ఫీజుల మోత‌.. దోచుకున్నోళ్ల‌కు దోచుకున్నంత - కాలేజీల దందా..!

బంగారు తెలంగాణ‌లో బ‌తుకు బ‌రువై పోతోంది. చ‌దువు ఉన్న‌త వ‌ర్గాల‌కే ద‌క్కుతోంది. పేద‌లు, మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల పిల్ల‌ల‌కు ఇంజ‌నీరింగ్, మెడిసిన్, అగ్రిక‌ల్చ‌ర్ , ఫార్మ‌సీ కోర్సులు చ‌ద‌వాలంటే ల‌క్ష‌లు ఖ‌ర్చు చేయాల్సిన ప‌రిస్థితి దాపురించింది. కేజీ టూ పీజీ పేరుతో కాల‌యాప‌న చేస్తున్న స‌ర్కార్ ..విద్యా వ్య‌వ‌స్థ‌ను గాలికి వ‌దిలివేసింది. ఓ వైపు టీచ‌ర్లు లేక పాఠ‌శాల‌లు కునారిల్లిపోతుంటే మ‌రో వైపు క‌నీస వ‌స‌తులు లేక విద్యార్థులు ఇబ్బందులు ప‌డుతున్నారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీల గురుకులాలను ఆర్భాటంగా ప్రారంభిస్తున్నారే త‌ప్పా టీచింగ్, నాన్ టీచింగ్ భ‌ర్తీ విష‌యంపై శ్ర‌ద్ద చూపించ‌డం లేద‌న్న ఆరోప‌ణ‌లున్నాయి. ఇవాళ తెలంగాణ‌లో ఇంజ‌నీరింగ్ కోర్సులతో పాటు మెడిసిన్, హోమియోప‌తి, డెంట‌ల్, ఆయుర్వేద కోర్సులు చ‌ద‌వాలంటే ఆస్తులైనా అమ్ముకోవాలి లేదా అప్పులైనా చేయాల్సిందే. లేక‌పోతే చ‌దువుకు దూరంగా ఉండాల్సిందే. 

చ‌దువు కోవ‌డం కంటే చ‌దువును కొనాల్సిన ప‌రిస్థితి దాపురించింది. క‌ష్ట‌ప‌డి ర్యాంకులు సంపాదించినా ఏ కాలేజీలో సీటు వ‌స్తుందో చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఉమ్మ‌డి రాష్ట్రంలో దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ ఎప్పుడైతే ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ కార్య‌క్ర‌మానికి తెర తీశాడో అది పేద పిల్ల‌ల పాలిట శాపంగా మారింది. ఉన్న‌త విద్యా మండ‌లి ఏం చేస్తున్న‌దో అర్థం కావ‌డం లేదు. ప్రైవేట్ ఇంజ‌నీరింగ్ కాలేజీలు ఇబ్బడి ముబ్బ‌డిగా వెలిశాయి. కేవ‌లం ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ పేరుతో ఏకంగా నిలువు దోపిడీకి తెర తీశారు. ఆయా ఇంజ‌నీరింగ్, మెడిసిన్, ఫార్మ‌సీ కాలేజీల‌న్నీ వ్యాపారులు, ఆయా పార్టీల‌కు చెందిన ప్ర‌జాప్ర‌తినిధులే నిర్వ‌హిస్తున్నారు. బాహాటంగా డ‌బ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఎవ‌రికి గ‌వ‌ర్న‌మెంట్ కోటా కింద సీటు వ‌స్తుందో తెలియ‌దు. ఇక జూనియ‌ర్ కాలేజీల సంగ‌తి ఇంత‌కంటే దందా న‌డుస్తోంది. వేలాది ప్ర‌క‌ట‌న‌లు, ల‌క్ష‌లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తున్నారు. ఇంట‌ర్ బోర్డు చేతులెత్తేసింది. ఇప్ప‌టికే పిల్ల‌లు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డారు. 

ఓ వైపు ఎంసెట్ క‌న్వీన‌ర్ కోటా కింద ఆయా కాలేజీల‌లో సీట్ల భ‌ర్తీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కౌన్సెలింగ్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. మ‌రో వైపు జేఇఇ మెయిన్స్, అడ్వాన్స్‌డ్ ప‌రీక్ష‌ల్లో అర్హ‌త సాధించి, ర్యాంకులు పొందిన స్టూడెంట్స్  ..కౌన్సెలింగ్‌కు హాజ‌రు కావాల్సింది. ఐఐటీ, ఎన్ ఐటి, త్రిబుల్ ఐటి, జిఎస్ ఐటి కాలేజీల్లో సీట్ల‌ను కేటాయిస్తారు. అది ఏడు విడ‌తులుగా కౌన్సెలింగ్ ప్ర‌క్రియ కొన‌సాగుతుంది. ఎవ‌రికి ఎక్క‌డ సీటు వ‌స్తుందో రాదో తెలియ‌క విద్యార్థుల‌తో పాటు త‌ల్లిదండ్రులు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. రాష్ట్ర విద్యా శాఖ ఎవ‌రి ఆధీనంలో ఉన్న‌దో , అది ఏం చేస్తున్న‌దో , ఉన్న‌త విద్యా మండ‌లి ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటుందో అర్థం కావ‌డం లేదు. ఫీజుల వ‌సూలు విష‌యంలో ప్ర‌భుత్వ ఆజ‌మాయిషి ఉండొద్దంటూ ఆయా ప్రైవేట్ ఇంజ‌నీరింగ్ కాలేజీలు కోర్టును ఆశ్ర‌యించాయి. 

ఫీజుల పెంపు విష‌యంపై సందిగ్ధ వాతావ‌ర‌ణం నెల‌కొన‌డంతో ఎంసెట్ ఆప్ష‌న్ల ప్ర‌క్రియ మ‌ళ్లీ వాయిదా ప‌డింది. కాలేజీల యాజ‌మాన్యాల‌తో ఏఎఫ్ ఆర్ సీ స‌మావేశం నిర్వ‌హించింది. 15 నుంచి 20 శాతం వ‌ర‌కు తాత్కాలికంగా పెంచుతామ‌ని ప్ర‌తిపాదించింది. రేప‌టి నుంచి వెబ్ ఆప్ష‌న్ల ప్ర‌క్రియ ప్రారంభం కావాల్సి ఉండ‌గా వాయిదా ప‌డింది. కొన్ని కాలేజీలు అంగీక‌రించినా మ‌రికొన్ని కాలేజీలు కోర్టుకు వెళ్ల‌డంతో ఆల‌స్యం కానుంది. ప్ర‌స్తుతం వార్షిక రుసుము 50 వేల లోపు వుంటే దానిపై 20 శాతం , 50 వేలు దాటితే 15 శాతం రుసుముల‌ను తాత్కాలికంగా పెంచుతామ‌ని టీఎస్ఆర్‌సీ ప్ర‌తిపాదించింది. మ‌రో నెల లేదా నెల‌న్న‌ర లోపు తుది రుసుముల‌ను ఖ‌రారు చేస్తామ‌ని జ‌స్టిస్ స్వ‌రూప్ రెడ్డి తెలిపారు. అయితే ఈ విష‌యంలో విద్యార్థులు ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని, 3 నుంచి వెబ్ ఆప్ష‌న్ల ప్ర‌క్రియ ప్రారంభించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఉన్న‌త విద్యా మండ‌లి ఛైర్మ‌న్ పాపిరెడ్డి వెల్ల‌డించారు.

దీంతో ఇప్ప‌టికే ప్రైవేట్ ఇంజ‌నీరింగ్ కాలేజీలు సీట్ల ధ‌ర‌ల‌ను అమాంతం పెంచేశాయి. పేరొందిన కాలేజీల్లో అయితే ఏకంగా ఒక్కో సీటు ధ‌ర 14 ల‌క్ష‌లు ప‌లుకుతోందంటే న‌మ్మ‌గ‌ల‌మా. ఫీజుల దందాపై ఏకంగా మాఫియా గ్రూపులు సిటీలో వెలిశాయి. మ‌రో వైపు ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన ఇంజ‌నీరింగ్ కాలేజీలు, యూనివ‌ర్శిటీలు పిల్ల‌ల‌ను ఒక‌చోట నిలువ‌నీయ‌డం లేదు. సీట్లు అయిపోతున్నాయంటూ ఫోన్ల‌తో టార్చ‌ర్ చేస్తున్నారు. అస‌లు ఏది మంచిదో ఏది బాగోలేదో తెలియ‌క ఇబ్బందులు ప‌డుతున్నారు. అన్ని కాలేజీల ల‌క్ష్యం ఒక్క‌టే సీట్ల పేరుతో డ‌బ్బులు దండు కోవ‌డ‌మే. రాను రాను ఉన్న‌త విద్య ఉన్న‌త వ‌ర్గాల‌కే ద‌క్కుతుంద‌నే అనుమానం క‌లుగుతోంది. ప్ర‌భుత్వం మాత్రం చూసీ చూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!