ప్రధానిపై పోటీకి సై అంటున్న రైతన్నలు
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన పసుపు రైతులు ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తమకు అన్యాయం జరిగిందని, పసుపు బోర్డు ఏర్పాటు చేయలేదని, కనీస మద్ధతు ధర కల్పించలేదంటూ 178 మంది రైతులు స్వచ్ఛందంగా లోక్‌సభ ఎన్నికల బరిలో పోటీకి దిగారు. ఇంత పెద్ద ఎత్తున పోటీ చేయడం ఇదే మొదటి సారి. గతంలో ఉమ్మడి పాలమూరు జిల్లా జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని పోలేపల్లి గ్రామానికి చెందిన 18 మంది మహబూబ్‌నగర్ ఎంపీ సీటుకు పోటీ చేశారు. 98 వేల ఓట్లను సాధించి మిగతా అభ్యర్థులు తలదించుకునేలా చేశారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఏనాడూ తమ సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన పాపాన పోలేదని, తమ గురించి పట్టించు కోలేదంటూ నిప్పులు చెరిగారు.
రైతు సంఘం ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన కనిపించలేదు. జిల్లా కలెక్టర్‌కు మొర పెట్టుకున్నారు.తమ సమస్యను పరిష్కరించలేని స్థితిలో ప్రభుత్వం ఉందంటూ నిప్పులు చెరిగారు. పొద్దస్తమానం రైతు జపం చేసే సీఎం కేసీఆర్ తమ గురించి ఒక్క మాట కూడా మాట్లాడక పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. తాను పార్లమెంట్‌లో పసుపు బోర్డు చేయాలంటూ పలుమార్లు లోక్‌సభలో ప్రస్తావించడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన పాపాన పోలేదంటూ ఎంపీ కవిత ఆరోపించారు. జిల్లాకు చెందిన రైతులందరికి కనీస మద్ధతు ధర ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఈ విషయంపై అన్నదాతలు ఎంపీపై మండిపడ్డారు. ప్రతిపక్షాలు కావాలని రైతులను రెచ్చగొడుతున్నాయని చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని రైతు సంఘం అధ్యక్షుడు కోరారు.
దేశంలోనే అత్యధిక పసుపు పండించే ప్రాంతాల్లో నిజామాబాద్ జిల్లా ఒకటి అని, అంతేకాకుండా ఇక్కడ చెరుకు కూడా ఎక్కువగా పండుతోందని ఈ విషయం తెలుసు కోకుండా మాట్లాడటం భావ్యం కాదన్నారు. ఇలాగైతే తమ సమస్య అలాగే ఉండిపోతుందని, పెద్ద మొత్తంలో బాధితులమైన రైతులంతా ఎన్నికల్లో పోటీ చేస్తే దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతుందని, ఆ దిశగా తమ సమస్య తీవ్రత ఏమిటో ప్రధాన మంత్రికి తెలుస్తుందనే ఉద్ధేశంతోనే పోటీలో ఉన్నామని రైతులు తెలిపారు. తెలంగాణలో ఎన్నికలు అయిపోవడంతో ..వారు మరో అసాధారణమైన నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే ..ఏకంగా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో బీజేపీ తరపున అభ్యర్థిగా ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేయనున్నారు. అక్కడి నుంచి తాము పెద్ద ఎత్తున పోటీ చేస్తే ..తమ సమస్యను అప్పుడైనా పీఎం గుర్తిస్తారని వారు దరఖాస్తు చేసేందుకు బయలు దేరారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి