ఇంట‌ర్ బోర్డు ద‌గ్గ‌ర టెన్ష‌న్ టెన్ష‌న్ ‍ - హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు

విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళ‌న‌ల‌తో హైద‌రాబాద్‌లోని ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు కార్యాల‌యం వ‌ద్ద ఉత్కంఠ భ‌రిత వాతావ‌ర‌ణం నెల‌కొంది. పెద్ద ఎత్తున బాధితులు త‌ర‌లి రావ‌డంతో ప‌రిస్థితి చేయి దాట‌కుండా ఉండేందుకు భారీగా పోలీసు బ‌ల‌గాల‌ను మోహ‌రించారు. కార్యాల‌యం లోప‌లికి వెళ్ల‌కుండా ఉండేందుకు బ్యారికేడ్ల‌ను ఏర్పాటు చేశారు. 16 మందికి పైగా విద్యార్థినీ విద్యార్థులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డినా సంబంధిత శాఖ మంత్రి ఎట్ట‌కేల‌కు ఇవాళ సూర్యాపేట‌లో స్పందించారు. ఇంట‌ర్ ఫ‌లితాల విడుద‌ల‌లో జ‌రిగిన పొర‌పాట్ల కంటే అపోహ‌లే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని ..అన్నారు. విద్యార్థులు, పేరెంట్స్ ఆందోళ‌న చెంద‌వ‌ద్దంటూ కోరారు. ప్ర‌తి ఒక్క‌రికి న్యాయం జ‌రుగుతుంద‌ని..ద‌య‌చేసి ఆత్మ‌హ‌త్య‌ల‌కు ..అఘాయిత్యాల‌కు పాల్ప‌డ‌వ‌ద్దంటూ విద్యార్థుల‌కు సూచించారు.

ఒక‌వేళ త‌మ‌కు అన్యాయం జ‌రిగింద‌ని భావిస్తే..రీ వాల్యూయేష‌న్ కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని, ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన క‌మిటీ నివేదిక వ‌చ్చాక బాధ్యుల‌పై ,సాంకేతికంగా త‌ప్పులు వుంటే సంస్థ పైన‌..మాన‌వ పొర‌పాట్లు జ‌రిగితే ..సంబంధిత శాఖాధికారుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని జ‌గదీశ్ రెడ్డి చెప్పారు. విద్యార్థులు, త‌ల్లిదండ్రుల‌ను ప్ర‌తిప‌క్షాలు, కొన్ని సంఘాలు రెచ్చ‌గొట్టేందుకు య‌త్నిస్తున్నాయ‌ని..అది మంచి ప‌ద్ధ‌తి కాద‌న్నారు. రాజ‌కీయాలు చేయ‌డం మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. మ‌రో వైపు కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు ఎనుముల రేవంత్ రెడ్డి, సంప‌త్ కుమార్‌, త‌దిత‌రులు ఇంట‌ర్ బోర్డు కార్యాల‌యం వ‌ద్ద ఆందోళ‌న చేప‌ట్టిన స్టూడెంట్స్, పేరెంట్స్‌కు మ‌ద్ధ‌తుగా ధ‌ర్నా చేప‌ట్టారు. ఈ విష‌యంపై త‌క్ష‌ణ‌మే విచార‌ణ‌కు ఆదేశించాల‌ని, పిల్ల‌లు చ‌నిపోవ‌డానికి నైతిక బాధ్య‌త వ‌హిస్తూ సంబంధిత శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి త‌క్ష‌ణ‌మే త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు.

ఇదిలా వుండ‌గా, ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు వైఫ‌ల్యాల‌పై రాష్ట్ర అత్యున్న‌త న్యాయ స్థానం హైకోర్టులో లంచ్ మోష‌న్ పిటిష‌న్ దాఖ‌లు చేసింది బాల‌ల హ‌క్కుల సంఘం. దీనిని విచార‌ణ‌కు స్వీక‌రించింది కోర్టు. బాధ్యుల‌పై సెక్ష‌న్ 304 కింద కేసు న‌మోదు చేయాల‌ని పిటిష‌న‌ర్ కోరారు. చ‌నిపోయిన 16 మంది విద్యార్థుల కుటుంబాల‌కు న‌ష్ట ప‌రిహారం చెల్లించాల‌ని విజ్ఞ‌ప్తి చేశార‌. ఎలాంటి ఫీజులు లేకుండానే పేప‌ర్ రీ వాల్యూయేష‌న్ చేయాల‌ని విన్న‌వించారు. గ్లోబ‌రిన్ టెక్నాల‌జీ సంస్థ‌ను బ్లాక్ లిస్టులో పెట్టాల‌ని, సంస్థ‌పై త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పిటిష‌న్ లో కోరారు. అంతేకాక ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఇంట‌ర్ బోర్డు కార్య‌ద‌ర్శి , విద్యా శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిల‌ను ప్ర‌తి వాదులుగా చేర్చారు పిటిష‌న‌ర్.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!