బ‌తికిపోయిన పాకిస్తాన్ ..బెంబేలెత్తించిన ఆఫ్గ‌నిస్తాన్

ప్ర‌పంచ క‌ప్ టోర్న‌మెంట్‌లో ఈజీగా గెలుస్తుంద‌ని భావించిన పాకిస్తాన్ జ‌ట్టు చావు త‌ప్పి క‌న్ను లొట్ట ప‌డింద‌న్న చందంగా ఆఫ్గ‌నిస్తాన్ పై అతి క‌ష్టం మీద విజ‌యం సాధించింది. ఆఖ‌రు వ‌ర‌కు ఆఫ్గాన్ క్రికెట‌ర్స్ చుక్క‌లు చూపించారు. గెలుపు అంచుల దాకా వ‌చ్చి ఆ జ‌ట్టు చ‌తికిల ప‌డడంతో పాక్ ఆట‌గాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విజ‌యంతో పాకిస్తాన్ సెమీఫైన‌ల్ ఆశ‌లు స‌జీవంగా ఉంచుకుంది. పెను సంచ‌ల‌నం తృటిలో త‌ప్పిపోయింది లేకుంటే ఆఫ్గాన్ రికార్డు సృష్టించేదే. ఆఫ్గ‌న్ ఆఖ‌రు వ‌ర‌కు పాక్‌పై ఆధిప‌త్యం సాధించింది. ఆ జ‌ట్టు స్పిన్న‌ర్ల దెబ్బ‌కు పాక్ క్రికెట‌ర్లు ప‌రుగులు చేసేందుకు నానా తంటాలు ప‌డ్డారు. ఓట‌మి అంచుల్లో చిక్కుకున్న పాకిస్తాన్ జ‌ట్టును ఇమాద్ వ‌సీం ఒక్క‌డే అడ్డుగోడ‌లా నిలిచాడు. విరోచిత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఆ జ‌ట్టు క‌ష్టం మీద గెలుపొందింది.

ఈ టోర్నీలో పాకిస్తాన్‌కు వ‌రుస‌గా ఇది మూడో విజ‌యం. ఇమాద్ వ‌సీం 54 బంతులు ఆడి 49 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అత్యంత ఉత్కంఠ భ‌రితంగా ఇరు జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ కొన‌సాగింది. ఏడు వికెట్లు కోల్పోయి మూడు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ష‌హీన్ ఆఫ్రిది 47 ప‌రుగులు ఇచ్చి 4 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా , వ‌సీం 48 ప‌రుగులు ఇచ్చి మ‌రో రెండు వికెట్లు తీశాడు. వాహ‌బ్ రియాజ్ 29 ప‌రుగులిచ్చి ఇద్ద‌రిని అవుట్ చేయ‌డంతో ఆఫ్గ‌న్ జ‌ట్టు 9 వికెట్లు కోల్పోయి 227 ప‌రుగులు చేసింది. అస్గ‌ర్ అఫాన్ 35 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్స‌ర్ల‌తో 42 ప‌రుగులు చేయ‌గా, న‌జీబుల్లా 54 బంతుల్లో 6 ఫోర్ల‌తో 42 ప‌రుగులు చేశాడు. ఓ ద‌శ‌లో 125 ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ఉన్న ఆ జ‌ట్టును న‌జీబుల్లా ఆదుకున్నాడు. టెయిలెండ‌ర్ల‌తో క‌లిసి జ‌ట్టు స్కోరును 200 ప‌రుగులు దాటించాడు. ఇక పాక్ జ‌ట్టులో ఇమాద్ తో పాటు బాబ‌ర్ అజామ్ 45 ప‌రుగులు, ఇమాముల్ 36 ప‌రుగులు చేసి రాణించ‌డంతో ఎట్ట‌కేల‌కు విజ‌యం సాధించింది.

టార్గెట్‌ను ఛేదించే క్ర‌మంలో మైదానంలోకి దిగిన పాకిస్తాన్ ఆట‌గాళ్లు ఒక‌టి రెండు ప‌రుగులు చేసేందుకు ఇబ్బందులు ప‌డ్డారు. ఒకానొక ద‌శ‌లో పాక్ గెలుస్తుందా లేదా అన్న అనుమానం క‌లిగింది అభిమానుల‌కు. ఆ జ‌ట్టు ఇబ్బందుల నుంచి గ‌ట్టెక్కుందుని క‌నిపించిన ప్ర‌తిసారి ఆఫ్గాన్ దెబ్బ తీసింది. బాబ‌ర్ ఆజామ్ , ఇమాముల్ రాణించినా..ముజీబ్, న‌బి, ర‌షీద్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేయ‌డంతో పాక్ 142 ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోయింది. క‌ష్టాల్లో ప‌డింది. క్రీజులోకి వ‌చ్చిన స‌ర్ఫ‌రాజ్ ర‌నౌట్ కావ‌డంతో 156 కు ఆరు వికెట్లు కోల్పోయింది. సాధించాల్సిన ర‌న్ రేట్ పెర‌గ‌డం, ఫ్యాన్స్ నుంచి ఒత్తిడి అధికం కావ‌డంతో ఆఫ్గాన్ ఓ ద‌శ‌లో గెలుస్తుంద‌ని అనిపించింది. కానీ ఇమాద్ వ‌సీం ఒంట‌రి పోరు సాగించాడు. ఆఫ్గాన్ బౌల‌ర్ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొని జ‌ట్టుకు విజ‌యాన్ని అందించ‌డంతో పాక్ ఊపిరి పీల్చుకుంది. మొత్తం మీద నైతిక విజ‌యం మాత్రం ఆఫ్గానిస్తాన్ జట్టుదేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

కామెంట్‌లు