుగులెత్తించారు. మ‌హ్మ‌దుల్లా 46 ప‌రుగుల‌తో విరుచుకు ప‌డ్డాడు. 

భారీ ఛేజింగ్‌ను ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన ద‌క్షిణాఫ్రికా జ‌ట్టుకు ఆరంభంలో బాగానే ఆడింది. ఓపెన‌ర్లు క్వింట‌న్ డికాక్ 23 ప‌రుగులు చేయ‌గా...మార్ క్ర‌మ్ 45 ప‌రుగులు చేసి తొలి వికెట్‌కు 9.4 ఓవ‌ర్ల‌లో 49 ప‌రుగులు చేశారు. వీరిద్ద‌రికి అండ‌ర్ స్టాండింగ్ లేక పోవ‌డంతో డికాక్ ర‌నౌట్ అయ్యాడు. వ‌న్ డౌన్‌లో బ్యాటింగ్ కు వ‌చ్చిన కెప్టెన్ డుప్లెసిస్ బంగ్లా బౌల‌ర్ల‌ను చెడుగుడు ఆడాడు. మార్ క్ర‌మ్‌తో క‌లిసి జ‌ట్టు స్కోర్‌ను వంద ప‌రుగులు దాటించాడు. వీరిద్ద‌రి ఊపు చూస్తుంటే విజ‌యం ఈజీగా ద‌క్కుతుంద‌ని అనిపించింది. డుప్లెసిస్ హుస్సేన్ బౌలింగ్‌లో 25వ ఓవ‌ర్‌లో భారీ సిక్స‌ర్ కొట్టి ఆఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు.

 కానీ కొద్ది సేప‌టికే డుప్లెసిస్ అవుట‌య్యాడు. సీనియ‌ర్ క్రికెట‌ర్ మిల్ల‌ర్, డుసేన్ లు 34.2 ఓవ‌ర్ల‌లో 200 ప‌రుగులకు పెంచారు. జోరు మీదున్న మిల్ల‌ర్ ను ముస్తాఫిజుర్ పెవిలియ‌న్‌కు పంపించాడు. ఈ ద‌శ‌లో మైదానంలోకి వ‌చ్చిన జేపీ డుమినితో క‌లిసి డుసేన్ ధాటిగా ఆడాడు. ముస్తాఫిజుర్ వేసిన 38 వ ఓవ‌ర్ల‌లో సిక్స్, ఫోర్ కొట్టాడు. 40వ ఓవ‌ర్‌లో సైఫుద్దిన్ బౌల్డ్ చేయ‌డంతో ప‌రిస్థితి మొద‌టికి వ‌చ్చింది. డుమిని క్రీజులో ఉన్నా అత‌డికి స‌హ‌కారం క‌రువైంది. 47వ ఓవ‌ర్‌లో డుమిని రెండు ఫోర్లు కొట్టినా ఫ‌లితం లేక పోయింది. ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు ప‌సికూన‌లైన బంగ్లా చేతిలో ఓట‌మి పాలైంది. 

కామెంట్‌లు