ఘ‌నంగా రౌండ్ టేబుల్ ఇండియా పుర‌స్కారాలు

చెన్నై కేంద్రంగా స్వ‌చ్ఛంధ సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న రౌండ్ టేబుల్ ఇండియా ఎన్‌జిఓ సంస్థ ఆధ్వ‌ర్యంలో ప్రైడ్ ఆఫ్ తెలంగాణ పేరుతో వివిధ రంగాల‌లో విశిష్ట సేవలందించిన వారికి పుర‌స్కారాలు హైద‌రాబాద్‌లో అంద‌జేశారు. మాదాపూర్‌లోని హెచ్ఐసిసీలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఐటీ , ప‌రిశ్ర‌మ‌ల ముఖ్య కార్య‌ద‌ర్శి జ‌యేష్ రంజ‌న్ , జీవీకే గ్రూప్ సంస్థ‌ల డైరెక్ట‌ర్ పింకీ రెడ్డి, ఏఐజీ హాస్పిట‌ల్స్ డైరెక్ట‌ర్ జి.వి.రావులు హాజ‌ర‌య్యారు. విజేత‌ల‌కు అవార్డులు అంద‌జేశారు. మొత్తం 12 కేట‌గిరీల‌లో అఛీవ‌ర్ అవార్డు, ఎమ‌ర్జింగ్ పుర‌స్కారాల‌ను ప్ర‌దానం చేశారు. ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హ‌ణ ద్వారా వ‌చ్చిన విరాళాల‌ను ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో మౌళిక వ‌స‌తులు, సౌక‌ర్యాల క‌ల్ప‌న‌కు వినియోగించ‌నున్న‌ట్లు ఆర్‌.టి.ఐ సంస్థ బాధ్యులు తెలిపారు.

ఇక పుర‌స్కారాలు అందుకున్న వారిలో స్వ‌చ్ఛంధ సేవా సంస్థ‌ల విభాగంలో విశిష్ట సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన డాక్ట‌ర్ రెడ్డీస్ ఫౌండేష‌న్‌కు అవార్డు ద‌క్కింది. ఎస్ఎంఈ కేట‌గిరీలో సువెన్ లైఫ్ సైన్సెస్ ఎంపిక కాగా, విద్యా విభాగంలో చిర‌క్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ నిర్వాహ‌కురాలు ర‌త్నారెడ్డి పుర‌స్కారాన్ని అందుకున్నారు. ఫిల్మ్ ఆర్టిస్ట విభాగంలో మోస్ట్ పాపుల‌ర్ యంగ్ యాక్ట‌ర్‌గా పేరొందిన విజ‌య దేవ‌ర‌కొండ ఎంపిక‌య్యారు. వైద్య రంగానికి సంబంధించి అవార్డును డాక్ట‌ర్ .ఎన్. చంద్ర‌శేఖ‌ర్ రావు పుర‌స్కారాన్ని స్వీక‌రించారు. అంకుర సంస్థ‌ల విభాగంలో ఇటీవ‌ల అన్ని స్టార్ట‌ప్‌ల‌ను దాటేసి ప్ర‌థ‌మ స్థానంలో నిలిచింది ఎనీ టైం లోన్ స్టార్ట‌ప్. ఎలాంటి నియ‌మ నిబంధ‌న‌లు లేకుండానే ..జ‌స్ట్ స్మార్ట్ ఫోన్ ఆధారంగా కేవ‌లం రెండే రెండు నిమిషాల్లో కావాల్సిన రుణం అంద‌జేస్తుంది ఈ సంస్థ‌. ఊహించ‌ని రీతిలో దేశ వ్యాప్తంగా ఈ స్టార్ట‌ప్‌కు లెక్క‌లేనంత మంది క‌నెక్ట్ అయ్యారు.

ఇక స్పెష‌ల్ కేట‌గిరీ కింద మ‌హిళా విభాగంలో నాస‌ర్ స్కూల్ ప్ర‌తినిధి బేగం అనీస్ ఖాన్ అవార్డు తీసుకోగా, అడ్మినిస్ట్రేష‌న్ స‌ర్వీసెస్ కేట‌గిరీలో హైద‌రాబాద్ మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్ట‌ర్‌గా ఉన్న ఎన్.వి.ఎస్. రెడ్డి పుర‌స్కారాన్ని అందుకున్నారు. ఫుడ్ అండ్ బేవ‌ర్జీస్ విభాగంలో మెస్స‌ర్స్ క‌రాచీ బేక‌రీ , క్రీడా విభాగంలో సుహీం షేక్, రిటైల్ విభాగంలో నీరూస్, ఎమ‌ర్జింగ్ యాక్ట‌ర్ విభాగంలో పెళ్లి చూపులు ఫేం ప్రియ‌ద‌ర్శి అవార్డుల‌ను అందుకున్నారు. ఇలాంటి పుర‌స్కారాలు, అవార్డులు అందుకోవ‌డం త‌మ‌కు ఎందో ఆనందం క‌లిగించిందని..ఇలాంటి కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం, వ‌చ్చిన డ‌బ్బుల‌ను పేద పిల్ల‌లు చ‌దువుకునే ప్ర‌భుత్వ బ‌డులలో వ‌స‌తులు క‌ల్పించేందుకు వినియోగించ‌డం గొప్ప‌నైన విష‌య‌మ‌న్నారు. ఈ సంద‌ర్భంగా అవార్డు గ్రహీత‌లు రౌండ్ టేబుల్ ఇండియా ఎన్‌జిఓను అభినందించారు. 

కామెంట్‌లు