రీ ఎంట్రీ ఇవ్వ‌నున్న దీక్షితులు - టీటీడీలో స‌మస్య‌లు కోకొల్ల‌లు


పాలిటిక్స్ ఎప్పుడూ ప‌వ‌ర్ చుట్టే తిరుగుతూ వుంటాయి. ఆ సీట్ల‌కు వుండే అధికారం అలాంటిది. ప్ర‌పంచంలోనే అత్యంత ఆదాయం క‌లిగి ..శ‌క్తివంత‌మైన ఆల‌యంగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంకు పేరుంది. లెక్క‌లేనంత డ‌బ్బులు, లెక్కించ‌లేనంత బంగారం, వ‌జ్రాలు, వైఢూర్యాలు, చిల్ల‌ర నాణేలు, ఆస్తులు, ఇలా చెప్పుకుంటూ పోతే క‌నీసం ఏడాది ప‌డుతుంది. దీనిపై పెత్త‌నం చెలాయించేందుకు అటు స్వాములు, పీఠాధిప‌తులు, ఇటు రాజ‌కీయ నాయ‌కులు  నానా తంటాలు ప‌డుతుంటారు. తిరుమ‌ల కొండ‌పై కొలువు తీరిన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, వెంగ‌మాంబ అమ్మ వార్ల‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది భ‌క్తులు వున్నారు. ప్ర‌తి రోజు ల‌క్ష‌లాది మంది స్వామి, అమ్మ‌వార్ల‌ను ద‌ర్శించుకుంటారు. లెక్క‌లేనంత కానుకలు హోండీల ద్వారా స‌మ‌ర్పించుకుంటారు. 

జీవితంలో ఒక్క‌సారైనా తిరుమ‌ల‌ను సంద‌ర్శించు కోవాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. అంత‌గా స్వామి, అమ్మ వార్లు భాగ‌మై పోయారు. వారిని మ‌న‌స్ఫూర్తిగా కొలిస్తే కోరిన కోర్కెలు తీరుతాయ‌ని, స‌మ‌స్య‌ల నుంచి గ‌ట్టెక్క‌గ‌లుగుతామ‌ని, నిశ్చింత‌గా జీవితాన్ని సాగించ‌వ‌చ్చ‌ని భ‌క్తుల ప్ర‌గాఢ విశ్వాసం. ప్ర‌తి రోజు వేలాది వాహ‌నాలు, రైళ్లు, విమానాలు ప్ర‌యాణికుల‌ను, భ‌క్తుల‌ను చేర‌వేస్తూ సేవ‌లందిస్తున్నాయి. గ‌ణ‌నీయ‌మైన ఆదాయాన్ని పొందుతున్నాయి. ఎక్క‌డా ఎలాంటి ఇబ్బంది అంటూ లేకుండా టీటీడీ అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. కానీ లెక్క‌కు మించి భ‌క్త‌జ‌నం వ‌స్తుండ‌డంతో పాల‌న గాడి త‌ప్పుతోంది. ఇక్క‌డ రాజ‌కీయ నాయ‌కుల జోక్యం మితిమీర‌డంతో ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. గ‌దుల కేటాయింపు, టోకెన్ల జారీ , ద‌ర్శ‌నం కోసం గంట‌ల కొద్దీ వేచి చూడ‌డం ..సాధార‌ణ భ‌క్తుల‌కు ఇబ్బందిగా మారింది.

తిరుమ‌ల‌కు చేరుకునేందుకు బ‌స్సులు ఉండ‌గా , కాలిన‌డ‌క‌న వెళ్లేందుకు రెండు మార్గాలు ఉన్నాయి. ఇప్ప‌టికే తిరుమ‌లలో హోట‌ళ్ల నిర్వ‌హ‌ణ స‌క్ర‌మంగా లేదంటూ ప్ర‌జా ప్ర‌యోజ‌నాల వ్యాజ్యం దాఖ‌లైంది. దీనిపై స్పందించిన హైకోర్టు టీటీడీ పాల‌క‌వ‌ర్గం, అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. టీటీడీ నిర్దేశించిన ధ‌ర‌ల‌కే విక్ర‌యించాల‌ని, ఏ ఒక్క రూపాయి పెంచినా ఊరుకునే ప్ర‌స‌క్తి లేదంటూ పేర్కొంది. దీంతో కొన్ని నెల‌ల పాటు అన్ని హోట‌ళ్ల‌ను బంద్ చేశారు. తిరిగి తెరిచారు. కానీ హైకోర్టు ఆదేశాల‌ను అమ‌లు చేయ‌డం లేదు. ఇష్టానుసారంగా రేట్ల‌ను పెంచుతూ నిలువు దోపిడీ చేస్తున్నారు. డ‌బ్బులు బాజాప్త‌గా వ‌సూలు చేస్తున్న య‌జ‌మానులు ..ఫుడ్ ఐట‌మ్స్ లో నాణ్య‌త ఉండ‌టం లేదు. వాటిక‌న్నా టీటీడీ ఆధ్వ‌ర్యంలో రోజూ పెట్టే అన్న‌దానం స‌త్రాలే బాగున్నాయి.

టీటీడీ పాల‌క వ‌ర్గం కొలువు తీరింది. తెలంగాణ నుంచి ఒక‌రు స‌భ్యులుగా ఉన్నారు. ఇరు రాష్ట్రాల నుంచి , ఇత‌ర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున భ‌క్తులు ఇక్క‌డికి వ‌స్తుంటారు. ఏపీలో కొత్త స‌ర్కార్ కొలువు తీర‌డంతో చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో నియ‌మితులైన వారంతా త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా స‌మ‌ర్పించారు. టీటీడీలో 8 వేల మంది ప‌ర్మినెంట్ సిబ్బంది, 17 వేల మందికి పైగా కాంట్రాక్టు ప‌ద్ధ‌తిన ప‌నిచేస్తున్నారు. రోజుకు కోట్లాది రూపాయ‌ల ఆదాయం, ప్ర‌తి ఏడాదికి 3 వేల 500 కోట్ల బ‌డ్జెట్‌ను రూపొందిస్తోంది. క‌నీస సౌక‌ర్యాల‌కు నోచు కోవ‌డం లేదు. ఆదాయంలో మొద‌టి స్థానంలో ఉన్న ఈ ఆల‌యంలో స్వామి వారినే న‌మ్ముకుని సేవ‌లందిస్తున్న వారంతా అర్ధాక‌లితో జీవిస్తున్నారు.

మిరాసీ వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేస్తూ గ‌త ఏడాది పాల‌క వ‌ర్గం నిర్ణ‌యం తీసుకుంది. 65 ఏళ్లు నిండిన అర్చ‌కులు ప‌ద‌వీ విర‌మ‌ణ పొందారు. వారిలో ప్ర‌ధాన అర్చ‌కులుగా కొన‌సాగిన ర‌మ‌ణ దీక్షితులు కూడా ఉన్నారు. తాను వంశ పారంప‌ర్యంగా చేస్తున్న అర్చ‌క ప‌ద‌వి నుంచి త‌ప్పించ‌డం నిబంధ‌న‌ల‌కు విరుద్ధమంటూ దీక్షితులు బ‌హిరంగ లేఖ రాశారు. ఈ విష‌యాన్ని పాల‌క‌మండ‌లి తీవ్రంగా తీసుకుంది. మిరాసీ వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీంతో గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో ర‌మ‌ణ దీక్షితులు బాధ్య‌త‌ల నుంచి త‌ప్పు కోవాల్సి వ‌చ్చింది. టీడీపీ స‌ర్కార్ ఈఓను మార్చేసింది. ఉత్త‌రాదికి చెందిన సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ అనిల్ కుమార్ సింఘాల్ ను నియ‌మించింది. దీనిని పీఠాధిప‌తులు, స్వాములు, సిబ్బంది, ఉద్యోగులు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. తెలుగు వారు దొర‌క‌లేదా అంటూ ప్ర‌శ్నించారు. అయినా చంద్ర‌బాబు ఒప్పు కోలేదు. త‌న నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోలేదు.

సింఘాల్ ఈఓగా వ‌చ్చాక టీటీడీలో కొన్ని మార్పులు చేశారు. మ‌రెన్నో స‌వాళ్ల‌ను ఎదుర్కొన్నారు. ఆయ‌న‌పై ప‌లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. కానీ ప‌నిచేసుకుంటూ పోయారు. తాజాగా ప్ర‌భుత్వం మారింది. బంప‌ర్ మెజారిటీతో జ‌గ‌న్ ప్ర‌భుత్వం కొలువు తీరింది. తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శ‌నం చేసుకునే స‌మ‌యంలో ర‌మ‌ణ దీక్షితులు జ‌గ‌న్‌ను క‌లిశారు. ఆయ‌న‌కు పూర్తి భ‌రోసా ఇచ్చారు ఏపీ సీఎం. అంతే కాకుండా డాల‌ర్ శేషాద్రి, దీక్షితులు మ‌రోసారి ఆల‌య ప్రాంగ‌ణంలో హ‌డావుడి చేశారు. దీంతో రీ ఎంట్రీ ఇస్తార‌నే ప్ర‌చారం జోరందుకుంది. జ‌గ‌న్ కూడా వీరి వైపు మొగ్గు చూప‌డంతో టీటీడీలో చాలా మార్పులు చోటు చేసుకోనున్నాయి. జేఇఓగా శ్రీ‌నివాస‌రాజు కొన్నేళ్ల పాటు అక్క‌డే తిష్ట వేయ‌డం కూడా సీఎం ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. శ్రీ శార‌దా పీఠం పీఠాధిప‌తి స్వ‌రూపానందేంద్ర‌, చిన‌జీయ‌ర్ స్వామిల ఆశీస్సులు పొందిన జ‌గ‌న్ ..టీటీడీలో తీసుకోబోయే నిర్ణ‌యాల‌ను వారి సూచ‌న‌ల మేర‌కే తీసుకునే అవ‌కాశం ఉంది.

కాంట్రాక్టు ప‌ద్ధ‌తిన ప‌నిచేస్తున్న వారికి క‌నీస భ‌ద్ర‌త క‌ల్పించ‌డం, వారిని ప‌ర్మినెంట్ చేయ‌డం, జీతాలు పెంచ‌డంతో పాటు ఇళ్ల స్థ‌లాలు ఇవ్వ‌డం, పెన్ష‌న్ సౌక‌ర్యం వ‌చ్చేలా చేయ‌డం జ‌గ‌న్ ముందున్న సవాలు. ఇంకా టీటీడీలో ఏం జ‌రుగుతుందో ఎవ‌రికీ తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. పాల‌క మండ‌లి ఏం చేస్తుందో, అధికారులు ఎవ‌రు ఎక్క‌డున్నారో తెలియ‌డం లేదు. మొత్తం మీద దీక్షితులు, డాల‌ర్ శేషాద్రిల‌కు లైన్ క్లియ‌ర్ చేసిన‌ట్లు స‌మాచారం. ఇదే ఇపుడు హాట్ టాపిక్ గా మారింది టీటీడీలో. ఈఓ, జేఇఓలు ఉంటారో లేదో వేచి చూడాల్సిందే. స్వామి వారి భ‌క్తుడిగా మారిన జ‌గ‌న్..సామాన్య భ‌క్తుల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పించాల‌ని కోరుకుందాం. 

కామెంట్‌లు