జ్ఞానపు వెలుగులు..లోకానికి దిక్సూచీలు ..పుస్తకాలు
ప్రపంచాన్ని మార్చే శక్తి పుస్తకాలలో ఉంది. ఆహారం లేకుండా నేనుండగలను. కానీ పుస్తకాలు చదవకుండా..రాయకుండా నేనుండలేనంటూ వాపోయాడు..దాస్ కేపిటల్ సృష్టికర్త కార్ల్ మార్క్స్ మహాశయుడు. ఆయన అష్ట కష్టాలు పడ్డాడు. ఏంగిల్స్ అనే స్నేహితుడు లేక పోతే పెట్టుబడి పూర్తయ్యేది కాదేమో. జీవితాంతం కన్నీళ్లతోనే ఆయన సహవాసం చేశాడు. కానీ రాయకుండా ఉండలేక పోయాడు. వేలాది పుస్తకాలను అమూలాగ్రం చదివాడు. ఇవాళ పుస్తక దినోత్సవం. రోజు రోజుకు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. టెక్నాలజీ పరంగా ఎన్నో మార్పులు వచ్చాయి. కానీ పుస్తకాలు అంతకంతకూ ప్రచురితం అవుతూనే ఉన్నాయి. ఫిక్షన్..నాన్ ఫిక్షన్ ..ఇలా ప్రతి విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది పుస్తకాలు ప్రింటింగ్‌కు నోచుకుంటున్నాయి. కవిత్వం, సాహిత్యం, నాటకం, కళలు, వ్యక్తిగత జీవిత చరిత్రలు, స్వగతాలు, అనువాదాలు, నవలలు, నాటికలు, గల్పికలు, చరిత్ర, సామాజిక శాస్త్రాలు ఇలా ప్రతి రంగానికి చెందిన పుస్తకాలు విరివిగా దొరుకుతున్నాయి.
లెక్కకు మించి చిన్నారులు, పెద్దలు , మహిళలు , ఇతర రంగాలకు చెందిన వారంతా చదవడం హాబీగా పెట్టుకున్నారు. అన్ని భాషల్లో పుస్తకాలు లభిస్తున్నాయి. ఇంగ్లీష్ భాషలోనే ఎక్కువగా పుస్తకాలు ప్రచురితమవుతున్నాయి. మార్కెట్‌లో అన్ని దేశాలకు చెందిన వారంతా తమ అనుభవాలను, తాము సాధించిన విజయాలను పుస్తకాల రూపంలో తెలియ చేస్తున్నారు. ప్రచురణ కర్తలకు మరింత లాభాలు తెచ్చిపెడుతున్నాయి. ఈకామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్, ఇతర పబ్లిషింగ్ హౌసెస్ కూడా ఆన్ లైన్‌లో, ఆఫ్ లైన్‌లో అమ్మకాలు సాగిస్తున్నారు. జస్ట్ క్లిక్ చేస్తే చాలు మీరు కోరుకున్న పుస్తకాలు మీ వద్దకు వస్తున్నాయి. సిస్టం మారింది. పుస్తకాలు ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉండాలని, ప్రతి ఒక్కరు రోజుకు ఒక్కసారైనా మంచి పుస్తకాన్ని తప్పక చదవాలని , మన మాతృభాషలోనే మాట్లాడాలని భాషాభిమానులు, సాహిత్యకారులు కోరుతున్నారు.
పుస్తకాలు కొనుగోలు చేసే వారి కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతి ఏటా పెద్ద ఎత్తున పుస్తక ప్రదర్శన నిర్వహిస్తోంది. ఎన్నడూ లేనంతగా పిల్లలు, పెద్దలు, కుటుంబీకులు , అభిమానులు ఎక్కువ సంఖ్యలో వచ్చి కొనుగోలు చేస్తున్నారు. వారికి పోటీలు పెట్టి..చిన్నారులను పుస్తకాలు కొనుగోలు చేసేలా చేస్తున్నారు. ఆధ్యాత్మికం, ఐటీ, యోగా, గురువులు, పీఠాధిపతులు, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు ఎక్కువగా కొంటున్నారు. విదేశాలకు చెందిన పాపులర్ రచయితలు రాసిన బుక్స్‌కు ఎక్కువ డిమాండ్ ఉంటోంది. ఎన్ని డబ్బులైనా సరే పెట్టేందుకు వెనుకాడడం లేదు. పుస్తకాలు లేని గదులు మనుషులు లేని శ్మశానం లాంటివి అన్నట్టుగా ..స్మార్ట్ ఫోన్లు పెరిగినా, టెక్నాలజీ రాజ్యం ఏలుతున్నా.. పుస్తకాలు వస్తూనే ఉన్నాయి. పాతవి తెరమరుగైనా సరే కొత్తవి ..కొంగొత్త విషయాలతో రిలీజ్ అవుతూనే ఉన్నాయి.
పిల్లలకు కావాల్సిన కథల పుస్తకాలను పేరెంట్స్ కొనేందుకు ఇష్టపడుతున్నారు. పుస్తకాలు కావాలనుకుంటే కొనేందుకు స్టాల్స్ ..ఇపుడు విరివిగా ఉంటున్నాయి. ఆయా ఆర్టీసీ బస్టాండ్లలో, రైల్వే స్టేషన్‌లలోని బుక్ స్టాల్స్‌లలో , ప్రతి ఆదివారం హైదరాబాద్‌లోని ఆబిడ్స్, కోఠి, సికింద్రాబాద్ లలో తక్కువ ధరకే లభిస్తున్నాయి. సో..ఇంకెందుకు ఆలస్యం...కందుకూరి వీరేశలింగం అన్నట్టు ..చిరిగిన చొక్కా అయినా తొడుక్కోండి..కానీ పుస్తకాలను కొనుగోలు చేయడం మాత్రం ఆపకండి అని. పుస్తకాలను ప్రేమిద్దాం. కొనుగోలు చేద్దాం..వాటిని ఆస్వాదిద్దాం. పది మందికి చదవమని చెబుదాం. ఎందుకంటే పుస్తకాలు మనలో ఉన్న మస్తిష్కాలకు ఆక్సిజన్ ఇస్తాయి. మనల్ని మనుషులుగా మారుస్తాయి. పుస్తకాలు వర్దిల్లాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి