ప్రజలపై టీఎస్ఆర్‌టీసీ ఛార్జీల మోత..?
బంగారు తెలంగాణ పేరుతో ఛార్జీల మోత మోగిస్తున్న కేసీఆర్ సర్కార్ మరోసారి ప్రజలపై రవాణా ఛార్జీలు పెంచేందుకు కసరత్తు చేస్తోంది. ఏకంగా టికెట్ల ధరలు 25 నుంచి 30 శాతానికి పెంచాలని ఆర్టీసీ ఈ మేరకు ఓ నోట్ ఫైల్ ప్రభుత్వానికి చేరవేసింది. తమకు రావాల్సిన ప్రయోజనాలను ఇవ్వకుండా ఆర్టీసీ యాజమాన్యం వెట్టి చాకిరి చేయిస్తోందంటూ కార్మికులు, ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మేనేజ్‌మెంట్ కు నోటీసులు కూడా అందజేశారు. ఇప్పటికే మునిగి పోయేందుకు సిద్ధంగా ఉన్న ఆర్టీసీని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అయినా అర్థం చేసుకోకుండా ఇలాగే ఆందోళన బాట పడితే తానేమీ చేయలేనని సాక్షాత్తు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
కార్మికులు, సంస్థ కలిసి దీనిని నడిపించాలని..ఇంకెంత కాలం ఇలా నష్టాలతో నడిపిస్తామంటూ ప్రశ్నించారు. ఒకప్పుడు లాభాల బాటలో పయనించిన ఏపీఎస్ఆర్టీసీని నష్టాలపాలు చేసిన ఘనత గతంలో ఏలిన ప్రభుత్వాలదే. స్థానికేతరులు ఈ సంస్థలో చేరి సంస్థను నిర్వీర్యం చేశారు. అందినంత మేర దండుకున్నారు. ఇప్పటికీ ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలకు చెందిన వారే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో తిష్ట వేసుకుని కూర్చున్నారు. డిపోలలో పనిచేస్తున్న వారు, బస్సులు నడిపే డ్రైవర్లు, కండక్టర్లు ఇతోధికంగా బాధ్యతలు నిర్వహిస్తున్నా పై స్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తున్న వారు తీవ్ర వేధింపులకు పాల్పడుతున్నారు.
ఆక్యుపెన్సీ పేరుతో టార్గెట్ నిర్ణయించడం, లేనిపోని విధంగా డ్యూటీలు వేయడం, ఉద్యోగులకు భద్రత లేకుండా చేయడం ..ఇలా చెప్పుకుంటూ పోతే నిజాయితీగా ..నిబద్ధతతో ప్రజలకు ఇతోధికంగా సేవలందిస్తున్న ఆర్టీసీ సిబ్బందిని ఆదుకోక పోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రెండు నెలల పాటు ఆర్టీసీ కార్మికులు తమ కుటుంబాలకు దూరంగా ఉన్నారు. పోరాట స్ఫూర్తిని ప్రదర్శించారు. కేసీఆర్ దీక్షకు మద్ధతు పలికారు. యూనియన్ లీడర్లదే రాజ్యం నడుస్తోంది. ఓ వైపు ఏపీ అత్యాధునిక సదుపాయాలతో బస్సులను నడిపిస్తోంది. ఆదాయ మార్గాలను అన్వేషిస్తోంది.
ప్రతి బస్టాండును ఆధునీకరించింది. ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత కల్పించింది. అక్కడ కూడా ఫిట్‌మెంట్ ఇవ్వడం లేదంటూ ఏపీ సిబ్బంది కూడా సమ్మె సైరన్ మోగించారు. ప్రైవేట్ ఆపరేటర్ల రాజ్యం నడుస్తోంది. స్థానికేతరులకు చెందిన లెక్కలేనన్ని బస్సులు తెలంగాణలో స్వైర విహారం చేస్తున్నాయి. పండుగలంటూ వస్తే వారి పంట పండినట్టే. వాటి మీద రవాణా సంస్థ కానీ, ఆర్టీసీ కాని ఆజమాయిషీ లేకుండా పోయింది. రిటైర్మెంట్ అయిన వారే ఎక్కువగా ఆర్టీసీలో ఆధిపత్యం చెలాయిస్తూ ..తమ పదవులు కాపాడుకుంటూ వస్తున్నారు. వారి అవినీతి, అక్రమాలకు అడ్డు లేకుండా పోయింది. చాలా పోస్టులు ఖాళీగా ఉన్నా..సంస్థ మనుగడకు భంగం వాటిల్లే ప్రమాదం కొని తెచ్చుకుంది.
ఉద్యోగులు, సిబ్బంది కోర్కలు తీరాలంటే ..తిరిగి ఆర్టీసీ ప్రజలపై భారం వేయాల్సిందే. అంటే ఛార్జీలు పెంచడం మినహా మరో మార్గం లేదు. ఇప్పటికే 2 లక్షలకు పైగా కొలువులను భర్తీ చేయకుండా నిరుద్యోగులను పట్టించుకోకుండా
కేసీఆర్ సర్కార్ ముందుకెళుతోంది. నీళ్లు , నిధులు , నియామకాలు పేరుతో వచ్చిన ఈ ప్రభుత్వం ఆర్టీసీని పక్కన పెట్టింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన ఈ సారి ఆర్టీసీకి గౌరవ అధ్యక్షుడిగా సీఎం అల్లుడు హరీష్ రావు..ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కు గౌరవ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ సమయంలో ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ డ్యూటీలు చేస్తున్నారు.
కాలం చెల్లిన బస్సులతోనే కానించేస్తున్నారు. ఆర్టీసీ ఎండీ ..సుదీర్ఘమైన నోట్ తయారు చేసి అనుమతి కోసం సీఎం కేసీఆర్ వద్దకు పంపించారు. 15 శాతం ఛార్జీలు పెంచినా ప్రజలపై 500 కోట్ల భారం పడుతుందని అంచనా. 2016లో చిల్లర మార్పిడి సమస్యలను అధిగమించేందుకు టికెట్ల ధరలను సర్దుబాటు చేశారు. మరో వైపు డీజిల్ ధరలు పెరిగాయి. ఆ దిశగా టికెట్ల ధరలు పెరగలేదు. పెద్ద మొత్తంలో ఛార్జీలు పెంచితే..ప్రజలు బస్సుల వైపు చూడక పోవచ్చు. ఇప్పటికే బతకడం గగనంగా మారింది.
సంస్థకు రావాల్సిన బకాయిలు ..ఇతర సంస్థల నుంచి రావాల్సి ఉంది.
బకాయిలు పేరుకు పోవడంతో..ఆర్టీసీ స్వంత కార్మికులు, ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితికి దిగజారింది. కార్మికుల సీసీఎస్ డబ్బులను కూడా సంస్థ స్వంతానికి వాడుకుంది. విమానయానాలకు రాయితీలు ఇస్తున్న కేంద్ర సర్కార్, ఆయిల్ పై రాయితీ ఇచ్చినట్లయితే కొంత మేర ఆర్టీసీకి మేలు జరిగే అవకాశం ఉంది. పూర్తిగా అప్పుల ఊబిలోకి చేరుకున్న ఆర్టీసీని గట్టెక్కించాలంటే..దానిని పట్టాలపైకి ఎక్కించాలంటే చాలా కసరత్తు చేయాల్సి ఉంది. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కాయకల్ప చికిత్స చేస్తేనే ఆర్టీసీ సంస్థ బతికి బట్టకడుతుంది. లేకపోతే కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం పొంచి ఉంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి