కేసీఆర్, జ‌గ‌న్ ల దోస్తానా - ప్ర‌గ‌తికి ఫ‌ర్మానా

కాలం విచిత్ర‌మైంది. అది ఎంత‌టి వారినైనా కట్టి ప‌డేస్తుంది. పైనున్న వాళ్ల‌ను కింద‌కు తోసేస్తుంది. అట్ట‌డుగున ఉన్న వాళ్ల‌ను అంద‌లం ఎక్కిస్తుంది. ఏపీ ఉమ్మడి రాష్టం నుండి విడి పోయాక ఇరు రాష్ట్రాలు వేర్వేరుగా ఏర్పాట‌య్యాక‌..చాలా ఇబ్బందులు ఏర్ప‌డ్డాయి. పంప‌కాల విష‌యంలో పంతాలు, పట్టింపుల‌కు పోవ‌డంతో చివ‌ర‌కు గ‌వ‌ర్న‌ర్ జోక్యం చేసుకోవాల్సిన ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. అటు వైపు టీడీపీ కొలువు తీరిన చంద్ర‌బాబు నాయుడుకు ఇక్క‌డ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మ‌ధ్య‌న అంత‌రాలు ఏర్ప‌డ్డాయి. త‌ర్వాత వీరిద్ద‌రి మ‌ధ్య న‌ర‌సింహ‌న్ స‌యోధ్య కుదిర్చే ప్ర‌య‌త్నం చేశారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఒక‌రిపై మ‌రొక‌రు ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు చేసుకున్నారు. టీడీపీ కాంగ్రెస్‌తో క‌లిసి పోటీ చేస్తే..టీఆర్ఎస్‌, ఎంఐఎంలు క‌లిసి పోటీ చేశాయి. కేసీఆర్ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

 ఆ మేర‌కు ఆయ‌న కొన్ని రాష్ట్రాలు తిరిగారు. ఆయా సీఎంల‌ను క‌లిశారు. మ‌రో వైపు చంద్ర‌బాబు సైతం బీజేపీ యేత‌ర పార్టీల‌ను కూడ‌గ‌ట్టే ప్ర‌య‌త్నం చేశారు. ఈ సంద‌ర్బంగా జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. ఏపీలో ఎట్టి ప‌రిస్థితుల్లోను టీడీపీకి గ‌ట్టి షాక్ ఇచ్చేలా చేయాల‌ని , బాబుకు రిటర్న్ గిఫ్ట్ త‌ప్ప‌క ఇస్తాన‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు. దీనిని చంద్ర‌బాబు లైట్ గా తీసుకున్నారు. తాజాగా ప్ర‌క‌టించిన ఎన్నిక‌ల్లో దేశ వ్యాప్తంగా మోడీ గాలి వీస్తే, బీజేపీ థంబింగ్ మెజారిటీతో కేంద్రంలో కొలువు తీరింది. మ‌రో వైపు ఇరు తెలుగు రాష్ట్రాల‌లో తెలుగుదేశం ఊహించ‌ని రీతిలో ప‌వ‌ర్ ను కోల్పోగా ..వైసీపీ రికార్డు స్థాయిలో 151 సీట్ల‌ను గెలుచుకుని త‌న స‌త్తా ఏమిటో చూపించింది. బాబుకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. తెలంగాణ‌లో తెరాస భారీ విజ‌యాన్ని న‌మోదు చేసుకుని రెండోసారి కొలువుతీరింది. ఎడ‌మొహం, పెడ మొహంగా ఉంటూ వ‌చ్చిన బాబు, కేసీఆర్‌ల మ‌ధ్య కొంచం దూరం పెరిగింది.

దీంతో ఇరు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న నీటి పంప‌కాలు, ఆఫీసు కార్యాల‌యాలు, భ‌వ‌నాల అప్ప‌గింత‌, ఉద్యోగుల బ‌దిలీలు , త‌దిత‌ర స‌మ‌స్య‌లు అలాగే ఉండి పోయాయి. ఏపీలో నూత‌న స‌ర్కార్ ఏర్ప‌డ‌టం, జ‌గ‌న్‌కు మొద‌టి నుంచి కేసీఆర్ అండ‌దండ‌లు, స‌హాయ స‌హ‌కారాలు అందించ‌డంతో ఇద్ద‌రి సీఎంల మ‌ధ్య స్నేహం కుదిరింది. దీంతో స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి మార్గం ఏర్ప‌డింది. ఇరు రాష్ట్రాలు ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకునే దిశ‌గా అడుగులు వేశాయి. నీటి వ‌న‌రుల‌ను సంపూర్ణంగా వినియోగించుకుని ప్ర‌తి మూల‌కు తాగు, సాగు నీరు అందించేందుకు క‌లిసి ప‌నిచేస్తామంటూ ఇరువురు ప్ర‌క‌టించారు. ఇరు ప్రాంతాలు ప‌చ్చ‌ద‌నంతో క‌ళ‌క‌ళ‌లాడాల‌ని, వ్య‌వ‌సాయానికి, ప‌రిశ్ర‌మ‌ల‌కు నీటి కొర‌త లేకుండా చూడాల‌న్న‌దే త‌మ ల‌క్ష్య‌మ‌న్నారు. కృష్ణానదిలో నీటి లభ్యత తక్కువ అవుతున్న నేపథ్యంలో ఏపీలోని రాయలసీమ ప్రాంతం, తెలంగాణలోని పాలమూరు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలు ఎదుర్కొంటున్న దశాబ్దాల సాగునీటి కష్టాలను దూరం చేసేందుకు గోదావరి నీటిని శ్రీశైలానికి తరలించాలని నిర్ణయించారు.

కామెంట్‌లు